కాంగ్రెస్ సర్కారు దిగొచ్చింది. వడ్లు, మక్కలు కొనాలన్న ఆర్టీసీ డ్రైవర్ తొలగించడంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది. ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా విధుల నుంచి తప్పిస్త్తూ ఉత్తర్వులు ఇవ్వడంపై బీఆర్ఎస్ భగ్గుమనడం, వెంటనే విధుల్లోకి తీసుకోకపోతే ఆందోళన చేస్తామంటూ హెచ్చరించడం, ఇదే సమయంలో సోషల్ మీడియా నిప్పులు గక్కడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఆ మేరకు సారీ చెబుతూ డ్రైవర్ అశోక్ నుంచి ఒక లేఖను అధికారులు కోరగా.. చేయని తప్పునకు సారీ చెప్పే ప్రశ్నేలేదని ఆయన తెగేసి చెప్పాడు. చివరకు యాజమాన్యమే దిగొచ్చి, బుధవారం నుంచి విధుల్లో చేరవచ్చంటూ చెప్పడం కొసమెరుపు!
కాగా, తొలగింపు ఉత్తర్వులను చేతిలో పెట్టిన అధికారులు, తిరిగి తీసుకోవడానికి మాత్రం నోటిమాటగా చెప్పారే తప్పా ఎటువంటి అధికారిక ఉత్తర్వులు ఇవ్వక పోవడం అనుమానాలకు తావిస్తున్నది. దీనిపై బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఆగ్రహిస్తున్నారు. రైతుల బాధలను చూసి ప్రశ్నిస్తే కక్షసాధింపు చర్యలకు దిగుతారా? అని మండిపడుతున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛకు సర్కారు వేసిన సంకెళ్లు వేయడం సరికాదని, కాంగ్రెస్ సర్కారు కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలుకుతున్నారు. డ్రైవర్ అశోక్‌కు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కరీంనగర్, మే 26 (నమస్తే తెలంగాణప్రతినిధి)/ జగిత్యాల (నమస్తే తెలంగాణ)/ కరీంనగర్ తెలంగాణ చౌక్ : ‘వడ్ల గురించి పట్టించుకో.. మకల గురించి పట్టించుకో.. పెట్రోల్ రేట్లు ఎప్పుడైనా దించుకోవచ్చు పో’ అంటూ వ్యాఖ్యలు చేసిన ఆర్టీసీ అద్దెబస్సు డ్రైవర్ బైరి అశోక్‌ను విధుల నుంచి తొలగించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. నిరుపేద దళిత కుటుంబానికి చెందిన అశోక్ నిజానికి రైతుల బాధలు చూసి చలించి మాట్లాడారే గానీ, విమర్శలు చేయడం ఆయన ఉద్దేశం కాదని ఆ మాటలు విన్న ఎవరికైనా అర్థం అవుతుంది. కానీ, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఇతర ఎమ్మెల్యేలు ధర్నా చేస్తున్న సమయంలోనే వ్యాఖ్యలు చేయడాన్ని సర్కారు తీవ్రంగా తీసుకున్నట్టు తెలుస్తున్నది.
ఒకవైపు ధర్నా చేస్తుంటే, రైతుల విషయాన్ని ఎత్తడంతో జీర్ణించుకోలేకపోయినట్టు కనిపిస్తున్నది. కాంగ్రెస్ నాయకులను అశోక్ విమర్శించారంటూ ఆ పార్టీ ధర్మపురి మండల అధ్యక్షుడు లక్ష్మణ్ ఆర్టీసీ డిపో మేనేజర్‌కు చేసిన ఫిర్యాదు మేరకు అలూరు గ్రామానికి చెందిన అశోక్‌ను విధుల నుంచి తొలగిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కాపీని డ్రైవర్ అశోక్‌తోపాటు సదరు అద్దె బస్సు యజమానికి సైతం అందజేశారు. అయితే వడ్లు, మక్కలు కొనాలని ప్రశ్నించిన పాపానికి అశోక్‌ను ఉద్యోగం నుంచి తొలగించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఓ సాధారణ అద్దె బస్సు డ్రైవర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే.. అతని పూర్వాపరాలను పరిగణలోకి తీసుకోకుండా.. ఏకంగా ఉద్యోగం నుంచి తొలగించిన తీరుపై వివిధ వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహం కనిపించింది.
ఇటు బీఆర్ఎస్ కూడా భగ్గుమన్నది. సర్కారు చర్యలను ఎక్కడికక్కడ ఖండించింది. అశోక్‌ను ఐదు డిపోల పరిధిలో ఏ ఒక్క అద్దె బస్సు ఓనర్ డ్రైవర్‌గా విధుల్లోకి తీసుకునేందుకు వీలు లేని విధంగా ఉత్తర్వులు ఇవ్వడంపై తీవ్రంగా మండిపడ్డది. బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా కమిటీ సమన్వయ కర్త, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, మాజీ కౌన్సిలర్ ఆవారి శివ కేసరి బాబు తదితరులు మంగళవారం జగిత్యాల డిపో మేనేజర్‌ను కలిశారు. నిరుపేద కుటుంబానికి చెందిన అశోక్‌ను విధుల నుంచి తొలగిస్తే ఆయన ఉపాధి పోతుందని వివరించారు.

తొలగింపు ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని కోరారు. అలాగే కరీంనగర్లో మాజీ మంత్రి గంగుల కమలాకర్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ జీవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణ్‌రావు, నగరపాలక సంస్థ మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ కలిసి శ్వేత హోటల్ నుంచి ర్యాలీగా ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయానికి చేరుకున్నారు. ఆర్ఎంను కలిసి వినతిపత్రం అందజేశారు. అశోక్ చేసిన తప్పేమిటో చెప్పాలంటూ ప్రశ్నించారు. ఎలాంటి తప్పులేకున్నా విధుల నుంచి ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. దళితబిడ్డ అశోక్ కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. వెంటనే విధుల్లోకి తీసుకొని ఆ కుటుంబానికి న్యాయం చేయాలని, లేకుంటే ఎంతటి ఆందోళన చేయడానికైనా వెనుకాడమని హెచ్చరించారు.
కాగా, అశోక్‌ను తిరిగి వెంటనే విధుల్లోకి తీసుకోకుంటే ఆర్ఎం ఆఫీసును ముట్టడిస్తామని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఒక ప్రకటనలో వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలోనూ సర్కారు తీరుపై నెటిజన్లు దుమ్మెత్తి పోశారు. వడ్లు, మక్కలు కొనాలని అడిగితే.. ఉద్యోగం నుంచి తీసివేస్తారా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అద్దె ఇంట్లో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న నిరుపేదపై ఇంత కక్షగడుతారా..? అంటూ ప్రజలు తీవ్రంగా ఆగ్రహించారు. ఒక్కసారిగా వ్యతిరేకత పెరగడంతో సర్కారు మంగళవారం సాయంత్రం వరకు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అశోక్‌ను విధుల్లో నుంచి తొలగిస్తే ఇబ్బందులు వస్తాయని గుర్తించి, అశోక్ వద్ద నుంచి సంజాయిషీ పత్రం తీసుకొని తిరిగి విధుల్లోకి తీసుకునేలా చూడాలని ఆదేశించినట్టు సమాచారం.
ఆ మేరకే ఆర్టీసీ అధికారులు అశోక్‌ను పిలిచి.. సారీ చెబుతూ లేఖ రాసిచ్చి విధులకు హాజరుకావాలని సూచించారు. అయితే చేయని తప్పునకు సారీ చెప్పే ప్రసక్తే లేదని అధికారులకు అశోక్ తెగేసి చెప్పినట్టు సమాచారం. ఇదే సమయంలో వివాదం మరింత ముదురుతుందని గ్రహించిన అధికారులు తిరిగి ఉద్యోగానికి రావాలంటూ అశోక్‌ను పిలిపించి చెప్పినట్టు తెలుస్తున్నది. అయితే ఉద్యోగం నుంచి తొలగిస్తూ లిఖిత పూర్వకంగా ఉత్తర్వులు ఇచ్చిన అధికారులు.. విధుల్లో చేరాలంటూ నోటిమాటగా చెప్పారే తప్ప అధికారికంగా ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. ఇదే విషయంలో ఆర్టీసీ ఆర్ఎంను ‘నమస్తే తెలంగాణ’ వివరణ కోరగా.. అశోక్‌ను వచ్చి విధుల్లో చేరాలని కోరినట్టు తెలిపారు.
నేను సోమవారం ఆర్టీసీ అద్దె బస్సును నడుపుతున్న. జగిత్యాల తహసీల్ చౌరస్తా వద్ద ధర్నా చేస్తున్నది ఎవరా? అని చూసిన. అక్కడ మా ఊరికి చెందిన వ్యక్తి ఉన్నడు. ఆయనను ఎందుకు ధర్నా చేస్తున్నరని అడిగిన. పెట్రోల్, డీజిల్ పెంపు కోసం అని చెప్పిండు. దాంతో నేను బస్సును నడుపుతూనే.. ‘అడ్లు, మక్కల సంగతి చూడండి. వాటిని కాపాడండి. పెట్రోల ధరలు ఎప్పుడైనా దించవచ్చు’ అంటూ వెళ్లిపోయిన. రెండు మూడు నెలలుగా వడ్లు అమ్ముకునేందుకు రైతులు పడుతున్న గోసను చూసి అట్ల మాట్లాడిన. మంగళవారం ఆర్టీసీ అధికారులు తొలగిస్తున్నట్టు ఉత్తర్వులు ఇచ్చిన్రు. అలాగే జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల, కరీంనగర్ మొత్తంగా ఐదు డిపోల పరిధిలో ఆర్టీసీ ఆధీనంలోని అద్దె బస్సులు నడిపించడానికి విధుల్లోకి తీసుకోమని చెప్పిన్రు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఏ నాయకుడిని, ఏ రాజకీయ పార్టీని విమర్శించలేదు. కేవలం రైతుల గోసలు చూడాలని, అడ్లు, మక్కలను కాపాడాలని మాత్రమే చెప్పిన.
– విధుల నుంచి తొలగించిన తర్వాత మీడియాతో ఆర్టీసీ అద్దె డ్రైవర్ బైరి అశోక్