2 లక్షలకుపైగా శాంపిల్స్.. 7 లక్షలకుపైగా ఫ్రీ టెస్టులు.. వీటి విలువ అక్షరాలా 17కోట్లకుపైనే.. ఇది కరీంనగర్ టీహబ్ ఘనత! జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ పేదలకు వరంలా మారింది. టెస్టుల పేరిట ప్రైవేట్ ల్యాబ్‌లు పీల్చి పిప్పిచేస్తున్న ప్రస్తుత సమయంలో పైసా ఖర్చు లేకుండా 57 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తూ.. పక్కా రిపోర్టులు అందిస్తున్నది. డ్రైరన్‌లో భాగంగా 2020 జనవరి 6 నుంచి ఇప్పటి వరకు 7,08,005 రకాల టెస్టులు చేయగా, నిరుపేదలకు ఆర్థికభారం తప్పుతున్నది.
విద్యానగర్, ఏప్రిల్ 8 : కరీంనగర్‌లోని ప్రభుత్వ ప్రధాన దవాఖానలో ఏర్పాటు చేసిన టీహబ్ నిరుపేదలకు వరంగా మారింది. చిన్న రోగమైనా ప్రైవేటుకు వెళ్తే వైద్యుల ఫీజులు, నిర్ధారణ పరీక్షలకు వేల వేలు ఖర్చవుతుండగా, ఇవన్నీ ప్రభుత్వ దవాఖానలో ఉచితంగా లభిస్తున్నాయి. అంతే కాకుండా, అత్యాధునిక పరికరాలతో పరీక్షలు చేస్తుండడంతో రోగులు ప్రభుత్వ దవాఖానకు క్యూ కడుతున్నారు.
ఆన్లైన్లో రోజుకు వెయ్యి పరీక్షలు నమోదు
టీ-హబ్‌కు జిల్లా వ్యాప్తంగా పీహెచ్సీ, యూపీహెచ్సీ, జిల్లా ప్రధాన దవాఖాన నుంచి రోజుకు వెయ్యి మందికి పైగా పరీక్షల కోసం శాంపిల్స్ వస్తున్నాయి. ఇందులో ఎక్కువగా షుగర్, థైరాయిడ్ కేసులు వస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసి 24 గంటల్లోపే రిపోర్టులు వారికి అందిస్తున్నాం. నేరుగా మొబైల్‌కు లింక్ ద్వారా చేరవేస్తున్నాం. మొబైల్ లేని వారికి శాంపిల్స్ ఇచ్చిన సెంటర్లలో ప్రింట్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాం. అత్యాధునిక టెక్నాలజీ పరికరాలు అందుబాటులో ఉండటంతోపాటు ఒకేసారి ఎక్కువ మోతాదులో శాంపిల్స్ పెట్టి ఖచ్చితమైన రిపోర్టు లభించడంతో ప్రజల తాకిడి ఎక్కువైంది.
– మమత, డాటా ఏంట్రీ ఆపరేటర్
నమూనాల సేకరణకు రూట్లు
ప్రతి రోజూ రక్త, మూత్ర నమూనాలను సేకరించేందుకు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మూడు రూట్లను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం సమకూర్చుతున్న వాహనాల ద్వారా ఈ నమూనాలు తరలిస్తారు. చొప్పదండి రూట్లో కొత్తపల్లి, గంగాధర, గుండి, రామడుగు, చొప్పదండి పీహెచ్‌సీలు, హుజూరాబాద్ రూట్లో కేశవపట్నం, హుజూరాబాద్, చెల్పూర్, సైదాపూర్, చిగురుమామిడి, తిమ్మాపూర్ పీహెచ్‌సీలు, జమ్మికుంట రూట్లో మానకొండూర్, చల్లూరు, వీణవంక, వెల్ది, జమ్మికుంట, ఇల్లందకుంట పీహెచ్‌సీలను చేర్చారు. ప్రతి రోజూ మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ రూట్లలో వాహనాలు రక్త, మూత్ర నమూనాలను చేరవేస్తాయి. ఏ రోజుకారోజు పరీక్షలు నిర్వహిస్తారు.
27 కేంద్రాలతో హబ్
వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ వ్యాధి నిర్ధారణ కేంద్రం పరిధిలో 27 కేంద్రాలు (స్పోక్) కలిపి హబ్‌గా ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో జిల్లాలోని 16 పీహెచ్‌సీలు, 6 అర్బన్ హెల్త్ సెంటర్లు, కరీంనగర్, హుజూరాబాద్, జమ్మికుంటలోని ప్రభుత్వ దవాఖానలు, ఒక ఎంసీహెచ్, మరొక వెల్నెస్ సెంటర్‌కు సంబంధించిన రోగులకు ఇక్కడ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ కేంద్రాలకు వైద్యం కోసం వచ్చే వారి నుంచి రక్త, మూత్ర పరీక్షలు సేకరించి ఇక్కడికి సంబంధిత వైద్యులు ఇక్కడికి పంపిస్తారు.
ఆన్లైన్లోనే నివేదికలు
ఈ కేంద్రంలో జరిగే ప్రతి పరక్షను రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక వైద్య నిపుణులు పర్యవేక్షిస్తా రు. ఇందుకు బయో కెమిస్ట్రీ, ఫాథాలజిస్టు, మైక్రో బయోలజిస్టులైన వైద్య నిపుణులు హైదరాబాద్ కేంద్రంగా ప్రతి రిపోర్ట్‌ను పరిశీలిస్తారు. వీటిని తిరిగి స్థానిక నిర్ధారణ పరీక్షల కేంద్రానికి నివేదిస్తారు. వీటిని సంబంధిత రోగుల మొబైల్ ఫోన్లకు అటాచ్ చేస్తారు. మ్యాన్యువల్ రిపోర్టులు అవసమున్న రోగులు తాము రక్త, మూత్ర నమూనాలు ఇచ్చిన కేంద్రాలకు వెళ్లి పొందే సదుపాయం కల్పించారు.
రెండు షిఫ్టుల్లో విధులు
పూర్తిగా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పరీక్షల నిర్ధారణ కేంద్రం 24 గంటలు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రెండు షిఫ్టుల కోసం సిబ్బందిని డిప్యుటేషన్‌పై నియమించారు. కేంద్రం పర్యవేక్షణకు సివిల్ సర్జన్ క్యాడర్ అధికారిని నోడల్ ఆఫీసర్‌గా నియమించారు. ప్రస్తుతం ఈ విధులు డాక్టర్ రవీందర్‌రెడ్డి నిర్వహిస్తున్నారు. ఔట్ సోర్సింగ్ విధానంలో ఒక ల్యాబ్ మేనేజర్‌ను నియమించారు. అలాగే పదకొండు మంది ల్యాబ్ టెక్నీషియన్లను తీసుకున్నారు.
57 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు
రాష్ట్ర ప్రభుత్వం కొత్త కాన్సెప్ట్‌లో ప్రారంభించిన రోగ నిర్ధారణ పరీక్షల కేంద్రంలో ఇప్పటికే పలు టెస్టులు చేస్తుండగా, బయో కెమిస్ట్రీ, ఫాథలాజికల్, మైక్రో బయోలజీకి సంబంధించిన 57 రకాల పరీక్షలు నిర్వహించనున్నారు. బయోకెమిస్ట్రీ టెస్టుల కోసం అత్యాధునిక సదుపాయాలతో ఉన్న పుల్లీ ఆటోమోటెడ్ మిషన్ ఏర్పాటు చేశారు. అందులో కెమికల్ బయో కెమిస్ట్రీకి సంబంధించి న రక్త, మూత్ర పరీక్షల్లో ఏఎల్పీ, బీ యూఎం, ఎల్డీఎల్, ఎఫ్బీఎస్, జీజీటీ, జీటీటీ, ఎల్‌హెచ్, ఎల్ఎఫ్టీ, లిపిడ్ ఫ్రొఫైల్, పీఎల్బీఎస్, ఆర్బీఎస్ (ర్యాండం బ్లడ్ షుగర్), ఆర్ఎఫ్టీ, సిరమ్ టోటల్, సిరమ్ కెంబిల్ రూబిన్ డైరెక్ట్, సిరమ్ హెడీఎల్, సిరమ్ కొలస్ట్రాల్, టోటల్ ప్రొటీన్, యూరిక్ క్యాసిడ్, ఎలక్ట్రో వైడ్స్, ఎస్జీఓటీ, ఎస్‌జీపీటీ వంటి అనేక నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ కెమిస్ట్రీ అనలైజర్ మిషన్ గంటలో 1,800 శాంపిల్స్‌ను పరీక్షించే సామర్థ్యం కలిగి ఉన్నది. 75 లక్షల విలువైన ఇలాంటి మిషన్ ఇప్పటి వరకు ఏ ప్రైవేట్ దవాఖానలో కూడా లేదు.
ఇమ్యునో కెమిస్ట్రీ అనలైజర్ ఇందులో హార్మోన్లకు సంబంధించిన టీ-3, టీ-4, టీఎస్‌హెచ్, తదితర పరీక్షలు నిర్వహిస్తారు. అన్ని రకాల హార్మోన్లు, థైరాయిడ్ పరీక్షలు ఈ మిషన్ ద్వారా పరీక్షిస్తారు. గంటకు 800 శాంపిల్స్‌ను పరీక్షించే సామర్థ్యంగల ఈ మిషన్ ఖరీదు 65 వరకు ఉంటుంది.
ఇక ఫాథలాజికల్ విభాగంలో ఫైవ్ పార్ట్స్ సెల్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. రక్త కణాలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించే ఈ మిషన్‌లో ప్లేట్ లెట్స్, తెల్ల, ఎర్ర రక్త కణాలను పరీక్షిస్తారు. సీబీపీ, ఏఈసీ, కూంబ్స్ టెస్టు డైరెక్ట్, ఇన్ డైరెక్ట్, డీఎల్సీ, ఈఎస్ఆర్, పీసీవీ, టీఎల్సీ వంటి అన్ని రక్త కణాలకు సంబంధించిన అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లాలోని కార్పొరేట్ దవాఖానాల్లోనూ ఇలాంటి మిషన్లు లేవు. జిల్లాలో ఇప్పటి వరకు త్రీ పార్ట్స్ సెల్ కౌంటర్ మిషన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 8 లక్షల వ్యయంతో ఫైవ్ పార్ట్స్ సెల్ కౌంటర్‌ను ఏర్పాటు చేశారు.
ఫాథలాజికల్ విభాగంలోని మరో యూనిట్ లో యూరినల్ అనలైజర్ మిషన్‌తో అన్నిరకాల మూ త్ర పరీక్షలు నిర్వహిస్తారు. స్ట్రీక్ మెథడ్ ద్వారా ఒకేసారి 12రకాల టెస్టులు నిర్వహించే సామర్థ్యం ఈ మిషన్‌కు ఉంది. 3లక్షలతో దీనిని నెలకొల్పారు. ఎలిసా రీడర్స్ మైక్రో బయోలజీ విభాగంలో పనిచేసే ఈ మిషన్ ద్వారా డెంగీ, సైన్ఫ్ల్యూ చికెన్‌గున్యా పరీక్షలతోపాటు ఏఎస్ఓ, సీఆర్పీ, ఆర్ ఎఫ్, ఆర్పీఆర్, టైడీ ఐజీఎం, ఐజీ జీ వం టి పరీక్షలు కూడా నిర్వహిస్తారు. 2 లక్షల వ్యయంతో ఈ మిషన్‌ను ఏర్పాటు చేశారు.
గుండె సంబంధిత వ్యాధులకు గుర్తించేందుకు 3లక్షల వ్యయంతో 2డీ ఎకో మిషన్ ఏర్పాటు చేశారు. ఈసీజీలో నిర్ధారణ కాని వ్యాధులను మాత్రమే ఈమిషన్పై పరీక్షిస్తారు. దీనికి అనుబంధంగా రూ.లక్ష వ్యయంతో ఈసీజీ మిషన్ కూడా ఏర్పాటు చేశారు. మమోగ్రామ్ సైతం ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా లక్ష వ్యయం లో సెంట్రీ ఫ్యూజ్‌లు, మరో లక్షతో మైక్రో స్కోప్, 2లక్షలతో వాటర్ బాత్‌లు ఏర్పాటు చేశా రు. నిర్ధారణ పరీక్షల కేంద్రానికి 3 లక్ష లు వెచ్చించి ప్రత్యేకంగా జనరేటర్‌ను అమర్చారు. మొత్తంగా చూస్తే ఈ వ్యాధి ని ర్ధారణ కేంద్రం ఏర్పాటు కు రాష్ట్ర ప్రభుత్వం 2 కోట్లు ఖర్చు చేసింది.
ఎన్‌ఎబీఎల్ గుర్తింపు రావడం సంతోషం
క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా నుంచి నేషనల్ అక్రిడేషన్ బోర్డు ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబిరేషన్ ల్యాబొరేటరీస్ సర్టిఫికేట్‌ను పొందడం ఆనందంగా ఉంది. ఈ రిపోర్టు ప్రపంచ వ్యాప్తంగా పని చేస్తుంది. టీ-హబ్‌కు రోజుకు మూడు షిప్టుల్లో వెయ్యి మందికి పైగా శాంపిల్లు వస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఫలితాలు అందిస్తున్నాం. గతంతో పోల్చితే ఇప్పుడు పరీక్షలు రెట్టింపయ్యాయి. ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన వచ్చింది. ఒక్కొక్కరికి ప్రైవేట్ దవాఖానాల్లో 57 రకాల పరీక్షలకు రూ.10 వేలకు పైగా ఆర్థిక భారం పడుతుంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక దగ్గరలో ఉన్న ప్రతి ఆరోగ్య కేంద్రంతోపాటు అర్బన్ హెల్త్ సెంటర్లలో శాంపిల్స్ ఇస్తే 24 గంటల్లోనే ఫలితాలు వస్తున్నాయని, ప్రజలకు తెలిసింది. దీంతో రోజురోజుకూ పరీక్షల సంఖ్య పెరిగింది.
– డాక్టర్ సమీరా నౌషీన్, మేనేజర్
అందుబాటులో ఖరీదైన పరీక్షలు
పేదల కోసం టీ-హబ్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఖరీదైన రక్త పరీక్షలు ఉచితంగా అందిస్తున్నది. ప్రస్తుతం 57 రకాల పరీక్షలను ఉచితంగా చేస్తున్నది. దీంతోపాటు త్వరలోనే మరో 83 రకాల పరీక్షలను అందించేందుకు ఇప్పటికే టీ-హబ్‌కు అత్యాధునిక పరికరాలను సమకూర్చారు. ప్రజలకు టీ-హబ్‌పై నమ్మకం పెరగడంతో పరీక్షల తాకిడి పెరిగింది. షుగర్ ఫ్రొఫైల్, లివర్, థైరాయిడ్, ఈసీజీ, ఎక్స్‌రే, వంటి అత్యాధునిక వైద్య పరికరాలతో అత్యుత్తమ ఫలితాలను అందిస్తున్నాం.
– జెల్ల భాస్కర్, సీనియర్ ల్యాబ్ టెక్నిషియన్