Eradicate drugs | కలెక్టరేట్, సెప్టెంబర్ 12: జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జిల్లా స్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ కమిటీ సమాశం శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ యంత్రాంగంతో పోలీసులు, ఎక్సైజ్ అధికారుల సమన్వయంతో మాదక ద్రవ్యాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నట్లు వెల్లడించారు.
డ్రగ్స్ మూలాలను కూకటి వేళ్ళతో పెకిలించి వేయాలన్నారు. ప్రైవేట్ మందుల దుకాణాల్లో కూడా తనిఖీలు చేపట్టి డ్రగ్స్ అమ్మకాలు పరిశీలిలంచాలన్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, హాస్టళ్ళు సందర్శించి డ్రగ్స్ వినియోగిస్తే కలిగే దుష్ప్రరిణామాలతో పాటు మద్య, ధూమపానాలతో ఆపాదించే అనర్ధాలపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ, మత్తు పదార్ధాల వినియోగంతో భవిష్యత్‌లో జరిగే శారీరక, ఆర్థిక నష్టంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
మత్తు పదార్థాల నిల్వలున్నట్లు అనుమానమున్నచోట డాగ్ స్వ్యాడ్తో ముమ్మర తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే డ్రగ్ డిడక్షన్ కిట్లు తెప్పించినట్లు, అవసరానికనుగుణంగా మరిన్ని కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. డ్రగ్స్ వినియోగంపై జిల్లాలో ఉక్కుపాదం మోపుతామని తేల్చిచెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, ఆర్డీవో కె మహేశ్వర్‌తో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.