Film actor Sagar | కోల్ సిటీ, జూలై 11: గోదావరిఖనికి చెందిన సింగరేణి ముద్దుబిడ్డ, సినీ నటుడు సాగర్ (ఆర్కే నాయుడు) నటించిన ది 100 సినిమా విడుదల సందర్భంగా శుక్రవారం స్థానిక న్యూ అశోక థియేటర్ ఆవరణలో వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సినీ అభిమాన సంఘాల ఐక్యవేదిక జిల్లా చైర్మన్ గుండేటి రాజేష్ ఆధ్వర్యంలో సినీ నటుడు సాగర్ తల్లిదండ్రులచే కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు.
ఈ ప్రాంతంకు చెందిన సాగర్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడిప్పుడే మంచి అవకాశాలతో ఎదుగుతున్నాడనీ, తన నాలుగో సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడనీ, కోల్ బెల్ట్ ప్రాంత ప్రజలు, అభిమానులు సినిమాను ఆదరించి మంచి విజయంను అందించాలని గుండేటి రాజేష్ అభిమానులను కోరారు.
ఇక్కడే పుట్టి పెరిగిన సాగర్ సినీ పరిశ్రమలో హీరోగా పేరు తెచ్చుకోవడం గర్వకారణమన్నారు. అనంతరం థియేటర్ ఆవరణలో సంబరాలను హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో సాగర్ తల్లిదండ్రులతోపాటు స్థానిక నాయకులు వడ్డెపల్లి దినేష్, రాయమల్లు, బూర్ల దామోదర్, రంజిత్, శ్రావణ్, అశోక్ అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.