Patala Palaki | వీణవంక, జూన్12 : పాటల పల్లకిలో 12 గంటల మోత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కవి, గాయకులు గొనేల సమ్మన్న ముదిరాజ్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో ఈ సందర్భంగా కళాకారులు మాట్లాడుతూ ఈ నెల 15 న తెలంగాణ ఉద్యమ కవి, గాయకులు నేర్నాల కిషోర్, తెలంగాణ కాంగ్రెస్ సాంస్కృతిక సేన రాష్ట్ర అధ్యక్షులు చక్రాల రఘు ఆధ్వర్యంలో కరీంనగర్ లోని కళాభారతిలో పాటల పల్లకిలో 12 గంటల మోత కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ఉద్యమంలో తమ మాట, పాట, ఆటతో ఎంతో కృషి చేసిన కళాకారులందరూ తమ కుటుంబాలను వదిలిపెట్టి, జీవితాలను త్యాగం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నారాన్నారు. చాలామంది కళాకారులు నిరుద్యోగులుగా మిగిలిపోయి పూటగడవని పరిస్థితిలో ఉన్నారని, ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ఎన్నికలకు ముందు చెప్పినట్లుగా మిగిలిపోయిన మిగతా కళాకారులకు ఉద్యోగాలు కల్పించాలని వేడుకుంటూ కళాభారతి కరీంనగర్లో తలపెట్టిన పాటల పల్లకిలో 12 గంటల మోత కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
కావున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోని నిరుద్యోగ కళాకారులందరూ హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాకారులు వడ్డేపల్లి శ్రీను, మారముల్ల ప్రభు, కొలిపాక రామస్వామి, గోనెల పెద్దులు, పూదరి రమేష్, దాసారపు సమ్మయ్య, అంబాల మదునయ్య, దాసారపు చంద్రమౌళి, రాజేష్, దాసారపు రాజు, మారముల్ల కిరణ్ పాల్గొన్నారు.