రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 4( నమస్తే తెలంగాణ) : సహకార విద్యుత్ సరఫరా సంస్థ (సెస్)ను ఎట్టిపరిస్థితిలోనూ విలీనం చేయనీయమని, అందరి సహకారంతో అడ్డుకొని న్యాయ పోరాటం చేసి కాపాడుకుంటామని చైర్మన్ చిక్కాల రామారావు స్పష్టం చేశారు. ఈ మేరకు సిరిసిల్ల శివారులోని సాయి మణికంఠ ఫంక్షన్హాల్లో సెస్ 52వ మహాజన సభ ఆయన అధ్యక్షతన జరిగింది. మొదట సహకార జెండాను ఆవిష్కరించి, మాట్లాడారు. సెస్ లైసెన్స్ కోసం డిసెంబర్లోనే ప్రభుత్వానికి పంపించామని ఎందుకు పెండింగ్ పెట్టిందని ప్రశ్నించారు.
మార్చి 31 గడువు ముగియగానే అర్ధరాత్రి దాటిన తర్వాత దొంగల మాదిరిగా సెస్ కార్యాలయంలో చొరబడి, పోలీస్ బందోబస్తు మధ్య మీటింగ్‌లు పెట్టారని తెలిపారు. ఇప్పటి వరకు లైసెన్స్ రెన్యూవల్ ఎందుకు పెండింగ్ పెట్టిందో చెప్పలేదని, తమకు నోటీసులు సైతం ఇవ్వకుండానే సెస్‌లో చొరబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 56 ఏండ్లుగా ఎనలేని కీర్తి సంపాదించి ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడి, ప్రపంచ వ్యాప్తంగా సెస్ మన్ననలు పొందిందన్నారు. జాతీయ స్థాయి అవార్డులు సైతం దక్కించుకుందని తెలిపారు. సహకార రంగాన్ని కేంద్ర ప్రభుత్వం సైతం ప్రోత్సహిస్తుందని, కొత్తగా సహకార శాఖకు కేంద్ర హోంశాఖ మంత్రి ఉన్నారని గుర్తు చేశారు. సహకార సంస్థలను నిర్వీర్యం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేయడం దారుణమన్నారు.
నష్టాల్లో ఉందని, అవినీతి అంటూ దుష్ప్రచా రం చేస్తూ పథకం ప్రకారం విలీనానికి కొందరు కుట్రకు తెరలేపారని, సెస్‌లో ఎలాంటి అవినీతి జరగలేదని తెలిపారు. నష్టాల్లో లేదని, బకాయిలులేవని, ప్రభుత్వమే బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. సెస్‌పై కక్షగట్టి కొందరు పథకం ప్రకా రం బదనాం చేస్తూ, అభాసుపాలు చేస్తూ విలీనం చేయాలని కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మూడేళ్ల మూడు నెలల పాలనలో అవినీతికి తావివ్వకుండా సెస్ అభివృద్ధికి కృషి చేశామన్నారు. అవసరమైతే విచారణ చేసుకోవాలని తేల్చి చెప్పారు.
సెస్ పాలకవర్గ ప్రతినిధులు, వినియోగదారులు, అందరి సహకారంతో సెస్‌ను కాపాడుకుంటామని స్పష్టం చేశా రు. ఒకవైపు న్యాయస్థానంలో పోరాడుతూనే.. మరోవైపు ప్ర జా ఉద్యమం చేస్తామని, ఇందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశా రు. సమావేశంలో సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, డైరెక్టర్లు దిడ్డి రమాదేవి, దార్నం లక్ష్మీనారాయణ, మల్లుగారి ర వీందర్‌రెడ్డి, గౌరినేని నారాయణరావు, సందుపట్ల అంజిరెడ్డి, వరుస కృష్ణహరి, మాడుగుల మల్లేశం, పొన్నాల శ్రీనివాసరా వు, రేగులపాటి హరిచరణ్‌రావు, అకుల దేవరాజం, కొట్టెపల్లి సుధాకర్, సెస్ ప్రతినిధులు, సెస్ సిబ్బంది, తదితరులు ఉన్నారు.

విలీనం వద్దంటూ ముక్త కంఠంతో మద్దతు
సెస్‌ను విలీనం చేయవద్దని సెస్ పరిధిలోని అన్ని మండలాలు, పట్టణాల నుంచి సెస్ ప్రతినిధులు తీర్మానాలు చేసి మహాజన సభలో అందించారు. ఈ సందర్భంగా వారు తమ గళాన్ని వినిపించారు. సెస్‌ను కాపాడుకోవడానికి ఎలాంటి పోరాటాలకైనా సిద్ధమని స్పష్టం చేశారు. పాలకవర్గానికి సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రకటించారు. తీర్మానాలకు కరతాళ ధ్వనులతో మద్దతు పలికారు. సెస్ యధావిధిగా ఉండాలంటూ నినదిస్తూ జై కొట్టారు.
సైనికుల్లా పోరాడాలి
సెస్‌ను కాపాడుకోవడానికి సైనికుల్లా పోరాటం చేయాలి. రాజకీయాలకతీతం గా ఐక్యతతో ముందుకెళ్లాలి. నాడు రా జకీయ ప్రత్యర్థులైన చెన్నమనేని రాజేశ్వర్‌రావు, జువ్వాడి నర్సింగరావు సహకార స్ఫూర్తితో ఈ ప్రాంత మేలుకోసం సంస్థను స్థాపించా రు. లాభాల్లో ఉన్న సెస్‌ను నష్టాల్లో ఉన్న టీజీఎన్పీడీసీఎల్లో కలుపాలనుకోవడం హాస్యాస్పదం. ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ రెండు బోర్డులు రూ.68 వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయి. అలాంటి వాటిల్లో సెస్‌ను ఎలా కలుపుతరు. కేవలం ఇది రాజకీయ దురుద్దేశం, కుట్రపూరితమే. సెస్‌ను కోల్పోకుండా ఉం డేందుకు గ్రామగ్రామాన చైతన్యం చేసి సైనికుల్లా పోరాడుతాం.
– దేవరకొండ తిరుపతి, వైస్ చైర్మన్
సెస్ కోసం మరో ఉద్యమం
సెస్ అందరికీ ఒక సెంటిమెంట్. ఇంటి సంస్థ. ఎనలేని సేవలు అందించింది. సిరిసిల్లకు పేరు తెచ్చింది. దీనిని కాపాడుకుంటాం. వెంటనే విలీన ఆలోచన విరమించుకోవాలి. సెస్ లైసెన్స్‌ను పునరుద్ధరించాలి. విలీనం అంశాన్ని విరమించుకోకపోతే మరో ఉద్యమం తప్పదు. తెలంగాణ ఉద్యమంతోపాటు జిల్లా కోసం చేసిన ఉద్యమాల్లాగానే సెస్ కోసం మరో ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సెస్‌ను కాపాడుకోవడానికి పాలకవర్గానికి సంపూర్ణ సహకారాలు అందిస్తాం. ఉద్యమానికి ఆర్థికంగానూ చేయూతను అందిస్తాం.
– ఎండీ సత్తార్, సెస్ ప్రతినిధి
కన్నతల్లి లాంటి సంస్థను పోగొట్టుకోవద్దు
సెస్ కన్నతల్లి లాంటిది. అలాంటి సంస్థను పోగొట్టుకోవద్దు. 56 ఏండ్లు గా సెస్ మెరుగైన సేవలు అందిస్తుంది. సహకార సంఘంలో ఆదర్శంగా నిలిచింది. సవతి తల్లిలాంటి ఎన్పీడీసీఎల్లో విలీనం చేయడం అవసరమా?. ఇప్పటివరకు స్వేచ్ఛగా సేవలు పొందిన వినియోగదారుల అభిప్రాయం పట్టకుండా విలీనం చేయడం తగదు. సహకార స్ఫూర్తికి విరుద్ధం. అందుబాటులో ఉండి పిలవగానే కరెంట్ సేవలు అందించిన సంస్థను కాపాడుకోవాలి. ఇది అందరి బాధ్యత. ప్రభుత్వం పునరాలోచించాలి.
– బొడ్డు నారాయణ, సెస్ ప్రతినిధి