Budhavarampeta | రామగిరి, డిసెంబర్ 27 : రామగిరి మండలం బుధవారం పేట శివారులోని ఎనిమిదో వార్డులో ఇండ్లకు నంబర్లు వేసేందుకు శనివారం గ్రామంలోకి వచ్చిన సింగరేణి, రెవెన్యూ అధికారుల చర్యలతో బుధవారం పేట గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత మూడు నాలుగు రోజులుగా గ్రామ ప్రజలకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా దొంగచాటుగా ఇండ్లకు నంబర్లు వేయడం పట్ల గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బుధవారం పేట శివారులో ఇండ్లకు నంబర్లు వేసే ప్రక్రియను సింగరేణి అధికారులు కొంతమంది స్వార్థపరుల సహకారంతో చేపట్టారని గ్రామస్తులు ఆరోపించారు. అధికారులను అడ్డుకునే క్రమంలో ప్రజలను మభ్యపెట్టి విభజించే ప్రయత్నం జరిగిందని, పోలీసు బందోబస్తు నడుమ దౌర్జన్యంగా నంబర్లు వేశారని గ్రామస్తులు పేర్కొన్నారు.
ఈ వ్యవహారాన్ని నిరసిస్తూ ఎనిమిదో వార్డు ప్రజలు నడిరోడ్డుపైకి వచ్చి స్వచ్ఛందంగా నిరసనకు దిగారు. తమ ప్రాణాలైనా అర్పిస్తాం కానీ తమ ఇండ్లు, తమ హక్కులను వదులుకోబోమంటూ ప్రజలు నినాదాలు చేశారు. కొంతమంది నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం సింగరేణికి తొత్తులుగా మారి గ్రామ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రామ భవిష్యత్తును దెబ్బతీసేలా జరుగుతున్న ఈ చర్యలకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో అన్ని వర్గాల ప్రజలు ఏకమై ఈ నిరసనలో పాల్గొన్నట్లు తెలిపారు. గ్రామ ప్రజల సమ్మతి లేకుండా చేపట్టే ఎలాంటి చర్యలనైనా తీవ్రంగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. ఈ పోరాటానికి బుధవారం పేట గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ఇళ్ల నంబర్ల అంశంపై అధికారుల తీరును వెంటనే మార్చాలని ప్రజలతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.