Potkapally | ఓదెల, జులై 26 : విద్యార్థులు సత్ర్పవర్తనతో మెలగాలని పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ సూచించారు. మండలంలోని పోత్కపల్లి పోలీస్స్టేషన్లో విద్యార్థులతో ఓపెన్ హౌజ్ కార్యక్రమాన్నిశనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రమేష్ విద్యార్థులకు పోలీస్స్టేషన్లో ఉండే రిసెప్షన్ వ్యవస్థ, కేసు డైరీలు, స్టేషన్లో ఉపయోగించే ఆయుధాలు, విధులు, షీటీమ్స్, గంజాయి వలన అనర్దాలపై, సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు.
విద్యార్థులకు పోలీస్స్టేషన్ నిర్వహణ, నేరాలు నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనలు, దొంగతనాల్లో శిక్షలు, శాంతి భద్రతలు పరిరక్షణపై పోలీసుల విధులు, ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ నెట్వర్క్ సిస్టమ్, పోలీస్ కంట్రోల్ రూమ్ పరికరాలు, కమ్యూనికేషన్ మ్యాన్ ప్యాక్ సెట్లు, ఆయుధాలు, చట్టాలపై అవగాహన కల్పించారు.
యువత గంజాయి, మాదక ద్రవ్యాలకు బానిసకావడం వల్ల జీవితాలు నాశనమైపోతాయని, మత్తు పదార్థాల జోలికి పోవద్దని, వాటి వల్ల కలిగే నష్టం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రమేష్, ఏఎస్ఐ కిషన్, పోలీసు సిబ్బంది, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.