Volleyball Games | ధర్మారం, నవంబర్ 28: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని తెలంగాణ బాలుర గురుకుల కళాశాలలో నిర్వహించిన అండర్- 14 ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు శుక్రవారం ముగిశాయి. ఈ పోటీలు 26 27 28 తేదీలలో జరగా రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాల నుంచి 244 మంది బాల బాలికలు తరలివచ్చారు. మూడు రోజులపాటు ఈ పోటీలు హోరాహోరీగా జరిగాయి. శుక్రవారం ఫైనల్ పోటీలు నువ్వా నేనా అనే రీతిలో తలపడ్డాయి.
ఎంతో ఆసక్తికరంగా జరిగాయి. ఫైనల్ పోటీలలో బాలికల విభాగంలో మహబూబ్నగర్ జట్టుపై నిజామాబాద్ జట్టు విజయం సాధించి విజేతగా నిలిచింది.బాలుర విభాగంలో ఖమ్మం జట్టు వరంగల్ జట్టుపై విజయం సాధించి విజేతగా నిలిచింది. పోటీల అనంతరం సాయంత్రం కళాశాల ఆవరణలో లయన్స్ క్లబ్ సౌజన్యంతో ట్రోఫీలను ప్రదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా విద్యాధికారి శారద రన్నర్, విన్నర్ జట్లకు ట్రోఫీలను బహూకరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడల్లో ఓటమికి కృంగిపోవద్దని అది మరో గెలుపుకు నాంది అని విద్యార్థులకు సూచించారు. మళ్లీ క్రీడల్లో గెలుస్తామన్న స్ఫూర్తితో పోటీలలో పాల్గొని విజయ సాధన కొరకు శ్రమించాలని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా రన్నర్, విన్నర్ జట్లను ఆమె అభినందించారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికై అక్కడ రాణించి రాష్ట్ర ప్రఖ్యాతి నిలబెట్టాలని ఆమె సూచించారు.
ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అకాడమిక్ మానిటరింగ్ అధికారి పిఎం షేక్, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి సురేష్, ఎస్ ఎస్ జి ఎఫ్ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, ఎంఈఓ పోతు ప్రభాకర్, నంది మేడారం బాలుర గురుకుల కళాశాల ధర్మారం మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ విద్యాసాగర్, ఈర వేణి రాజకుమార్, జిల్లా పీఈటీల అసోసియేషన్ అధ్యక్షుడు వేల్పుల సురేందర్, లయన్స్ క్లబ్ జిల్లా పిఆర్ఓ తన్నీరు రాజేందర్ మండల క్లబ్ అధ్యక్షుడు ఇప్ప మల్లేశం, సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ తమ్మడవేణి రాజయ్య, పీఈటీలు టి సౌజన్య, బైకని కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.