సిరిసిల్ల రూరల్, అక్టోబర్ 14: సిరిసిల్ల తహసీల్ ఆఫీస్‌లో సర్వేయర్, అసిస్టెంట్ సర్వేయర్లు ఏసీబీకి చిక్కారు. భూమి సర్వే చేసేందుకు సర్వేయర్ మాడిశెట్టి వేణుగోపాల్ 50వేలు లంచం డిమాండ్ చేసి, 20వేలు తీసుకుంటూ పట్టుబడడం కలకలం రేపింది. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్ వివరాల ప్రకారం.. సిరిసిల్లకు చెందిన ఇరుకుల్ల ప్రవీణ్ కొద్ది రోజుల క్రితం సిరిసిల్ల మున్సిపల్ 10వ వార్డు పరిధిలో ఉన్న మూడెకరాల ల్యాండ్ సర్వే కోసం సిరిసిల్ల తహసీల్ ఆఫీస్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. భూమి సర్వే చేయాలని సర్వేయర్ వేణుగోపాల్‌ను కోరాడు.
అయితే 50వేలు ఇస్తేనే సర్వే చేస్తానని వేణుగోపాల్ చెప్పడం, కొన్ని రోజులుగా కార్యాలయం చుట్ట్టూ తిప్పించుకోవడంతో ప్రవీణ్ విసుగు చెంది, ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు వేణుగోపాల్‌తో 30వేలకు ఒప్పందం చేసుకున్నాడు. రెండు రోజుల కింద 10వేలు ఇవ్వగా, సర్వేయర్ వేణుగోపాల్, అసిస్టెంట్ సర్వేయర్ సూర్యవంశీ వచ్చి భూమిని కొలిచారు. సర్వే సమయంలో భూమి వద్ద స్థానికులతో కొంత గొడవ జరిగింది. అయినా సర్వే పూర్తి చేసుకొని వెళ్లిపోయారు.
రిపోర్టు కోసం ప్రవీణ్ మంగళవారం సిరిసిల్ల తహసీల్ ఆఫీస్ వద్దకు వెళ్లాడు. సర్వేయర్, అసిస్టెంట్ సర్వేయర్లు ఇద్దరూ కార్యాలయంలోపల ఉన్నారు. ఈ క్రమంలో అసిస్టెంట్ సర్వేయర్ సూర్యవంశీ కార్యాలయ ఆవరణలోకి రాగా, ప్రవీణ్ 20వేల నగదు అందించాడు. అప్పటికే కాపుకాసి ఉన్న ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వేణుగోపాల్, సూర్యవంశీని అదుపులోకి తీసుకొని నగదును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. ఇద్దరినీ బుధవారం ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని పేర్కొన్నారు. కాగా, ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమకు సమాచారం అందించాలని ఏసీబీ డీఎస్పీ సూచించారు.