సిరిసిల్ల టౌన్, జనవరి 11: స్వరాష్ట్రంలో కేసీఆర్ సర్కారు నిరుద్యోగ యువతను పోటీ పరీక్షలు, ఉద్యోగ పరీక్షలకు సన్నద్ధం చేయడమే లక్ష్యంగా కదిలింది. ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పించి స్టడీ సర్కిల్స్‌ను ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న గ్రంథాలయాలను దశలవారీగా ఆధునీకరించేందుకు అడుగులు వేసింది. అందులో భాగంగా చాలాచోట్ల కొత్త భవనాలు నిర్మించడంతోపాటు డిజిలైజేషన్కు శ్రీకారం చుట్టింది. ప్రధానంగా అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో సిరిసిల్ల జిల్లాకేంద్రంలో రాష్ట్రంలోనే మొదటి మోడ్రన్ లైబ్రరీని అందుబాటులోకి తెచ్చారు.
దేశంలోనే పేరొందిన ముంబై ఆసియాటిక్ లైబ్రరీకి నమూనాగా 3.60 కోట్లతో రెండంతస్తుల్లో భవనం నిర్మించారు. 2019 జూలై 29 ప్రారంభించారు. అందులో సెంట్రల్ ఏసీతో కూడిన విశాలమైన రీడింగ్ రూములు, సెమినార్ల కోసం కాన్ఫరెన్స్ హాల్, అత్యాధునికంగా డిజిటల్ లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్‌ను ఏర్పాటుచేశారు. గతంలో ఉన్న శిథిల భవనంలో నామమాత్రంగా పాఠ్యపుస్తకాలు, సాహిత్యం, దినపత్రికలతో ఉండగా, కొత్త లైబ్రరీలో తెలుగు భాషాభిమానులు, సాహితీ ప్రియులు, కళాకారులు, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు, విద్యార్థులు.. ఇలా అన్ని వర్గాల కోసం ప్రస్తుతం 25వేలకుపైగా పుస్తకాలను సిద్ధంగా ఉంచారు. ప్రత్యేకంగా ఉద్యోగార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్స్, సాహిత్య పుస్తకాలను అందుబాటులోకి తెచ్చారు.
నిరుద్యోగులకు వరంలా సిరిసిల్ల మోడ్రన్ లైబ్రరీ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరతో సిరిసిల్ల జిల్లాకేంద్రంలో నిర్మించిన మోడ్రన్ లైబ్రరీ వేలాది మంది యువతకు భరోసానిచ్చింది. పోటీ పరీక్షల శిక్షణ కోసం హైదరాబాద్‌లాంటి నగరాల్లో ఉండే కోచింగ్ సెంటర్లకు వెళ్లకుండా.. వేలాది రూపాయల ఫీజు లేకుండా.. ఈ ప్రాంత యువత స్థానికంగానే కేంద్ర, రాష్ట్ర ఉద్యోగాలకు ప్రిపేరయ్యే అవకాశం కల్పించింది. ప్రధానంగా వందలాది మంది చేనేత కార్మికుల పిల్లలకు ఉపయోగకరంగా మారింది. వేలాది పుస్తకాలతోపాటు స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంచగా, వంద మందికిపైగా ప్రభుత్వ కొలువులు సాధించే అవకాశం ఏర్పడింది. కానీ, ఇప్పుడు ఈ మోడ్రన్ లైబ్రరీపై వివక్ష కనిపిస్తున్నది. గతంలో నిర్ధిష్టమైన వేళలతో గ్రంథాలయాన్ని ఓపెన్ చేసి ఉంచినా.. ఇప్పుడు సమయపాలన సరిగ్గా పాటించకపోవడం అభ్యర్థులకు శాపంలా మారుతున్నది.
కేటీఆర్ కృషితో తప్పిన ఆర్థిక బాధలు
గతంలో పోటీపరీక్షలకు సిద్ధమయ్యే ఈ ప్రాంత అభ్యర్థులు హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ వంటి దూరప్రాంతాలకు వెళ్లేవాళ్లు. అక్కడ శిక్షణ కేంద్రాల్లో ఫీజులు చెల్లించలేక చాలా మంది పరీక్షలు రాయకుండానే వెనుదిరిగేవాళ్లు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత కేటీఆర్ ఈ ప్రాంత యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ఫోకస్ చేశారు. అందులో భాగంగా అనేక విద్యాసంస్థలను ఏర్పాటు చేయించారు. అలాగే స్టడీ సర్కిళ్లతోపాటు మోడ్రన్ లైబర్రీని అందుబాటులోకి తెచ్చారు. ప్రత్యేకంగా నిరుద్యోగుల కోసం పోటీ పరీక్షలకు సంబంధించిన వేలాది పుస్తకాలను అందుబాటులో ఉంచారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమయ్యే అభ్యర్థులకు వినియోగంగా అన్ని రకాల స్టడీ మెటీరియల్‌ను సమకూర్చారు. సివిల్స్, రైల్వే, గ్రూప్-1, గ్రూప్-2, ఎంసెట్‌కు సంబంధించిన నోట్స్ సిద్ధంగా ఉంచారు. దీంతో నిరుద్యోగులకు రూపాయి ఖర్చు లేకుండా లైబ్రరీలో ప్రిపేర్ అయ్యే అవకాశం కలిగింది. దూర ప్రాంతాలకు వెళ్లకుండా స్థానికంగానే ప్రిపేర్ అయ్యే అవకాశం ఏర్పడింది. దీంతో ఆర్థిక బాధలు తప్పగా, ఉద్యోగార్థుల నుంచి విశేష స్పందన వచ్చింది.
కాంగ్రెస్ పాలనలో నిర్లక్ష్యం
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతను కొలువుల కలకు దూరం చేయాలని చూస్తున్నది. ‘ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తం. నిరుద్యోగ భృతి ఇస్తం. జాబ్స్‌కు ప్రిపేరయ్యేవారికి ఆర్థిక సహకారం అందిస్తం’ అంటూ ఎన్నికల ముందు బీరాలు పలికినా.. ఇప్పుడు పూర్తి చేతులెత్తేస్తున్నది. ఉద్యోగాల మాట దేవుడెరుగు..? భరోసాగా నిలిచే ఇప్పటికే ఎస్సీ స్టడీ సర్కిళ్లను మూసేసింది. అలాగే సిరిసిల్లలో అధునాతన సౌకర్యాలతో అందుబాటులోకి తెచ్చిన మోడ్రన్ లైబ్రరీపైనా నిర్లక్ష్యం చేస్తున్నది. గతంలో కచ్చితమైన సమయపాలన పాటించగా, కొద్ది రోజులుగా అలక్ష్యం చేస్తున్నది. ప్రస్తుతం ఉదయం 8 గంటలకు నుంచి రా్రత్రి 8గంటల ఓపెన్ చేస్తున్నా.. ప్రతి నెలా రెండో శుక్ర, శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకే నడిపిస్తున్నారు.
అదీ కూడా కచ్చితమైన సయమపాలన పాటించడం లేదు. దీంతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు, పాఠకులు గందగోళానికి గురవుతున్నారు. ఇటీవల టెట్ నోటిఫికేషన్ రాగా, ఎంతో మంది ప్రభుత్వ ఉపాధ్యాయలు ప్రిపేర్ అవుతున్నారు. అయితే వీరు స్కూళ్ల నుంచి వచ్చే సరికి సాయంత్రం ఐదు గంటలు దాటిపోతున్నది. ఇక ల్రైబరీని వెళ్లిన కాసేపటికే మూసివేస్తున్నారు. దీనిపై టీచర్లు మండిపడుతున్నారు. సమయపాలన పెంచాలని డిమాండ్ చేస్తే పట్టించుకొనే వారు కరువయ్యారు. శుక్రవారం ఉదయం 11 గంటలు దాటినా లైబ్రరీ ఓపెన్ చేయకపోవడంపై అభ్యర్థులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాసేపు ధర్నా చేసి, నిత్యం సమయపాలన పాటించడం లేదని, అలాగే వైఫై కూడా సరిగా పనిచేయడం లేదని మండిపడ్డారు. నిర్ణీత సమయానికి లైబ్రరీ తెరవాలని, వైఫైని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
వందలాది మందికి ఉద్యోగాలు
పోటీ పరీక్షల మెటీరియల్, ఉద్యోగార్థులకు అవసరమైన వందలాది పుస్తకాలు అందుబాటులో ఉండడంతో సిరిసిల్ల పట్టణంతోపాటు జిల్లాలోని వేలాది మంది నిరుద్యోగులు ఈ లైబ్రరీకి తరలివచ్చారు. ప్రధానంగా అనేక మంది చేనేత కుటుంబాల పిల్లలు సద్వినియోగం చేసుకున్నారు. గతంలో ఉదయం 9 నుంచి రాత్రి 9గంటల వరకు తెరిచి ఉంచారు. నోటిషికేషన్ల సమయంలో 24 గంటలు ఓపెన్ చేసి ఉండడంతో ఎప్పుడంటే అప్పుడు వచ్చి చదువుకున్నారు. ప్రతి రోజూ దాదాపు 200 మందికిపైగా వచ్చారు. నోటిఫికేషన్లు విడుదల చేసిన సమయంలో నిత్యం దాదాపు 400 మందికి ప్రిపేర్ అయ్యారు. అప్పుడు రూ.5 భోజనం పెట్టగా, ఎంతో మంది సద్వినియోగం చేసుకున్నారు. ఉదయం వచ్చి రాత్రి వరకు ప్రిపేర్ అయ్యారు. ఇప్పటి వరకు దాదాపుగా 120 మందికిపైగా గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 జాబ్స్ సాధించారు.
కేటీఆర్ అన్నకు చాలా థాంక్స్
జాబ్ ప్రిపరేషన్ కోసం హైదరాబాద్ స్టడీ హాల్స్‌కు వెళ్తే నెలకు 2వేల నుంచి 5వేల వరకు తీసుకుంటారు. కేటీఆర్ వంటి విజన్ ఉన్న నాయకుడి గొప్ప ఆలోచనతో మాకు అందుబాటులో ఇక్కడే మోడ్రన్ లైబ్రరీని ఏర్పాటు చేశారు. 24గంటలపాటు లైబ్రరీ తెరిచి ఉంచేవారు. 2022లో గ్రూప్-3 నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇక్కడే ప్రిపేర్ అయ్యాను. రోజుకు 8 నుంచి 10గంటలు ఇక్కడే చదివాను. ప్లానింగ్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికయ్యాను. అపాయింట్మెంట్ లెటర్ కోసం వెయిటింగ్లో ఉన్నాను. నాలాంటి ఎంతో మందికి ఉద్యోగ సాధన కోసం ఈ లైబ్రరీ ఉపయోగపడుతున్నది. మోడ్రన్ సౌకర్యాలతో కూడిన లైబ్రరీ ఏర్పాటుకు కృషి చేసిన కేటీఆర్ అన్నకు చాలా థాంక్స్.
జూనియర్ అసిస్టెంట్ సాధించా
మా ఆయన ఏఆర్ కానిస్టేబుల్. నేను హౌస్‌వైఫ్. గవర్నమెంట్ జాబ్ చేయాలన్న ఇంట్రస్ట్‌తో ప్రిపరేషన్ మొదలుపెట్టాను. కానీ, ఇంటి వద్ద వీలుగా ఉండేది కాదు. హైదరాబాద్‌కు వెళ్లి చదువుకునే పరిస్థితి లేదు. 2022లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు మా ఆయన సలహాతో సిరిసిల్లలోని లైబ్రరీలో గ్రూప్స్ ప్రిపేర్ అయ్యాను. అన్ని రకాల ఫెసిలిటీస్ ఉండడంతో నేను ఎనిమిది నెలల పాటు ఇక్కడే చదివాను. విశాలమైన రీడింగ్ హాల్స్, ప్రశాంతమైన వాతావరణంలో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా బాగా చదివాం. జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ జాబ్‌కు సెలెక్ట్ అయ్యాను. కేటీఆర్ ఏర్పాటు చేసిన ఈ లైబ్రరీలో మాలాంటి ఎంతో మంది చదువుకొని ఉద్యోగాలు సాధిస్తున్నారు.
– మేఘన జీ, జూనియర్ అసిస్టెంట్ (మండెపల్లి)
గ్రంథాలయాలు అంటే విజ్ఞాన భాండాగారాలు! కానీ, ఉమ్మడి రాష్ట్రంలో అవి సమస్యల్లో కొట్టుమిట్టాడాయి. శిథిల భవనాల్లో నామమాత్రపు పుస్తకాలతో నిరాదరణకు గురయ్యాయి. సిరిసిల్లలోని గ్రంథాలయం కూడా తాత్కాలిక భవనంలో అందుబాటులో ఉండేది. ఇక్కడ నామమాత్రపు పుస్తకాలే ఉండేవి. భవనం సైతం శిథిలావస్థలోనే ఉండేది. వర్షం పడిన సందర్భాల్లో లైబ్రరీ తెరిచేవారు కాదు. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత అప్పటి ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ చొరవతో అద్భుతమైన మోడ్రన్ లైబ్రరీ అందుబాటులోకి వచ్చింది. దేశంలోనే పేరొందిన ముంబై ఆసియాటిక్ లైబ్రరీకి నమూనాగా 3.60 కోట్లతో ఈ గ్రంథాలయం రూపుదిద్దుకున్నది. అధునాతనమైన వసతులు, 25వేలకుపైగా పుస్తకాలతో యువతకు భరోసానిస్తున్నది.
నేను ఇక్కడే ప్రిపేరై జాబ్ కొట్టాను
సిరిసిల్ల లైబ్రరీలో హైదరాబాద్ వంటి పెద్దసిటీలో ఉండే సౌకర్యాలు కల్పించారు. రీడింగ్ రూం, ఏసీ హాల్స్, కంప్యూటర్ ల్యాబ్, పోటీ పరీక్షలకు అవసరమైన స్టడీ మెటీరియల్, వైఫై, ఎకనామికల్ సర్వేకు ఉపయోగపడే మ్యాగ్జిన్స్తోపాటు అన్ని రకాల బుక్స్ ఉన్నాయి. 2023లో ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ కోసం నేను సిరిసిల్ల లైబ్రరీలో ప్రిపేర్ అయ్యాను. కష్టపడి జాబ్ కొట్టాను. ప్రస్తుతం గజ్వేల్‌లో ఇరిగేషన్ శాఖలో ఏఈగా పని చేస్తున్నాను. ఇంట్లో చదవాలంటే సౌకర్యంగా ఉండేది కాదు. అధునాతన సౌకర్యాలతో కూడిన లైబ్రరీలో ప్రశాంతమైన వాతావరణంలో చదువుకుని ఉద్యోగాన్ని సాధించా. ఇంత మంచి మోడ్రన్ లైబ్రరీని సిరిసిల్లలో అందుబాటులో ఉండడం అందరికీ ఉపయోగకరమే. నాలాటి చేనేత కుటుంబాల పిల్లలకు ఇది ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది.
– కొండ వెంకటసాయి, ఇరిగేషన్ ఏఈ (గజ్వేల్)
నేను రెండు జాబ్స్ కొట్టాను
ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ హైదరాబాద్‌కు అనేక ప్రపంచ స్థాయి ఐటీ కంపెనీలు తీసుకొచ్చారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సిరిసిల్లను అన్ని రంగాల్లో డెవలప్మెంట్ చేశారు. గతంలో సిరిసిల్లలో లైబ్రరీ అంటే కనీసం ఎక్కడ ఉందో కూడా చాలా మందికి తెలిసేది కాదు. అటువంటిది సిరిసిల్ల సెంటర్ ప్లేస్‌లో నిర్మించిన మోడ్రన్ లైబ్రరీ తెలంగాణకే ఐకాన్‌గా నిలిచింది. ఆడపిల్లలు హైదరాబాద్ వరకు వెళ్లి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవ్వాలంటే కొంత ఇబ్బందికరమైందే. సిరిసిల్లలోనే అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేసిన లైబ్రరీ నాతో పాటు చాలా మందికి ఉపయోగపడింది. 2022 గ్రూప్-4 నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను ఇక్కడే ప్రిపేరయ్యాను. జూనియర్ అకౌంటెంట్‌గా, బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్లో జూనియర్ అసిస్టెంట్‌గా రెండు జాబ్‌లు కొట్టాను.
– గడదాస్ నవీన, జూనియర్ అకౌంటెంట్ (సిరిసిల్లమున్సిపల్)