ధర్మపురి, మార్చి 3: ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఆలయ ఈవో శ్రీనివాస్, సిబ్బందితో కలిసి మంగళవాయిద్యాలతో యాజ్ఞాచార్యులు చక్రపాణి వామనాచార్యుల ఇంటికి వెళ్లి ఉత్సవాల నిర్వహణకు ఆహ్వానించి ఆలయానికి తీసుకువచ్చారు. ఆలయ పక్షాన అర్చకులకు దీక్షావస్ర్తాలు సమర్పించారు. వేద పండితుడు బొజ్జ రమేశ్శర్మ, పురోహితుడు బొజ్జ సంతోష్కుమార్శర్మ సమక్షంలో అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య కలశ, విశ్వక్సేన వాసుదేవ, పుణ్యహవాచనం, బ్రహ్మకలశస్థాపన, అంకురార్పణ, వరాహతీర్థం పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఉత్సవమూర్తులకు రక్షాబంధనం చేసి మాతృక పూజలు చేశారు. సాయంత్రం శ్రీ లక్ష్మీనర్సింహస్వామి (యోగా, ఉగ్ర), వేంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తులను సేవలపై ఊరేగించారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. చింతామణి చెరువుకట్ట వద్దకు చేరుకొని ఆలయాలకు పుట్టబంగారం తీసుకువచ్చారు.