Online special training | ఎల్లారెడ్డిపేట, జూలై 25: ఎనిమిదో తరగతి నుంచి 12వ తరగతి వరకు ఆన్లైన్లో అందించే ప్రత్యేక శిక్షణా తరగతులను విద్యార్థులు సద్వినియోం చేసుకోవాలని కలెక్టర్ సందీప్‌కుమార్ విద్యార్థులకు సూచించారు. దుమాల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఆన్ అకాడమీ పేరుతో జేఈఈ, నీట్ పరీక్షలకు ఆన్లైన్ కోచింగ్ తరగతులను ఆయన శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకొని పోటీ పరీక్షల్లో రాణించాలని సూచించారు. ప్రతీ రోజూ 2 గంటల పాటు ఆన్ లైన్ కోచింగ్ తరగతుల్లో శిక్షణ తీసుకొని పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలన్నారు.
సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం కూడా ఉందని, పిల్లల ఆంగ్ల భాష స్కిల్ పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. టెన్త్ తర్వాత విద్యార్థులకు మెడికల్ సైడ్ ఆసక్తి ఉంటే నీట్ శిక్షణ, ఇంజనీరింగ్ ఆసక్తి ఉన్న విద్యార్థులకు జేఈఈ ప్రవేశ పరీక్ష రాసేందుకు అవసరమైన శిక్షణ అందించాలని సిబ్బందికి సూచించారు. గతంలో జిల్లాలోని 13 కేజీబీవీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఆన్ అకాడమీ పేరు తో నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షలకు శిక్షణ తరగతులను ప్రారంభించి దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
ప్రస్తుతం జిల్లాలోని మిగిలిన 26 రెసిడెన్షియల్ పాఠశాలలో శిక్షణ ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. అనంతరం కలెక్టర్ పాఠశాలలోని వంట గది, డైనింగ్ హాల్, స్టాక్ రూమ్ లను పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్ తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, పాఠశాల పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ఇక్కడ డీడబ్య్లూవో లక్ష్మీరాజం, పాఠశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ రాంసూరత్ యాదవ్, సిబ్బంది ఉన్నారు.