కరీంనగర్ బల్దియాలో రూ.50 కోట్ల టెండర్ల వ్యవహారం రచ్చ రచ్చ అవుతున్నది. ఈ తతంగంలో జరిగిన పనులు, పగిడీల పంపకాలు ప్రస్తుతం దుమారం రేపుతున్నవి. పారదర్శకతకు పాతరేసిన పలువురు ప్రజాప్రతినిధులు.. సిండికేట్‌కు సహకరించడమే కాదు, వాటాల కోసం పాకులాడుతుండగా.. కాంట్రాక్టర్లు రెండు వర్గాలుగా చీలిపోవడంతో వివాదం బజారుకెక్కింది. కాంట్రాక్టర్ల రింగ్‌కు అధికార పార్టీ ఆది నుంచీ సహకరించిందన్న విమర్శలు వెల్లువెత్తగా, సింగిల్ టెండర్ వచ్చిన 69 పనులను అధికారులు రద్దు చేయడమే కాదు, రీకాల్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే టెండర్ల రద్దు చెల్లుతుందా.. లేదా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతుండగా, ఇది కూడా బీజేపీ వ్యూహంలో భాగంగానే జరిగిందా..? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో టెండర్ల రద్దుపై కోర్టును ఆశ్రయించేందుకు ఒక వర్గం కాంట్రాక్టర్లు ప్రయత్నాలు చేస్తుండగా.. ముందుగా వసూలు చేసిన డబ్బులను తిరిగి తమకు ఇవ్వాలని కొంత మంది కాంట్రాక్టర్లు పట్టుబట్టడంతో ఈ వివాదం మరింత ముదురుతున్నది.
కరీంనగర్, మే31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) / కార్పొరేషన్ : కరీంనగర్ బల్దియా పరిధిలో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్మెంట్ ఫండ్ (యూఐడీఎఫ్) కింద 66 డివిజన్లలో రూ.50కోట్లతో 87 పనులకు టెండర్లు పిలిచిన విషయం తెలిసిందే. ఈ పనులు దక్కించుకోవడానికి కాంట్రాక్టర్లు సిండికేట్‌గా మారడం, దీనికి పాలకవర్గంలోని కీలక నాయకులు సహకారం అందించడం, ఆ మేరకు 69 పనులకు సింగిల్ టెండర్లు వచ్చిన విషయం విదితమే. అయితే ఈ వ్యవహారాన్ని లోతుగా చూస్తే.. కాంట్రాక్టర్ల సిండికేట్‌కు బల్దియాలోని పలువురు కీలక నేతలు పూర్తిగా సహకరించినట్టు స్పష్టమవుతున్నది. నిజానికి నోటిఫికేషన్ ప్రకారం.. ఈ నెల 13 వరకు టెండర్లు దాఖలు చేసేందుకు గడువు విధించారు.
అప్పటి వరకు సిండికేట్ పూర్తి కాకపోవడంతో టెండర్లు దాఖలు చేసే సమయాన్ని తిరిగి 20 వరకు పొడిగించి, కాంట్రాక్టర్లు రింగ్‌గా మారేందుకు పలువురు పాలకవర్గ నాయకులు అవకాశం కల్పించినట్టు తెలుస్తున్నది. ఇది ఇలా ఉంటే.. కాంట్రాక్టర్లు అత్యంత వ్యూహాత్మకంగా ముందుకెళ్లినట్టు అర్థమవుతున్నది. అందులో భాగంగానే ఎటువంటి విభేదాలు పొడచూపకుండా ఉండేందుకు, ప్రధాన ప్రజాప్రతినిధులకు తలా ఒక పని ముందుగానే.. వారు చెప్పిన కాంట్రాక్టర్ల కోసం పక్కన పెట్టినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. సదరు నాయకులు సైతం సై అనడంతో మిగిలిన పనులపై దృష్టి పెట్టి, వారు అనుకున్న విధంగా పక్రియ పూర్తి చేసినట్టు తెలుస్తున్నది.
కీలక పాలకవర్గ సభ్యుల సహకారం ఉండడంతో కాంట్రాక్టర్లలోని ఓ వర్గం సిండికేట్‌కు ముందుకొచ్చి, అందరినీ ఒప్పించినట్టు తెలుస్తున్నది. ఆ మేరకు ఆన్లైన్ టెండర్లు వేయకుండా వివిధ జిల్లాలు, ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్ల అంగీకారం కూడా తీసుకొని, పకడ్బందీగా ముందుకెళ్లినట్టు సమాచారం. అంతా ఒకే కావడంతో సింగిల్ టెండర్ వేసిన ఒక్కో కాంట్రాక్టర్ నుంచి పని విలువను బట్టి ఒక శాతం అమౌంట్‌ను ముందుగానే డిపాజిట్ రూపంలో సదరు కాంట్రాక్టర్లు వసూలు చేసినట్టు తెలుస్తున్నది. వారు అనుకున్న విధంగా పనులకు సింగిల్ టెండర్లు రావడంతో వసూలు చేసిన డబ్బులను కొంతమంది కీలక పాలకవర్గ సభ్యులు, అలాగే అధికారులకు పంపిణీ చేసినట్టు తెలిసింది.
ఈ సమయంలోనే పరిస్థితులు బెడిసి కొట్టినట్టు తెలుస్తున్నది. డిపాజిట్ రూపంలో వసూలు చేసిన దాదాపు రూ.40 లక్షలను కొంతమందికి మాత్రమే ఇవ్వాలని నిర్ణయం తీసుకొని, ఆ ప్రకారంగా ముందుకెళ్లడంతో కొంతమంది ఇతర పాలకవర్గసభ్యులు సైతం తమకు వాటా ఎందుకు ఇవ్వరని ప్రశ్నించినట్టు తెలిసింది. ఇదే సమయంలో మరో వర్గం కాంటాక్టర్లు కూడా పగిడీ కోసం వసూలు చేసిన డబ్బుల నుంచి వారికి అనుకూలమైన కొంత మందికి పాలకవర్గ సభ్యులకు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు విశ్వసనీయ సమాచారం.
ఇక్కడే కాంట్రాక్టర్లు రెండు వర్గాలుగా చీలిపోవడంతో విషయం రచ్చరచ్చగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే.. ముందుగానే కొంతమంది ప్రజాప్రతినిధులను, పాలకవర్గసభ్యులను ప్రసన్నం చేసుకోవడానికి వారు చెప్పిన వ్యక్తులకు పనులు కేటాయించిన తీరు కూడా రెండు కాంట్రాక్టర్ల వర్గాల మధ్య చిచ్చు పెట్టడానికి వేదికైందని తెలుస్తున్నది. మొత్తం మీద ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో అధికారులు 69 పనులను రద్దు చేసినట్టు ప్రకటించగా.. అది చెల్లుబాటు అవుతుందా.. లేదా? అన్న చర్చ ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.
రద్దు చెల్లుబాటు అవుతుందా..?
రూ.50 కోట్ల టెండర్ల వ్యవహారం రచ్చరచ్చగా మారడం, ఓ వర్గం కాంట్రాక్టర్లు ఒక శాతం చొప్పున డబ్బులు వసూలు చేయడం, అందులో జరిగిన అక్రమాలు, వసూళ్లు, సింగిల్ టెండర్ల వంటి అంశాలపై కొంతమంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం, ఇదే సమయంలో పగిడీ పంపకాల విషయంలో విభేదాలు పొడచూపడం వంటివి తీవ్ర దుమారం లేపాయి. ఇది మరింత ముదిరే అవకాశం ఉందని భావించిన అధికారులు, సింగిల్ టెండర్లు వచ్చిన 69 పనులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించడంతోపాటు రీకాల్ చేయనున్నట్టు వెల్లడించారు.
అయితే అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం చెల్లుబాటు అవుతుందా.. లేదా..? అన్నదానిపై అనేక సందేశాలు వ్యక్తమవుతున్నాయి. జీవోఎంఎస్ నంబర్ 59 ప్రకారం ఎస్సీ, ఎస్టీల కోసం కేటాయించిన పనుల్లో సదరు పనులకు సింగిల్ టెండర్ వచ్చి, అది కూడా లెస్‌లో ఉంటే ఆ టెండర్లను రద్దు చేయడానికి అవకాశం లేదని స్పష్టమవుతున్నది. కానీ, తాజాగా అధికారులు రద్దు చేసిన పనుల్లో సుమారు రూ.12కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన పనులున్నాయి. వీటికి లెస్‌లో సింగిల్ టెండర్లు వచ్చాయి. ఈ ఆంశంపై కోర్టుకు వెళ్తే అధికారులు తీసుకున్న నిర్ణయం చెల్లుబాటు కాకుండాపోయే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం రద్దు చేసిన 69 పనుల్లో అన్నీ టెండర్లను ఒక వ్యూహం ప్రకారంగానే కాంట్రాక్టర్లు లెస్‌కు దాఖలు చేశారు. లెస్‌లో ఉన్న టెండర్లను ఎందుకు రద్దు చేశారని పేర్కొంటూ మరి కొంతమంది కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమైనట్టు తెలుస్తున్నది. ఇంజినీరింగ్ సాంకేతిక నిపుణులు చెబుతున్న దాని ప్రకారం చూస్తే.. మొత్తం నోటిఫికేషన్ రద్దు చేస్తే అధికారులు తాజాగా తీసుకున్న నిర్ణయం చెల్లుబాటు అయ్యే అవకాశం ఎక్కువగా ఉండేదని, అలా కాకుండా కొన్ని పనులను మాత్రమే రద్దు చేయడం వల్ల ఆచరణకు వచ్చే సరికి చెల్లుబాటు అవుతుందా.. లేదా? అనేది మున్ముందు స్పష్టమవుతుందని పేర్కొంటున్నారు. అధికారులు తీసుకున్న నిర్ణయంపై ఒక వర్గం కాంట్రాక్టర్లు కోర్టులో సవాల్ చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది.
ఈ పరిస్థితుల్లో అధికారుల నిర్ణయం నిలుస్తుందా.. లేదా..? అన్న చర్చ బల్దియాలో జరుగుతున్నది. రద్దుపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టెండర్ల వ్యవహారంపై వస్తున్న విమర్శల నుంచి తప్పించుకోవడానికి పాలకవర్గంలోని కొంతమంది సభ్యుల సూచనల మేరకు అధికారులు ఈ నిర్ణయం తీసుకొని కోర్టుకు వెళ్లే అవకాశం కల్పిస్తున్నారా..? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అలాగే టెండర్లు రద్దయ్యాయి కాబట్టి తాము ఇచ్చిన డబ్బులు తిరిగి తమకు ఇవ్వాలంటూ పలువురు కాంట్రాక్టర్లు పట్టుబడుతున్నట్టు చర్చ నడుస్తున్నది.
మొత్తం టెండర్లు రద్దు చేయాలి
రూ.50 కోట్ల టెండర్లలో కాంట్రాక్టర్లు సిండికేట్ అయిన వ్యవహారంపై మేయర్ సమాధానం చెప్పాలి. టెండర్ల గడువు 13 వరకు ఉంటే వాటిని 20 వరకు ఎందుకు పొడిగించారో చెప్పాలి. ఇది సిండికేట్‌కు అవకాశం కల్పించినట్టు కాదా..? నిజానికి ముందుగా నిర్ణయించిన ప్రకారం 13కు టెండర్ల గడువు పూర్తి చేసి ఉంటే.. ఈ పరిస్థితి తలెత్తేది కాదు. అంతేకాదు, కొన్ని టెండర్లు రద్దు చేయడం వల్ల లాభం ఉండదు. వెంటనే టెండర్ నోటిఫికేషన్ మొత్తం రద్దు చేయాలి. ప్రతి పనికి ఓపెన్ టెండర్ జరిగేలా చర్యలు తీసుకోవాలి. వీటితోపాటు ఇటీవలి కాలంలో సింగిల్ టెండర్లు మాత్రమే వస్తున్న వ్యవహారంపై మేయర్ స్పందించి విచారణ చేయాలి. ప్రతి టెండర్ పాదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి.
– రవీందర్ సింగ్, బీఆర్ఎస్ కార్పొరేటర్