IAS school | కోల్ సిటీ, సెప్టెబర్ 20: తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు అద్దం పట్టే పండుగ బతుకమ్మ పండుగ అని, పూలనే దేవతలుగా కొలిచే గొప్ప సంస్కృతి ఒక తెలంగాణకే దక్కిందని ఐఏఎస్ పాఠశాల డైరెక్టర్ పేరం హేమలత శ్రీకాంత్ అన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు మన సంస్కృతీ, సంప్రదాయాలను పరిచయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈమేరకు శనివారం గోదావరిఖని ఎల్.బీ నగర్ లో గల ఇండో అమెరికన్ స్కూల్ లో ముందస్తు బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాల మహిళా టీచర్లు, విద్యార్థినులు తీరొక్క పూలను తీసుకవచ్చి బతుకమ్మలను పేర్చి భక్తి శ్రద్ధలతో కొలిచారు.
ఆనంతరం పాఠశాల ఆవరణలో బతుకమ్మలను ప్రతిష్టించి చుట్టూ తిరుగుతూ బతుకమ్మ ఆట.. పాటలతో అలరించారు. బతుకమ్మ ఆటలతో పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది. డైరెక్టర్ హేమలత మాట్లాడుతూ మానసిక ఉల్లాసంతోపాటు బతుకమ్మ విశిష్టతను తెలియజేయాలనే ఉద్దేశంతో బతుకమ్మ వేడుకలు నిర్వహించామన్నారు. విద్యార్థులకు సమాజం పట్ల కనీస అవగాహన, పండుగల ప్రాశస్త్యం పై పరిజ్ఞానం పెంపొందించడమే ముఖ్య ఉద్దేశమన్నారు. అనంతరం విద్యార్థినులతో కలిసి బతుకమ్మలను నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాస, మహిళా ఉపాధ్యాయులు స్వప్నరాణి, సునీత, దీప్తి, కరుణ, శైలజ, మమత, సుజాత, విజయ, సాహిత్య, ఫాతిమా, స్వప్న, పీఈటీ రమ్యతోపాటు అధిక సంఖ్యలో విద్యార్థులు, పోషకులు పాల్గొన్నారు.