కరీంనగర్ కార్పొరేషన్, జనవరి 4 : కొండగట్టు క్షేత్రం అభివృద్ధి విషయంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్న మాట మీద నిలబడాలని, ఆయన చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నామని, దమ్ముంటే కొండగట్టు వై జంక్షన్ వద్దకు రావాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సవాల్ చేశారు. వై జంక్షన్‌కు ఏ రోజు.. ఏ సమయంలో వస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన పేరుకే సత్యమని, పలికేవన్నీ కూడా అసత్యాలేనని ఎద్దేవా చేశారు. అనవసరమైన, అర్థంలేని మాటలు మానేసి ప్రజల అభివృద్ధిపై దృష్టి సారించాలని ఎమ్మెల్యేకు సూచించారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ నిధులు మంజూరు చేయడం శుభ పరిణామమని స్వాగతించారు.
ఆంజనేయ స్వామి పవన్ కల్యాణ్ కుటుంబ దైవమని, దేవాలయానికి నిధులు మంజూరు చేయడం భక్తులందరికీ ఆనందాన్ని కలిగించే అంశమని చెప్పారు. కొండగట్టు అభివృద్ధి విషయంలో అబద్ధాలతో ప్రజలను మభ్యపెడుతున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొండగట్టు దేవాలయానికి ఒక రూపాయి నిధులు ఇచ్చినట్టు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సత్యం చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. శాసనమండలి సాక్షిగా బీఆర్ఎస్ ప్రభుత్వం 100 కోట్లు నిధులు కేటాయించిందని మంత్రి కొండా సురేఖ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రి చెప్పింది నిజమా… అబద్ధమా..? అని ప్రశ్నించారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజల ముందుకు రావాలని సవాల్ విసిరారు.
బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని తన ఖాతాలో వేసుకుంటూ ఆయన అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేగా తాను ఉన్న సమయంలో ఎంత అభివృద్ధి చేశారో గణాంకాలతోపాటు అభివృద్ధి చేసిన చిత్రపటాలతో సహా మీడియా ద్వారా ప్రజలకు వివరించారు. ఇటీవల అటవీ శాఖ అధికారులు దేవాలయానికి సంబంధించిన భూమి తమదేనని గుర్తింపులు వేసి వెళ్లారని, ఆలయానికి సంబంధించి ఒక ఇంచు భూమి కూడా ఎవరు లాకోవడానికి ప్రయత్నించిన ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎంత దూరం అయినా వెళ్తామని భక్తులతో కలిసి అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గంట్ల వెంకటరెడ్డి, సాగి మహిపాల్ రావు, ఆకుల మధుసూదన్, చీకట్ల రాజశేఖర్, పూడూరు మల్లేశం, విజయేందర్‌రెడ్డి, ఉప్పల గంగన్న, నాగ శేఖర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇవన్నీ కండ్లకు కనిపించడం లేదా..?
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొండగట్టును అభివృద్ధి చేశాం. వందల కోట్ల విలువైన 680 ఎకరాల భూమిని దేవాలయానికి కేటాయించాం. 1.25 కోట్లు వెచ్చించి కొత్త కోనేరు నిర్మించాం. 2.50 కోట్లతో మెట్ల దారి సుందరీకరించాం. 50 లక్షలతో రామస్తూపం నిర్మాణం చేశాం. 2.50 కోట్లతో దీక్ష విరమణ మండపం, 50 లక్షలతో కల్యాణకట్ట ముందు సీసీ ఫ్లోరింగ్ నిర్మించాం. 30 లక్షలతో గుడి ముందు భాగంలో చదును చేయించాం. కొత్తగా ఈవో కార్యాలయం నిర్మించాం. 2.55 కోట్లతో దేవాలయం పకన భక్తులకు షెడ్డు నిర్మించాం. 50 లక్షలతో శాశ్వత మంచినీటి పరిషారం చూపాం. రామప్ప చెరువు నుంచి గుట్ట కింద సంపు వరకు, అక్కడి నుంచి గుట్టపైకి ప్రత్యేక పైప్‌లైన్ వేశాం. రెండు ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించాం. 7 కోట్లతో గుట్ట కింద షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేశాం. కోటితో బేతాళ ఆలయం వద్ద ఫ్లోరింగ్, 15 లక్షలతో భక్తుల క్యూ లైన్ ఏర్పాటు చేశాం. వరద కాలువ నుంచి గుట్టపైకి నీటి పంపింగ్ కోసం 13.50 కోట్ల నిధులతో పనులు ప్రారంభించాం. ఇవన్నీ మేడిపల్లి సత్యం కండ్లకు కనపడడం లేదా..? కావాలంటే కాంగ్రెస్ నాయకులతో కలిసి వెళ్లి చూడు. నీవు ఒక ఎమ్మెల్యేగా మాట్లడడం లేదు. ఒక రౌడీ లాగా ప్రవర్తిస్తున్నావు.
– సుంకె రవిశంకర్