Minister KTR | ఎల్లారెడ్డిపేట, ఫిబ్రవరి 27: అందరూ ఉన్నా పట్టింపులేక అనాథల్లా బతుకీడ్చే వృద్ధులు, పలుకరించేవారు లేక ఒంటరితనంతో బాధపడే పండుటాకుల కోసం మంత్రి కేటీఆర్ సరికొత్త ఆలోచన చేశారు. జీవిత చరమాంకంలో ఆహ్లాదాన్ని అందించి ఆయుష్షు పెంచేందుకు మానవీయ కోణంలో వినూత్న వేదికకు శ్రీకారం చుట్టారు. భోజన, వసతి, ఆరోగ్య సదుపాయాలతో కూడిన డే కేర్ (వృద్ధుల సంరక్షణ కేంద్రం) సెంటర్‌ను రాష్ట్రంలోనే తొలిసారిగా ఎల్లారెడ్డిపేటలోని ఎస్టీ హాస్టల్లో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. సోమవారం మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ప్రారంభోత్సవానికి అధికారులు ఏర్పాట్లు పూర్తిచేయగా, వృద్ధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జీవిత చరమాంకంలో పలకరింపు, ఆదరణ కోరుకునే వృద్ధులకు మంత్రి కేటీఆర్ అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. మలిదశలో ఆహ్లాదజీవితాన్ని ప్రసాదించి ఆయుష్షు పెంచేందుకు మానవీయ కోణంలో రాష్ట్రంలోనే తొలిసారి ఎల్లారెడ్డిపేటలోని ఎస్టీ హాస్టల్లో ప్రయోగాత్మకంగా డే కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. సోమవారం ప్రారంభించి, అందుబాటులోకి తేనుండగా, అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
సెంటర్లో సకల వసతులు..
డే కేర్ సెంటర్లో వృద్ధుల ఆరోగ్య పరీక్షలు చేసేందుకు, వారి బాగోగులు చూసేందుకు ఒక కేర్‌టేకర్ ఉంటారు. అలాగే వృద్దుల కాలక్షేపానికి పలు వార్తా పత్రికలు అందుబాటులో ఉంటాయి. ఆడుకునేందుకు టేబుల్ టెన్నిస్, చెస్, వైకుంఠపాళీ, క్యారం బోర్డులాంటి ఆట వస్తువులను ఏర్పాటు చేశారు. కూర్చుని మాట్లాడుకునేందుకు ఒక వేదికను నిర్మించారు. ఎక్సర్సైజ్ చేసుకునేందుకు అవసరమైన సాధనాలు, ఫిజియో థెరఫీ పరికరాలను అందుబాటులో ఉంచారు. తప్పని పరిస్థితుల్లో 20 మంది దాకా భోజనం అందించేందుకూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉండాలనుకునేవారి కోసం 20 బెడ్లతో కూడిన హాస్టల్‌ను ఏర్పాటు చేశారు.
ఆరోగ్య, కాలక్షేప కేంద్రంగా..
ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై చిన్న కుటుంబాలు ఏర్పడితన తర్వాత వృద్ధ తల్లిదండ్రుల ఆలనా, పాలనా ఆగమ్య గోచరంగా మారింది. కొడుకులు, కూతుళ్లు, కోడల్లు, అల్లుళ్లు పనులపై ఆఫీసులకు, మనమడు, మనుమరాళ్లు స్కూళ్లు, కాలేజీలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో తమతో గడిపే వారు, పలకరించే వారు లేకపోవడం, ఇంకా ముచ్చటించేందుకు తమ వయస్సు వాళ్లు చుట్టు పక్కల లేకపోవడంతో మనోవేదన చెందుతున్నారు. ఫలితంగా అనారోగ్యానికి గురై మృతిచెందుతున్న ఘటనలు ఇటీవలికాలంలో ఎన్నో ఉన్నాయి. ఇలాంటి మానవీయ ఘటనలను గమనించిన మంత్రి కేటీఆర్ వృద్ధుల జీవితంలోని చివరి గడియలను ఆనందంగా, ఆరోగ్యంగా గడిపేందుకు వారి ఆయుష్షును పెంచే బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోనే తొలి వృద్ధుల సంరక్షణ కేంద్రాన్ని ఎల్లారెడ్డిపేటలోని ఎస్టీ హాస్టల్ భవనంలో ఏర్పాటు చేయించారు.
మలివయసులో ఆహ్లాదం కోసమే..
వృద్ధులు విశ్రాంత సమయాన్ని ఆహ్లాదంగా గడిపేందుకు మానసిక బలాన్ని పెంచాలనే ఉద్దేశంతోనే మంత్రి కేటీఆర్ ఈ డేకేర్ సెంటర్ ఏర్పాటు చేయించారు. ఇందులో వృద్ధులు కాలక్షేపానికి, ఆహ్లదం, సేదతీరడం కోసం అన్ని రకాల సదుపాయాలు కల్పించారు. ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న అమాత్యుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కేంద్రాన్ని వృద్ధులు సద్వినియోగం చేసుకోవాలి.
– తోట ఆగయ్య, బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు