Monkeys | వేములవాడ రూరల్, అక్టోబర్ 12 : వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజ్ పల్లి లో కోతుల బెడద ఎక్కువగా ఉండడంతో గ్రామస్తులంతా ఏకమై కోతులను తరిమేందుకు నడుం కట్టారు. గ్రామంలోని అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో అంతా ఏకమై కోతులను గ్రామం నుండి తరిమి వేయాలని ఆదివారం నిర్ణయించుకున్నారు. దాదాపు 100 మంది గ్రామస్తులు గ్రామంలో ఉన్న కోతులను ఊరు బయటకు పంపించేందుకు ప్రయత్నించారు.
చాలా రోజుల నుండి కోతుల వల్ల గ్రామంలో తీవ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంట్లోని సామాగ్రితోపాటు పంట పొలాల్లో పంటను సైతం ధ్వంసం చేస్తున్న కోతులను ఊరు నుండి తరిమేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో గ్రామంలోని అన్ని కుల సంఘాల సభ్యులు చేతిలో కరెంటు పట్టుకుని కోతి కనబడితే ఊరు నుండి బయటకు పంపించేందుకు ప్రయత్నాలు చేశారు. దాదాపు 200 కోతుల వరకు గ్రామంలో ఉండడంతో వాటిని గ్రామం నుండి తరిమేందుకు దాదాపు రెండు గంటల పాటు శ్రమించి ఊరు నుండి బయటకు పంపారు. కాగా మరోసారి గ్రామస్తులు అంత ఏకమై కోతులను గ్రామ పరిసరాల నుండి బయట పంపించేందుకు మరో రోజు సమావేశం ఏర్పాటు చేసుకొని కోతులు తరిమే ప్రయత్నం చేస్తామని గ్రామస్తులు వెల్లడించారు.