పెద్దపల్లి, సెప్టెంబర్ 22(నమస్తే తెలంగాణ): ఆర్టీసీ నిర్వహణ అధ్వానంగా మారింది. సంస్థను ప్రగతిలో నడిపిస్తున్నామని ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెబుతుంటే, క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. కాలం చెల్లిన బస్సులు, సక్రమంగా పనిచేయని టిమ్ మిషన్లు, రద్దీకి సరిపడా బస్సులు లేక, నడుపలేక సంస్థ అష్టకష్టాలు పడుతున్నది. పెద్దపల్లి జిల్లాలో గోదావరిఖని డిపో 121 బస్సులతో 40రూట్లల్లో, మంథని బస్సు డిపో 33 బస్సులతో దాదాపు 20 రూట్లల్లో ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరుస్తుంటాయి. అయితే కాంగ్రెస్ సర్కారు తెచ్చిన మహాలక్ష్మి స్కీం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తేగా, రద్దీ అమాంతం పెరిగింది. అయితే, అందుకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచకపోవడంతో ప్రయాణం నరక ప్రాయంగా మారిపోయింది.
ఆర్టీసీలో టిమ్స్ వినియోగం 2011 నుంచి అందుబాటులోకి వచ్చింది. గతంలో రద్దీ తక్కువగా ఉండడం వల్ల ఏ ఇబ్బంది లేకుండా టికెట్ ఇష్యూయింగ్ జరిగింది. కానీ ప్రస్తుతం మహాలక్ష్మి ఫ్రీ బస్సు స్కీంతో రద్దీ పెరిగింది. దాదాపుగా 90నుంచి 100 టికెట్లు ఇవ్వాల్సి వస్తున్నది. అంటే ఒక్క ట్రిప్‌లోనే రెండు ట్రిప్పులకు సరిపడా టికెట్లను ఇవ్వాల్సిన పరిస్థితులు రాగా, మిషన్లు మొరాయిస్తున్నాయి. టిమ్స్‌లో బ్యాటరీ డిశ్చార్జ్ కావడం, గేర్స్ మూవ్ కాకపోవడం, మదర్‌బోర్డుకు సంబంధించిన సమస్యలు వస్తుండగా, కండక్టర్లు టికెట్లు ఇవ్వలేకపోతున్నారు. బస్సు కదిలి టికెట్ జారీ చేస్తున్న టైంలో టిమ్ సతాయిస్తే, బండిని పక్కకు ఆపి డిపో నుంచి మరో బస్సు ద్వారా ఇంకో టిమ్ తెప్పించడమో..? లేదంటే తిరిగి బస్సును డిపోకు తీసుకెళ్లి మరొక మిషన్‌ను తీసుకురావాల్సి వస్తున్నది.
ఈ క్రమంలో ప్రయాణికుల ప్రయాణం గంటల కొద్దీ ఆలస్యమైపోతున్నది. ఇక మరొకటి అందుబాటులో లేకున్నా, తీసుకువచ్చే పరిస్థితులు లేకపోతే మాత్రం అప్పటి వరకు టికెట్లు కొట్టిన వారిని బస్సులో ఉంచుకొని, మిగతా వారిని బస్సు దించేస్తున్నారు. అంతేకాదు బస్సు మళ్లీ గమ్య స్థానానికి వెళ్లి వచ్చేదాకా మరో ప్రయాణికుడిని ఎక్కించుకునే అవకాశమే లేదు. బస్టాండ్లకు బస్సు వెళ్లినా ఉన్న ప్రయాణికులను దింపడమే కానీ కొత్తవారిని ఎక్కించుకునే పరిస్థితి లేదు. ఇలాంటి సమస్యలతో అటు కండక్టర్లు, ఇటు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని, టిమ్స్ రీప్లేస్మెంట్ లేదా మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు. అయితే, ఇటీవల పెరిగిన సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా కొత్తగా ఐటిమ్స్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. క్యూఆర్ కోడ్ ద్వారా డబ్బులు కొట్టి టికెట్ తీసుకునే సౌకర్యం ఉంది. హైదరాబాద్ సిటీలో వినియోగిస్తున్న మిషన్లను జిల్లాలోని బస్సు డిపోల్లో వినియోగంలోకి తేవాలని కండక్టర్లు, ప్రయాణికులు కోరుతున్నారు.