మెట్పల్లి రూరల్, జూలై 26: మెట్పల్లి మండలంలోని పెద్దాపూర్ గురుకుల స్కూల్లో గురువారం అర్ధరాత్రి ఓ విద్యార్థి మరణించడం, మరో ఇద్దరు అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం.. మెట్పల్లి మండలంలోని ఆరపేటకు చెందిన రాజారపు గణాధిత్య (13) పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. గురువారం రాత్రి తోటి విద్యార్థులతో కలిసి నేలపై నిద్రపోయాడు.
అర్ధరాత్రి ఒంటి గం ట తర్వాత అస్వస్థతకు గురైన గణాధిత్య వాంతులు చేసుకొని కుప్పకూలిపోయాడు. తోటి విద్యార్థులు కేర్‌టేకర్ వెంకట్‌కు విషయం తెలుపగా, ఆయన ప్రిన్సిపాల్ విద్యాసాగర్‌కు సమాచారమందించారు. ఆరపేటలోని తండ్రి మహేశ్‌కు తెల్లవారుజామున 3.45 గంటలకు ప్రిన్సిపాల్ ఫోన్ చేసి మీ కొడుకు అస్వస్థతకు గురయ్యాడని, వెంటనే తీసుకెళ్లాలని సూచించారు. దీంతో ఆందోళన చెందిన తండ్రి, తన స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై హుటాహుటిన గురుకుల పాఠశాలకు వెళ్లాడు.
అప్పటికే పాఠశాలలో బోర్లాపడిపోయిన కొడుకును అదే బైక్‌పై మెట్‌పల్లిలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్టు నిర్ధారించారు. అలాగే ఎనిమిదో తరగతికి చెందిన హర్షవర్ధన్, గణేశ్ అనే విద్యార్థులు కూడా అస్వస్థతకు గురయ్యారు. గణేశ్‌ను నిజామాబాద్ దవాఖానకు, హర్షవర్ధన్‌ను మెట్పల్లి వైద్యశాలకు తరలించారు. అయితే గణేశ్‌ను పరీక్షించిన వైద్యులు పాముకాటు వల్లే అస్వస్థతకు గురయ్యాడని తెలిపారు.
గణాధిత్య కూడా పాముకాటు కారణంగానే మరణించాడని తోటి విద్యార్థులు భావిస్తున్నారు. కాగా, అస్వస్థతకు గురైన విద్యార్థులను దవాఖానకు తీసుకెళ్లకుండా ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం చేశాడని విద్యార్థుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వెంటనే దవాఖానకు తీసుకెళ్తే తమ కొడుకు బతికేవాడని గణాధిత్య తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇన్చార్జి ఎంఈవో భీమయ్య, కోరుట్ల ఎస్ఐ కిరణ్ గురుకుల పాఠశాలకు చేరుకొని విచారణ జరిపారు. భయాందోళనకు గురైన పలువురు గురుకుల స్కూల్ విద్యార్థులు ఇండ్లకు వెళ్లిపోయారు.
ఆ తల్లికి పుట్టెడు దుఃఖం ముగ్గురు కొడుకుల మృతితో కన్నీరుమున్నీరు
ఆరపేటకు చెందిన రాజారపు మహేశ్ – లావణ్య దంపతులకు ముగ్గురు కొడుకులు. కాగా, పెద్ద కొడుకు, మూడో కొడుకు గతంలోనే అనారోగ్యంతో మృతి చెందారు. ప్రయోజకుడై తమ బాగోగులు చూస్తాడని ఆశలు పెట్టుకున్న రెండో కొడుకు గణాధిత్య ఇప్పుడు అనుకోని రీతిలో మృతి చెందడం ఆ తల్లిదండ్రులకు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది. ‘మేమేం పాపం చేశామని.. దేవుడు మాకు ఇంత అన్యాయం చేశాడు’ అంటూ గుండెలవిసేలా రోదించిన తీరు గ్రామస్తులను కలిచివేసింది.