బొమ్మకల్ సర్పంచ్ పురుమల్ల శ్రీనివాస్‌పై రౌడ్‌షీట్ ఓపెన్ అయిన విషయం ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి గత మార్చిలోనే ఈ కేసు నమోదైనా.. ఇప్పటివరకు బయటకు రాకపోవడంతో ఇన్నాళ్లూ గోప్యంగా ఉన్నది. కానీ.. కాంగ్రెస్‌లోని ఓ వర్గం ఈ లేఖతోపాటు అతడిపై నమోదైన కేసుల వివరాలను సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తోంది.
కాంగ్రెస్ నుంచి టికెట్ రేసులో ఉన్న పురుమల్లకు అడ్డుకట్ట వేసేందుకు మరో వర్గం ఈ విధానాన్ని ఎంచుకున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరికొంత మంది సైతం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారని తెలుస్తుండగా.. ఇప్పటికే రౌడీ షీట్ ఓపెన్ చేసిన పోలీసులు పురుమల్లపై ఏకంగా పీడీ యాక్టు నమోదు చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
– కరీంనగర్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ)
కరీంనగర్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : బొమ్మకల్ గ్రామ సర్పంచ్ పురుమల్ల శ్రీనివాస్‌పై అనేక ఆరోపణలున్నాయి. సుదీర్ఘకాలం సర్పంచ్‌గా ఉన్న ఆయన అనేక భూ కబ్జాలకు పాల్పడినట్లు కేసులు కూడా నమోదయ్యాయి. బెదిరింపులకు పాల్పడడం, అధికారులకు తప్పుడు సమాచారం అందించి భూముల రికార్డులు మార్చడం, అనేక భూములు తన పేరిట, తన అనుచరుల పేరిట రాయించుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అనే విమర్శలున్నాయి.
ఒకే స్థలాన్ని నలుగురైదురికి అమ్మడం, వివాదాలు సృష్టించి తనకు అనుకూలంగా మార్చుకొని భూ సమస్యలు పరిష్కరించి వాటాలు డిమాండ్ చేయడం వంటి ఆరోపణలను సైతం ఆయన గతంలో ఎదుర్కొన్నారు. పదుల సంఖ్యలో ఉన్న ఇతని బాధితులు అనేక సార్లు పోలీసుకు ఫిర్యాదులు చేశారు. కోర్టులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో గత మార్చిలో జరిగిన ఒక సంఘటన తర్వాత కరీంనగర్ రూరల్ పోలీస్‌ల ఎదుట లొంగిపోయిన పురుమల్ల శ్రీనివాస్‌పై రౌడీ షీటర్ తెరిచారు.
అయితే, అప్పటి నుంచి స్తబ్ధంగా ఉన్న ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడం చర్చనీయాంశంగా మారింది. నిజానికి పురుమల్ల్లపై మార్చిలో రౌడీ షీటర్ ఓపెన్ చేసినపుడు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లాడు. పీడీ యాక్ట్‌కు అప్పుడే పోలీసులు ప్రతిపాదించారు. ఈ విషయం తెలిసిన పురుమల్ల శ్రీనివాస్ రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం నుంచి నాట్ టూ అరెస్ట్ ఆర్డర్లు పొందడంతో ఈ వ్యవహారం అక్కడితో ఆగిపోయినట్లుగా అందరూ భావించారు.
కాంగ్రెస్ టికెట్‌కు దరఖాస్తు
మొన్నటి వరకు అధికార బీఆర్ఎస్లో ఉన్న పురుమల్ల శ్రీనివాస్ భార్య లలిత కరీంనగర్‌రూరల్ మండల జడ్పీటీసీ సభ్యురాలుగా కొనసాగుతున్నారు. అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్ తనను కాపాడుకునేందుకు ఉన్నత పదవులవైపు చూస్తున్నారని ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం గాంధీభవన్‌కు వెళ్లి కరీంనగర్ అసెంబ్లీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారన్న అభిప్రాయాలు వచ్చాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో అధికార పార్టీకి రాజీనామా చేసిన ఆయన, కాంగ్రెస్ టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఇటీవల అదే కాంగ్రెస్ నుంచి టికెట్ అశిస్తున్న పలువురు నాయకులు కూడా కరీంనగర్ అసెంబ్లీ టికెట్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పురుమల్ల్లకు అడ్డుకట్ట వేయాలని భావిస్తున్న కొంత మంది నేతలు.. అతనిపై ఉన్న కేసులు చిట్టాలు, ఎదుర్కొన్న కేసులు, అక్రమాలు, అవినీతి ఆరోపణల వంటి అంశాలను అధిష్టానానికికు ఫిర్యాదు చేయడంతో పాటుగా.. సోషల్‌మీడియాలో వైరల్ చేస్తున్నారని తెలుస్తోంది.
సోషల్‌మీడియాకు మాత్రమే పరిమితం కాకుండా.. సదరు గ్రామస్తుల ద్వారా సైతం. పురుమల్లపై నమోదైన కేసుల వివరాలతో ఫిర్యాదులను కాంగ్రెస్ అధిష్టానానికి ఇప్పటికే అందించారు. ఫిర్యాదులో అతనిపై నమోదైన దాదాపు 24 కేసుల వివరాలను పోలీసులు పెట్టిన సెక్షన్లతో రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. మామూలు సర్పంచ్‌గా ఉన్నపుడే ఇన్ని భూములు కబ్జా చేసిన పురమల్లకు ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తే జరిగే పరిణామాలను బొమ్మకల్‌కు చెందిన పురమల్ల శ్రీనివాస్ బాధితులు కాంగ్రెస్ అధిష్టానానికి వివరించినట్లు తెలుస్తోంది.
పీడీ యాక్ట్ వైపు అడుగులు?
ఇన్నాళ్లూ బీఆర్ఎస్లో ఉన్న పురుమల్ల్ల శ్రీనివాస్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నుంచి టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్న సమయంలో.. అతని కేసుల వ్యవహారమంతా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో… మిగిలిన చాలా మంది బాధితులు కొత్తగా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి రెడీ ఆయ్యారని తెలుస్తోంది. ఇప్పటికే.. పోలీసుల ముందు తమకు జరిగిన అన్యాయాలను సైతం వివరించినట్లు తెలుస్తోంది. అన్యాయం జరిగిన బాధితులు.. పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేయగా పోలీసులు.. వెరిఫై చేస్తున్నట్లుగా సమాచారం.
ఇప్పటికే అనేక భూకబ్జాలు, బెదిరింపులు, రికార్డు మార్పుల కేసులు ఉన్న పురుమల్ల శ్రీనివాస్‌పై త్వరలోనే పీడీ యాక్ట్ నమోదు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్‌పై ఏ క్షణంలోనైనా పీడీ యాక్ట్ నమోదై, అరెస్ట్ చేసినట్లయితే ఆయనకు జైలు జీవితం తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టికెట్ అశిస్తున్న ఇతర కాంగ్రెస్ వర్గీయులు మాత్రం.. మరిన్ని అధారాలతో ముందు ముందు ఫిర్యాదుల పరంపరను పెంచే దిశగా సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా కాంగ్రెస్ వర్గీయుల మధ్య నెలకొన్న పోరుతో.. పురుమల్ల వ్యవహారం అంతా బహిర్గతం అయినట్లుగా భావిస్తున్నారు.