కొత్తపల్లి, డిసెంబర్ 25 : కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో గురువారం రాత్రి 72వ రాష్ట్ర స్థాయి సీనియర్స్ మహిళలు, పురుషుల కబడ్డీ చాంపియన్‌షిప్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 28వ తేదీతో ముగియనున్నాయి. కరీంనగర్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలను రాష్ట్ర, జిల్లా కబడ్డీ సంఘం నాయకులతో కలిసి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రారంభించారు. క్రికెట్లో ఐపీఎల్‌తో క్రేజీ పెరిగిందని, ప్రో కబడ్డీతో కబడ్డీ సైతం క్రేజీ క్రీడగా మారిందన్నారు.
క్రీడాకారులు గెలుపేలక్ష్యంగా ఆత్మవిశ్వాసంతో బరిలో నిలువాలని సూచించారు. అనంతరం సీనియర్స్ పోటీల్లో భాగంగా పురుషుల విభాగంలో కరీంనగర్-ఖమ్మం జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో క్రీడాకారులను పరిచయం చేసుకొని ప్రారంభించారు. అనంతరం మహిళల పోటీలను ప్రారంభించారు. పోటీల సందర్భంగా పారమిత విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ క్రీడల్లో రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి కబడ్డీ జట్లు పోటీల్లో పాల్గొంటుండగా, మ్యాట్‌పై ఆరు కోర్ట్‌ల ద్వారా మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు.