Easy teaching | ఓదెల, ఆగస్ట్ 13 : పెద్దపల్లి జిల్లా ఓదెల ఉన్నత పాఠశాలలో టీఎల్ఎం మేళా మండల విద్యాధికారి రమేష్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. దీనికి జిల్లా విద్యాధికారి మాధవి ముఖ్య అతిథిగా విచ్చేసి మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈవో మాధవి మాట్లాడుతూ విద్యాబోధనలో బోధనోపకరణాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ఈ బోధనోపకారణాల వల్ల సులువుగా అర్థమవుతుందని తెలిపారు.
ఈ మేళాలో మండలంలోని ప్రాథమిక, ప్రాథమికున్నత పాఠశాలలో బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు 28 మంది, మొత్తం 60 బోధనోపకరణాలు ప్రదర్శించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు అద్భుతంగా చేసినటువంటి బోధన ఉపకరణాలు ఆకట్టుకున్నాయి. ఇది ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రాం కు ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. విద్యార్థులు ఈ బోధనోపకరణాల ఆధారంగా చాలా సులభంగా విద్యను నేర్చుకోవచ్చని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తిరుపతి, పొత్కపల్లి సబ్ ఇన్స్పెక్టర్ రమేష్, విద్యార్థులు, జ్యూరీ సభ్యులు, కాంప్లెక్స్ హెచ్ఎంలు సాంబయ్య, లక్ష్మీనారాయణ, కొలనూరు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్ ఏసుదాసు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సీఆర్పీలు తిరుపతి, ఓంకార్, ఎంఆర్సీ సిబ్బంది పాల్గొన్నారు .