 
                                                            Peddapally | పెద్దపల్లి రూరల్, అక్టోబర్ 31 : మహిళల భద్రత, ఆన్ లైన్ మోసాలు, యాంటీ డ్రగ్స్ పై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, ప్రస్తుత సమాజ పోకడలను గమనిస్తూ మహిళలు, యువతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పెద్దపల్లి షీటీం ఇంచార్జి ఎస్సై లావణ్య సూచించారు. పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి లో గల పల్లవి మోడల్ స్కూల్ లో విద్యార్థులకు షీటీం అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్సై లావణ్య మాట్లాడుతూ మహిళల భద్రత, ఆన్లైన్ మోసాలు, యాంటీ డ్రగ్స్ పై ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఎవరైనా ఇబ్బందులకు గురయ్యే విదంగా ప్రవర్తిస్తే ఆ విషయాలపై తల్లిదండ్రులకు చెప్పాలన్నారు. అలాంటి ఘటనల నుంచి ఎలా బయటపడటం అనే అంశాలపై అవగాహన కల్పించారు. మహిళల రక్షణ కోసం నిత్యం బస్టాండ్, ప్రధాన చౌరస్తాలు, జన సమీకరణ ప్రాంతాల్లో కాలేజీల వద్ద షీటీం నిరంతరంగా పనిచేస్తున్నదని చెప్పారు.
ఎవరైనా వేధింపులకు గురి చేస్తే మహిళలు, విద్యార్థులు భయపడకుండా నేరుగా 6303923700 నంబర్ కు ఫోన్ చేసి సమస్య తెలపాలన్నారు. ఫోన్ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని, చాలా మంది అత్యాశకు పోయి సైబర్ క్రైమ్ ఆన్ లైన్ మోసాలు, లోన్ యాప్స్ గురవుతున్నారని, వాటికి జోలికి పోకుండా ఉండాలన్నారు. ఎవరైనా ఆన్లైన్ మోసాలకు గురైతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 కి సమాచారమివ్వాలని సూచించారు.
అలాగే మహిళలకు ఏదైనా ప్రమాదం పొంచి ఉన్నట్లయినా, బెదిరింపులకు గురైతే వెంటనే 100 నంబర్ కు డయల్ చేయాలన్నారు. సోషల్ మీడియా ప్రభావం వల్ల జరిగే సంఘటనల గురించి, తల్లి దండ్రులు తీసుకోవాలసిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో షీటీం సభ్యులు మౌనిక, సురేష్, స్నేహలత, భరోసా సపోర్టర్ సింధు, పల్లవి మోడల్ స్కూల్ కరస్సాండెంట్ ఎలువాక శోభరాణి, ప్రిన్సిపాల్ వాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
 
                            