NEET Parents Association | జగిత్యాల, సెప్టెంబర్ 08 : వైద్య విద్యార్థుల హక్కుల పరిరక్షణనే ధ్యేయంగా పనిచేస్తామని నీట్ పేరెంట్స్ అసోసియేషన్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంజయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ నీటి విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లలో స్థానికత అంశం జీవో నం.33 అమలుపై ఉద్యమించి సాధించుకున్న నీట్ పేరెంట్స్ వైద్య విద్యార్థులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర స్థాయి అసోసియేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా మల్లోజు సత్యనారాయణ చారి, ఉపాధ్యక్షుడిగా బొడ్డుపల్లి అంజయ్య, ప్రధాన కార్యదర్శిగా పొడి శెట్టి రమేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే జాయింట్ సెక్రెటరీలుగా డీ రఘుపతి, రాజు, చీఫ్ అడ్వైజర్ గా బీరెల్లి కమలాకర్ రావు, కోశాధికారిగా ఎం శ్రీధర్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ఎస్ భాస్కర్ రావు, కే రవి కుమార్, పీ సుజాత, కార్యవర్గ సభ్యులుగా గడ్డం స్వప్న, పబ్బం మానస, కే నరహరి, టీ రత్న ప్రసాద్, నరేందర్ రెడ్డిను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఉపాధ్యక్షుడు అంజయ్య మాట్లాడుతూ వైద్య విద్యార్థుల స్థానికత కు సంబంధించిన జీవో నం. 33 గతేడాది పూర్తిస్థాయిలో అమలు కాకపోవడంతో 86 మంది తెలంగాణ స్థానికత కలిగిన విద్యార్థులు ఎంబిబిఎస్ లో సీట్లు కోల్పోయారని, ఈ ఏడాది కూడా మళ్లీ అదే విధంగా 459 మంది వైద్య సీట్లు కోల్పోవాల్సిన పరిస్థితి తలెత్తగా జీవో నం.33 ఖచ్చితంగా అమలు చేయాలని నీట్ పేరెంట్స్ అంతా కలిసి పలు ఉద్యమాలు చేపట్టి విజయవంతం అయ్యామన్నారు. తెలంగాణ స్థానికత సంబంధించి జీవో నం. 33 అమలుపై సుప్రీంకోర్టు తీర్పు స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నామని, అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
అయితే తెలంగాణ నీట్ పేరెంట్స్ అసోసియేషన్ అనేది తెలంగాణ స్థానికత అంశంపై పోరాడమే కాకుండా, భవిష్యత్తులో వైద్య కళాశాలలో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు వచ్చిన మనం స్పందించే విధంగా ఇదే అసోసియేషన్ ను కొనసాగించాలని నిర్ణయంతో రాష్ట్రస్థాయి నీట్ పేరెంట్ అసోసియేషన్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో ర్యాగింగ్ లాంటి వివిధ వైద్య విద్యార్థుల సమస్యలపై పోరాటం జరపడంతో పాటు వైద్య విద్యార్థులకు సలహాలు సూచనలు అందజేస్తామని, మా విద్యార్థుల సమస్యలను ఇటు ఆందోళన కార్యక్రమాల ద్వారా కావచ్చు లేదా వినతి పత్రాలు ద్వారా కావచ్చు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు. అలాగే రాష్ట్ర స్థాయి కమిటీతో పాటు ఉమ్మడి 10 జిల్లాల స్థాయిలో ఇన్చార్జిలో నియమించినట్లు పేర్కొన్నారు.