Jagityal SP Ashok Kumar | జగిత్యాల క్రైం : శాంతి భద్రతల పరిరక్షణకు గస్తీని మరింత ముమ్మరం చేసి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా బ్లూ కోల్డ్స్, పెట్రోకార్ వాహనాలతో నిరంతర గస్తీ నిర్వహిస్తూ అదనంగా నైట్ బీట్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని, జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని జగిత్యాల ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. గురువారం అర్ధ రాత్రి ఒంటి గంట సమయంలో జగిత్యాల, కోరుట్ల ప్రాంతాల్లో పెట్రోలింగ్ వ్యవస్థను స్వయంగా పరిశీలించి అదికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అర్ధరాత్రి సమయంలో సమర్థవంతమైన పెట్రోలింగ్ ద్వారా ప్రజలలో భద్రత భావాన్ని పెంపొందించడం జిల్లా పోలీసుల లక్ష్యమని, రాత్రి సమయంలో నిఘా మరింత పటిష్టం చేస్తూ సమయానుకూల చర్యలు తీసుకోవడం ద్వారా చాలా వరకు నేరాలను నియంత్రించవచ్చన్నారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను తనిఖీ చేయడం తో పాటు వారి వేలిముద్రలను సేకరించి, గత నేర చరిత్ర గల నిందితులతో సరిపోల్చడం జరుగుతోందన్నారు. అలాగే, అనుమానాస్పద, అక్రమ కార్యకలాపాలను అడ్డుకునే ఉద్దేశంతో జిల్లాలో అనేక ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నామని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, దొంగతనాల నివారణ కు పెట్రోలింగ్ వ్యవస్థను మరింత పటిష్ట పరచేమని, ప్రజలు ప్రశాంతంగా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు.