రాజన్నసిరిసిల్ల కేంద్రాన్ని ఆనుకొని ఉన్న తంగళ్లపల్లి ప్రగతి పథంలో దూసుకెళ్తున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో విరివిగా నిధులు మంజూరుకావడంతో సరికొత్తగా రూపుదిద్దుకున్నది. చీర్లవంచ, చింతలఠాణా శివారులో ఆక్వాహబ్, రైల్వేస్టేషన్ ఏర్పాటు కానుండగా, ఇప్పటికే పూర్తయిన ఫోర్‌లేన్ రహదారుల నిర్మాణం, సెంట్రల్లైటింగ్తో రూపురేఖలు మార్చుకున్నది. ఇలా సకల హంగులతో పట్టణ కళను సంతరించుకుంటున్న గ్రామాన్ని చూసి ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నది.
– సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 28
పాలనా సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం తంగళ్లపల్లిని మండలకేంద్రంగా ఏర్పాటు చేసింది. గ్రామంలో సుమారు 10వేల జనాభా, 6వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. గ్రామ పరిధితో ఇందిరానగర్, పద్మనగర్ కార్మిక్ష క్షేత్రాలు ఉన్నాయి. చేనేత సంఘాలు, మరమగ్గాల పరిశ్రమలు నెలవై ఉన్నాయి. మండలంగా ఏర్పాటు తర్వాత శరవేగంగా అభివృద్ది చెందుతున్నది. ఇండ్ల నిర్మాణాలు జోరందుకున్నాయి. రైస్‌మిల్లులు. పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి.
రోడ్ల విస్తరణతో కొత్త రూపు
సిరిసిల్ల పట్టణం సుంచి తంగళ్లపల్లి శివారు వరకు రోడ్డును విస్తరించారు. సిరిసిల్ల-సిద్దిపేట రహదారిలో నాలుగు వరుసల రహదారి నిర్మించారు. సెంట్రల్‌లైటింగ్ ఏర్పాటుతో ఈ ప్రాంతం చీకటి వేళల్లో కాంతులీనుతున్నది. సిరిసిల్ల-సిద్దిపేట జాతీయ రహదారి మంజూరు కావడంతో తంగళ్లపల్లిలో రూపురేఖలు మారబోతున్నాయి. ఇప్పటికే జాతీయ రహదారి కోసం ఏజెన్సీ సర్వేలు నిర్వహిస్తున్నాయి. త్వరలోనే తుదిరూపు రానున్నది. జాతీయ రహదారి నిర్మాణంతో రవాణా మరింత సులువుగా, సురక్షితంగా ఉంటుంది. రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది.
అంబాభవానీ గుట్ట చుట్టూ కార్యాలయాలు
తంగళ్లపల్లి-లక్ష్మీపూర్ రహదారిని ఆనుకొని అంబాభవానీ గుట్ట చుట్టూ ప్రభుత్వ కార్యాలయాలు నిర్మితమవుతున్నాయి. ఇప్పటికే రూ.1.10 కోట్లతో మండల పరిషత్ ఆఫీసును నిర్మించగా మంత్రికేటీఆర్ ప్రారంభించారు. రూ.25 లక్షలతో రైతు వేదికను అందుబాటులోకి తెచ్చారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో రూ.40 లక్షలతో స్త్రీ శక్తి భవనం, తహసీల్దార్ కార్యాలయాన్ని నిర్మించనున్నారు. దీంతో పాటు తంగళ్లపల్లిలోని సెస్ సబ్ డివిజన్ (తంగళ్లపల్లి, ముస్తాబాద్, ఇల్లంతకుంట మండలాలను కలిపి) కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. దీంతోపాటు సింగిల్‌విండో, కేడీసీసీ బ్యాంకు సైతం ఏర్పాటు యోచనలో ఉన్నారు. దీంతో పలు సంఘాల భవనాలు, నిర్మాణాలు చేపట్టనున్నారు. తాడూరురోడ్డులో సిరిసిల్ల రూరల్ పోలీస్ సర్కిల్ కార్యాలయం నిర్మాణం చేయగా, త్వరలోనే తంగళ్లపల్లి పోలీస్‌స్టేషన్ నిర్మించనున్నారు. రూ.20 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖాన ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఇక్కడి ప్రాథమిక వైద్య కేంద్రంలో ఆరోగ్య మహిళ కింద ప్రతి మంగళవారం మహిళలకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. తాజాగా ఫిజియోథెరపీ సేవలు అందుబాటులోకి తెచ్చారు. అలాగే, తెలంగాణ గిరిజన మహిళా డిగ్రీ కళాశాల, ఫైవ్ ఆర్ట్స్ కళాశాల కూడా కొనసాగుతన్న విషయం తెలిసిందే.
తంగళ్లపల్లి చుట్టూ రహదారులే..
తంగళ్లపల్లి మండల కేంద్రంలో చుట్ట్టూ రహదారులు ఉన్నాయి. మండలకేంద్రంలో సిరిసిల్ల-సిద్దిపేట రహదారి, తంగళ్లపల్లి- తుర్కపల్లికి డబుల్ రోడ్డు, తంగళ్లపల్లి -తాడూరు వరకు డబుల్ రోడ్డు నిర్మాణం చేశారు.తాజాగా తంగళ్లపల్లి నుంచి లక్ష్మీపూర్ మీదుగా వెల్జీపూర్ వరకు డబుల్ రోడ్డు పనులు జరుగుతున్నాయి.
భూముల ధరలకు రెక్కలు
తంగళ్లపల్లి మండల కేంద్రం ఏర్పాటుతో ఇక్కడి భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. వ్యవసాయ భూములతోపాటు స్థిరాస్తి విలువలు భారీగా పెరిగాయి. తంగళ్లపల్లి చుట్టూ రోడ్లు, జాతీయ రహదారి రావడంతో భూముల ధరలు అమాంతం పెరిగాయి. జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో సిరిసిల్ల-సిద్దిపేట రహదారి ఆనుకొని తంగళ్లపల్లి ఉండడంతో స్థిర ఆస్తులకు కూడా డిమాండ్ పెరిగింది. రాబోయే రోజుల్లో మరింత డిమాండ్ పెరుగనుండగా రియల్ వ్యాపారం ఊపందుకోనుంది.
మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు
తంగళ్లపల్లి మండలం ఏర్పాటుతో దశ మారింది. తనకు సిరిసిల్ల రూరల్ జడ్పీటీసీగా, తంగళ్లపల్లి జడ్పీటీసీగా వరుసగా రెండు సార్లు అవకాశాలు కల్పించారు. మండలాన్ని అన్ని విధాలా అభివృధ్ధికి కృషి చేస్తున్నారు. మంత్రికేటీఆర్ ముందుచూపుతోనే మండలంలో అన్ని విధాలా అభివృద్ధిలో ముందున్నది. మండల కేంద్రంలో మౌలిక వసతులతోపాటు విద్య,వైద్యం,ఉపాధి,ప్రజలు చేరువయ్యేలా పాలన అందిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ప్రజలు అదృష్టవంతులు.
– పుర్మాణి మంజుల, జడ్పీటీసీ (తంగళ్లపల్లి)
తంగళ్లపల్లిలోనే సెస్ సబ్ డివిజన్
తంగళ్లపల్లిలోనే త్వరలో సెస్ సబ్‌డివిజన్ ఏర్పాటు చేయనున్నాం. దీని పరిధిలో తంగళ్లపల్లి, ఇల్లంతకుంట, ముస్తాబాద్ మండలాలు ఉంటాయి. మెరుగైన సేవలు అందుతాయి. ముఖ్యంగా రైతులకు ఇబ్బందులు తప్పుతాయి. మంత్రి కేటీఆర్ సహకారంతోనే మండలం అన్నింటా అభివృద్ధి చెందుతున్నది. ప్రజల తరఫున అమాత్యుడికి కృతజ్ఞతలు.
– చిక్కాల రామారావు, సెస్ చైర్మన్ (సిరిసిల్ల)
కేటీఆర్ ప్రత్యేక చొరవతోనే మండలం
మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతోనే తంగళ్లపల్లి మండలం ఏర్పాటైంది. తొలి ఎంపీపీగా నాకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్న. మండల కేంద్రాన్ని అన్ని విధాలా అభివృద్ధికి కృషి చేస్తున్నాం. ఇప్పటికే మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయం, రైతు వేదిక, పల్లె దవాఖాన, రోడ్ల విస్తరణ, సెంట్రల్‌లైటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఇంకా అభివృధ్ది పనులు చేసుకోబోతున్నాం.
– పడిగెల మానస, ఎంపీపీ (తంగళ్లపల్లి)
తంగళ్లపల్లికి సముచిత స్థానం
తంగళ్లపల్లికి మంత్రి కేటీఆర్ సముచిత స్థానం కల్పిస్తున్నారు. ఇక్కడ నూతన మోడల్ గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులను చేపట్టాం. తంగళ్లపల్లి మాస్టర్ ప్లాన్‌ను రూపోందించాం. సిరిసిల్లకు సమాంతరంగా తంగళ్లపల్లిని అభివృద్ధి చెందుతున్నది. పల్లె ప్రగతిలో మోడ్రన్ వైకుంఠ ధామం, పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డు, నర్సరీలు ఏర్పాటు చేశాం. రోడ్డుకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ చేశాం. రోడ్ల విస్తరణతో నాలుగు వరుసల రహదారి ఏర్పాటు కావడంతోపాటు సెంట్రల్ లైటింగ్‌తో పట్టణంలా తళుక్కుమంటున్నది.
– అంకారపు అనిత, సర్పంచ్ (తంగళ్లపల్లి)