మత్స్యరంగంపై కాంగ్రెస్ సర్కారు చిన్నచూపు చూస్తున్నది. చేపల సంపద పెంపుదలపై అలసత్వం చూపుతున్నది. మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ సర్కారు ఏటా సెప్టెంబర్లో చెరువులు, జలవనరుల్లో చేప విత్తనాలు పోసి, మత్స్యకారులకు జీవనోపాధి కల్పించగా, ప్రస్తుత ప్రభుత్వం రెండేండ్లుగా నిర్లక్ష్యం చేస్తున్నది. ఈ యేడు ఆశించిన వర్షాలతో జలవనరులు నిండుకుండల్లా ఉండగా, ఇప్పటికీ ప్రణాళికలు తయారు చేయకపోవడం, వాటి ఊసే లేకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది.
రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని చెరువులు, కుంటల్లో ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసే కార్యక్రమంపై అటకెక్కుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రస్తుత కాంగ్రె స్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుండడంతో పథకం పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం కనిపిస్తున్నది. మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా గత సర్కారు అనేక ప్రోత్సాహకాలు ఇచ్చింది.
సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద ఉపాధి చూపింది. మత్స్యకారులకు సబ్సిడీపై టాటా ఏసీలు, ద్విచక్రవాహనాలు, ట్రేలు అందించి వ్యాపార అభివృద్ధికి తోడ్పాటు అందించింది. కానీ ప్రభుత్వం మారింది. చేపపిల్లల జాడలేదు. నీళ్లులేక ఒడ్డుకు కొట్టుకువచ్చి విలవిల్లాడుతున్న చందంగా మత్స్య కారుల పరిస్థితి మారింది.
కార్యాచరణ లేదు.. చేపపిల్లల జాడలేదు
వానకాలం ఆరంభంలోనే పక్కా ప్రణాళికతో గత ప్రభుత్వం ముందుకు పోయింది. ఆగస్టు నెలకు ముందే చేపపిల్లలను చెరువులోకి వదిలేందుకు జూన్, జూలైలోనే టెండర్ల ప్రక్రియ మొదలెట్టింది. ఆంధ్రా, తెలంగాణకు చెందిన కాంట్రాక్టర్లతో చేప పిల్లలను తెప్పించింది. చేప పిల్లలను వదలడంలో ఏనాడు నిర్లక్ష్యం చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బతుకులు ఆగమవుతున్నాయంటూ మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.
ఆగస్టులో చేపపిల్లల కోసం మత్స్య శాఖ ప్రణాళికలు సిద్ధం చేయాల్సి ఉండగా, సెప్టెంబర్ నెల ప్రారంభమైనా ఇంతవరకు కార్యాచరణ రూపొందించలేదని తెలుస్తున్నది. ఇటీవలి భారీ వర్షాలకు రాజరాజేశ్వర, అన్నపూర్ణ, ఎగువ మానేరు, మల్కపేట రిజర్వాయర్లో నీటి మట్టం పెరిగింది. చెరువుల్లోకి సైతం నీరు చేరింది. కానీ చేపపిల్లలు చేరలేదు. చేరుతాయా.. లేదా..? అన్న అనుమానాలను మత్స్యకారులు వ్యక్తం చేస్తున్నారు. తమ ఉపాధి ఎలా అని ఆందోళన చెందుతున్నారు.
వేలాది మంది ఉపాధికి గండి
తెలంగాణ రాక ముందు మత్స్యకారులే రాయలసీమ, ఆంధ్రా నుంచి విత్తన చేపలు కొనుక్కొచ్చుకుని, చెరువుల్లో వేసుకునే వారు. దూరంతోపాటు ఖర్చులు కూడా భారం కావడం వల్ల కొద్ది మంది మాత్రమే వ్యాపారం చేసుకునే వారు. కేసీఆర్ చేపట్టిన సమీకృత మత్స్య అభివృద్ధి పథకంతో ఉమ్మడి జిల్లా చేపల ఉత్పత్తి కేంద్రంగా మారింది. ఒకప్పుడు జిల్లాలో 4016 మంది సభ్యులతో ఉన్న 78 మత్స్యకార సంఘాలు క్రమంగా 99సంఘాలకు పెరిగాయి.
సభ్యుల సంఖ్య దాదాపు పదివేల మందికి చేరింది. ఒకప్పుడు రవ్వులు, బొమ్మె చేప మాత్రమే లభించే జిల్లాలో రకరకాల చేపలు ఉత్పత్తితో జిల్లా ప్రజలకు అందుబాటులో లభిస్తున్నాయి. కాగా, ప్రభుత్వం ఇప్పటికీ జలవనరుల్లో చేప పిల్లలు పోయకపోవడంతో పదివేల మంది ఉపాధికి గండి పదే ప్రమాదం వచ్చింది. ఇప్పటికైనా స్పందించి చేప పిల్లలు పోసి, బతుకుదెరువు చూపాలని మత్స్యకారులు కోరుతున్నారు.