NREGS | పెద్దపల్లి, మే21: గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఉపాధి హామీ పథకాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో ఈజీఎస్ పనులపై సంబంధిత అధికారులతో కలెక్టర్ బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని జిల్లాలో సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. గ్రామాలలో ఉపాధి హామీ కూలీలకు పని కల్పించాలని, అవసరమైన వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఉపాధి హామీ కూలీల సంఖ్య పెంచెందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని చెప్పారు. చిన్న నీటిపారుదల, లిఫ్ట్ ఇరిగేషన్, చెరువులు, ఎస్సారెస్పీ కాల్వల మరమ్మతు పనులు గుర్తించి పనులు చేయించాలని సూచించారు. యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం కింద లబ్ధిదారులకు జూన్ 2 నాటికి స్వయం ఉపాధి యూనిట్ మంజూరు పత్రం పంపిణీ చేసే విధంగా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈవో నరేందర్, డీఆర్డీవో ఎం కాళిందిని, ఎంపీడీవోలు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.