కరీంనగర్, ఏప్రిల్ 3 (నమస్తేతెలంగాణ ప్రతినిధి) :తెలంగాణ రైతుల మీద కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై ఇక రణం చేస్తామని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. లక్షలాది మంది అన్నదాతలు పండించిన ధాన్యాన్ని కొనకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ఒకే దేశం.. ఒకే కొనుగోలు వ్యవస్థ ఉండాలని, కానీ.. బీజేపీ సర్కారు మాత్రం పంజాబ్, తెలంగాణ రాష్ర్టాల్లో వేర్వేరు విధానాలను అనుసరిస్తున్నదని, ఇది ద్వంద్వ నీతికి, మన రాష్ట్ర రైతులపై చూపుతున్న వివక్షకు ప్రత్యక్ష నిదర్శనమని ధ్వజమెత్తారు. రైతులకు న్యాయం చేయాలని శాంతియుతంగా విన్నవించినా కేంద్రం అవహేళనగా మాట్లాడుతున్నదని, అందుకే రైతు శ్రేయస్సుకోసం పోరుబాట ఎంచుకోక తప్పడం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, కేంద్రం వైఖరి వల్ల ఎక్కువ నష్టం ఉమ్మడి జిల్లా రైతులకు జరుగుతున్నదని, అన్నదాతల సంక్షేమం కోసం టీఆర్ఎస్ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో రైతన్నలు అధికంగా పాల్గొని మద్దతు తెలుపాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర రైతాంగం కోసం కేంద్రంతో ఇక యుద్ధం చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. వ్యవసాయక దేశంలో ధాన్యాన్ని లాభం కోణంలో చూడవద్దని, పండించిన పంటలను మద్దతు ధరతో కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని శాంతియుతంగా విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని, ఈ నేపథ్యంలో రాష్ట్ర రైతుల సంక్షేమం కోసం ఆందోళన బాట పడుతున్నామని చెప్పారు. ఆదివారం ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు.
తెలంగాణపై అసూయ?
ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంలో యావత్ తెలంగాణ రైతాంగం సిరుల పంట పండిస్తున్నది. ఆత్మహత్యలు పోయి దేశానికి అన్నం పెట్టే స్థాయికి రాష్ట్రం ఎదిగింది. రైతుల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్ర సర్కారు రైతు బంధు, రైతు బీమా అమలు చేయడమే కాదు… ప్రాజెక్టులు కట్టి నెర్రెలు బారిన భూములను సస్యశ్యామలం చేసింది. ఎక్కడ పొలాల్లో చూసినా కాళేశ్వరం జలాలు పారుతున్నాయి. ఫలితంగా యావత్‌దేశ రైతాంగం మన రైతుల పైపు చూస్తున్నది. దీంతో కేంద్రం ఈర్ష్యా భావం పెంచుకుంది. అసూయతో ఎలాగైనా సరే తెలంగాణ రైతాంగం అభివృద్ధికి అడ్డుకట్ట వేయాలని భావిస్తున్నది. అందుకే పండించిన పంటను కొనకుండా కొర్రీలు పెడుతున్నది. రైతుల పంటలను కొనకుండా వారిని మనోవేదనకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నది.
లాభసాటిగా చూడవద్దు
కేంద్రం వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా చూస్తున్నది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ధాన్యం ఎగుమతి చేస్తే నష్టం వస్తుందని భావిస్తున్నది. నిజానికి మనది వ్యవసాయక దేశం. లక్షలాది మంది రైతులు వ్యవసాయ ఆధారంగా జీవనోపాధి పొందుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న శీతోష్ణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు పండిస్తారు. ఈ పరిస్థితుల్లో వాటికి మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అన్న విషయం రాజ్యాంగమే స్పష్టం చేస్తున్నది. అలాంటప్పుడు.. ధాన్యం నిల్వలున్నాయని, తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనేది లేదంటూ కొర్రీలు వేయడమే కాదు.. అవి నూకలు అవుతున్నాయంటూ, వాటిని తెలంగాణ ప్రజలకే పెట్టండి అంటూ అవహేళన చేస్తూ మాట్లాడుతున్నది. ఇంత కన్నా అవమానం మరొకటి ఉండదు. నిజానికి ధాన్యం కొనుగోలు విషయాన్ని ఒక సామాజిక బాధ్యతగా చేపట్టాలన్నదే మా డిమాండ్. ఆ విషయంపై కేంద్రం నేటికీ క్లారిటీ ఇవ్వడం లేదు.
టీఆర్ఎస్కు పోరుబాట కొత్తకాదు
ధాన్యం కొనాలంటూ మంచిమాటతో చెప్పాం. విజ్ఞప్తులు, విన్నపాలు చేశాం. సాక్షాత్తూ ముఖ్యమంత్రి పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అయినా, కేంద్రం కనికరం చూపడం లేదు. రాష్ట్ర రైతులపై అదే వివక్ష చూపుతున్నది. వీటిన్నంటినీ పరిగణనలోకి తీసుకొని.. రైతు శ్రేయస్సు కోసం రణం చేయాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. అందుకోసం నేటి నుంచి పోరుబాట పడుతున్నాం. కేంద్రం ఆడుతున్న డ్రామాలు, తద్వారా తెలంగాణ రైతాంగానికి జరిగే నష్టం, భవిష్యత్‌లో ఏర్పడబోయే పరిణామాలు వంటి అంశాలను రైతులకు విడమరిచి చెప్తాం. కేంద్రం రైతుల నోట్లో ఎలా మట్టి కొట్టే కుట్రలు చేస్తున్నదో వివరిస్తాం. యావత్ రైతాంగానికి అర్థమయ్యేలా చెప్తాం. అంతేకాదు.. టీఆర్ఎస్కు పోరు బాట కొత్త కాదు. ఎందుకంటే. తెలంగాణ ప్రాంతానికి, ప్రజలకు జరిగిన అన్యాయాలపై ఎన్నోసార్లు ఉద్యమాలు చేశాం., పోరు సాగించి తెలంగాణ సాధించిన చరిత్ర మన ప్రజలకు ఉంది. ఇప్పుడూ ఆదే జరుగుతుంది.
అండగా నిలువడానికి అనేక మార్గాలు
నిజానికి రైతులకు అండగా నిలువాలన్న లక్ష్యం, చిత్తశుద్ధి ఉంటే.. ఏ రకంగానైనా ధాన్యం కొనుగోలు చేయవచ్చు. ఉదాహరణకు గతంలో ఒక దశలో మక్కల ధరలు పూర్తిగా పడిపోయాయి. అన్నదాతలు నష్టపోవద్దన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ క్వింటాలుకు రూ.1650 పెట్టి కొనుగోలు చేశారు. ఆ మేరకు వాటిని బహిరంగ వేలం ద్వారా రూ.1200లకే అమ్మాల్సి వచ్చింది. నిజంగా కేంద్రం వద్ద నిల్వలు ఉంటే.. పండించిన పంటను కొనుగోలు చేసి, వాటిని ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయాలి. లేదా వివిధ దేశాలకు ఎగుమతి చేయాలి. రైతుల విషయాన్ని లాభసాటిగా చూడకుండా.. వారికి అండగా నిలువాలి. ఈ విషయాన్ని పదే పదే కేంద్రానికి చెబుతున్నా తెలంగాణ రైతులపై మొండిగా వ్యవహరిస్తున్నది. ఇప్పటికైనా ఈ వైఖరి విడనాడి అండగా నిలువాలి.
ఎఫ్‌సీఐ ఎందుకు పెట్టినట్లు?
వివిధ రాష్ర్టాల్లో పండించే ధాన్యాన్ని లేదా వాటి ద్వారా వచ్చే బియ్యాన్ని సేకరించాలన్న లక్ష్యంతోనే 1965లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఆనాటి ప్రభుత్వాలు అమల్లోకి తెచ్చాయి. రాజ్యాంగంలోని పలు అంశాలను పరిగణలోకి తీసుకొని చట్టపరంగా ఏర్పాటు చేసిన సంస్థ. ఎఫ్‌సీఐ ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు.. యథావిధిగా కొనుగోళ్లు చేస్తూ వస్తున్నారు. కానీ.. ఈ ఏడాది బీజేపీ సర్కారు మోకాలడ్డుతోంది. ఇన్నాళ్లుగా లేని సమస్య ఇప్పుడు ఎందుకు ఉత్పన్నమవుతుందన్న దానికి కేంద్రం నేటికీ సూటిగా సమాధానం ఇవ్వలేదు. దాటవేసే ధోరణి అవలంబిస్తున్నది. ఇదే విధానం పంజాబ్‌లో అనుసరించడం లేదు. నిజానికి నిల్వలు ఎక్కువగా ఉంటే.. ఆ నిబంధనలు పంజాబ్‌కు కూడా వర్తించాలి కదా. కేవలం తెలంగాణ రైతులకు మాత్రమే ఎందుకు వర్తిస్తాయో చెప్పాలి. స్థానిక బీజేపీ నాయకులు కూడా పూటకో మాట మాట్లాడుతున్నారు. వారిని ప్రజలు గమనిస్తున్నారు.
కదలిరావాలి
రైతాంగానికి జరుగుతున్న అన్యాయంపై టీఆర్ఎస్ నేటి నుంచి పోరుబాట పడుతోంది. ఇందుకోసం గ్రామస్థాయి నుంచి జిల్లా కే్రంద్రాల వరకు రోజుల వారీగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఏ రోజు ఏ కార్యక్రమాలు జరుగుతాయో ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి జిల్లాలోనూ నిరసన కార్యక్రమాలు భారీగా చేస్తాం. నిజానికి కేంద్రం అనుసరిస్తున్న నిర్లక్ష్యపూరిత వైఖరి వల్ల ఉమ్మడి జిల్లా రైతులు ఇప్పుడే కాదు.. భవిష్యత్‌లోనూ భారీగా నష్టపోతారు. అందుకే అన్నదాతలకు నాదో విజప్తి. టీఆర్ఎస్ చేపడుతున్న నిరసన కార్యక్రమాలకు అన్నదాతలంతా స్వచ్ఛందంగా తరలిరావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే మెజార్టీ రైతులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముందుకొస్తున్నారు. కేంద్రంపై రణం చేయడానికి టీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు ప్రకటించడానికి కదలి వస్తున్నారు. సమస్య పరిష్కారమయ్యేదాకా పోరుబాటను సమష్టిగా ముందుకు నడుపాలన్నదే నా విజప్తి.