BRS | సిరిసిల్ల టౌన్, జూన్ 6 : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై లాఠీచార్జి చేసి వారిపైనే అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ రాష్ట్ర నేత కంచర్ల రవిగౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జోగులాంబ గద్వాల జిల్లాలో రాజోలి మండలం పెద్దదన్వాడ గ్రామంలో గ్రామస్తులు, రైతులు ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేఖంగా పోరాటం చేస్తున్నారని తెలిపారు. ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును పెద్దదన్వాడ చుట్టపక్కల గల 12 గ్రామాల ప్రజలు వ్యతిరేఖిస్తున్నారని చెప్పారు.
రైతులు, స్థానికులు వ్యతిరేఖిస్తున్నప్పటికీ పరిశ్రమ నిర్వాహకులు పనులు చేపడుతుండడంతో నిరసన తెలిపేందుకు వచ్చిన వారిపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో పాటు పలువురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరి నిర్మాణంతో స్థానికులకు ఆరోగ్య సమస్యలు వస్తాయని, వ్యవసాయ రంగంపై సైతం దుష్ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెని ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం వెంటనే ఓ నిర్ణయానికి రావాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో స్థానిక ప్రజలు, రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ మహాధర్నా చేపడుతుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో వడ్లూరి సాయికుమార్, ఎస్. అఫ్రోజ్, కాసర్ల వినయ్, అజ్ఞు, గాజుల రాకేష్, సంతోష్, భానుకిరణ్, శ్రీనివాసరావు, సలీం, తదితరులు పాల్గొన్నారు.