SRSP Water | పెద్దపల్లి రూరల్, జనవరి 2 : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నేరుగా గుండారం రిజర్వాయర్ కు వెళ్లే డీ-83 ఎస్ఆర్ ఎస్పీ కాలువ శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నీటితో శుక్రవారం కొన్నిగంటలపాటు పరవళ్లు తొక్కింది. ఎస్ఆర్ఎస్పీ కాలువ పరిమితి 700 క్యూసెక్కులే అయినప్పటికీ పైన ఏం జరిగిందో ఏమోగాని డీ-83 కాలువలో నీటి ప్రవాహం భారీ స్థాయిలో పెరిగింది. దీంతో కొన్ని గంటలపాటు ప్రజలు, రైతులను భయబ్రాంతులకు గురిచేసింది. కాల్వ పరిమితి 700 క్యూసెక్కులే అయిన 850 క్యూసెక్కుల నీటి ప్రవాహం జరుగుతోంది.
అయితే ఆ నీటి ప్రవాహంతో పెద్దపల్లి మండలం సబ్బితం, రంగాపూర్ శివారులలో గల పంట పొలాలు, నారు మడులు కాల్వ నీటితో మునిగిపోయాయి. సబ్బితం, రంగాపూర్ గ్రామాల నుంచి రైతులు పంట చేలకు పొలాలకు వెళ్లాలంటే డీ-83 ఎస్ఆర్ఎస్పీ నీటి ఉధృతికి గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. ఈ విషయాన్ని స్థానిక రైతులు ప్రజల ద్వారా తెలుసుకున్న స్థానిక సర్పంచ్ నూనె సరోజన సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు సమాచారం అందించి రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
ఈ విషయమై సంబంధిత అధికారులను వివరణ కోరగా జగిత్యాల పరిధిలో కాలువ నీటిలో గల్లంతైన వ్యక్తి కోసం చేపడుతున్న గాలింపు చర్యల్లో భాగంగానే డీ-83కాలువకు నీటి ప్రవాహం పెరిగిందని, పైన తగ్గింపు చేశామని నీటి ప్రవాహం తగ్గిపొతాయని చెప్పారు. ఇదిలా ఉండగా సబ్బితం శివారులో గుండారం రిజర్వాయర్ కు వెళ్లే కాలువ చివరలోని ఒర్రెను కొందరు సమీప రైతులు దగ్గరకు రావడం వల్ల చెట్లతో నిండిన కారణంగా నీటి ప్రవాహం సరిగా జరుగడం లేదని ఈ మధ్య కాలంలో ఒర్రెను బాగు చేసేందుకు వెళ్తే సమీప రైతులు వద్దన్నారని అధికారులు పేర్కొంటున్నారు.