వేములవాడ టౌన్, ఏప్రిల్ 9;సీతారాముల కల్యాణానికి ఆలయాలు ముస్తాబయ్యాయి. వేములవాడ రాజన్న సన్నిధిలో జరిగే వేడుకకు క్షేత్రమంతా సకల వసతులతో సిద్ధమైంది. కరోనా ప్రభావంతో దాదాపు రెండేళ్ల తర్వాత నిర్వహిస్తున్న కల్యాణోత్సవానికి రాష్ట్ర నలుమూలల నుంచి దాదాపు రెండు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేయగా, ఆ మేరకు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. చలువ పందిళ్లు, మంచినీటి వసతి, మజ్జిగ పంపిణీ చేయబోతున్నది. అటు ఇల్లందకుంట రామాలయం సహా రాములోరి ఆలయాలూ ముస్తాబయ్యాయి. ఆయా దేవాలయాలకు మంత్రులు, ఎంపీలు సహా ఎమ్మెల్యేలు హాజరుకానుండగా, ఆయాచోట్ల ఏర్పాట్లు పూర్తయ్యాయి.
శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా శ్రీ సీతారాముల కల్యాణానికి రాజన్న ఆలయం ముస్తాబైంది. కరోనా కారణంగా రెండేళ్లుగా ఏకాంతంగా జరిగిన లగ్గాన్ని, ఈ ఏడాది భక్తుల సమక్షంలోనే అంగరంగ వైభవంగా జరుపబోతుండగా, యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అటు ఉమ్మడి జిల్లా ఆలయాలు సిద్ధమయ్యాయి.
రాజన్న సన్నిధిలో రాములోరి కల్యాణం
శ్రీరామనవమిని పురస్కరించుకుని వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారి సన్నిధిలో ఆదివారం సీతారాముల కల్యాణాన్ని ఆలయ అధికారులు, అర్చకులు అత్యంత కన్నుల పండువగా నిర్వహించనున్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీరాముడి కల్యాణానికి సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. శ్రీరామనవమి సందర్భంగా ఎములాడలో జరిగే సీతారాముల కల్యాణాన్ని భక్తులు ‘తలువాలు’గా పేర్కొంటారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. స్త్రీ, పురుషులు వధూ వరుల్లా పసుపు వస్త్రాలు ధరించి, తలపై జీలకర్ర, బెల్లం పెట్టుకొని, బాసింగం కట్టిన శూలాలను చేతబూని, ఆలయ అర్చకుల వేదమంత్రాలమధ్య భగవంతుడిని స్మరిస్తూ ఒకరిపై ఒకరు అక్షింతలు చల్లుకుంటారు. అటుపై రుద్రాక్షలను మెడలో వేసుకొని శివతత్వంతో మునిగిపోతుంటారు.
ముస్తాబైన గోదావరిఖనిలోని శ్రీ కోదండ రామాలయం
కోల్‌సిటీ, ఏప్రిల్ 9 సీతారాముల కల్యాణానికి గోదావరిఖని శ్రీ కోదండ రామాలయం ముస్తాబైంది. రామగుండం, ఎన్టీపీసీ, గోదావరిఖని, యైటింక్లయిన్ కాలనీ తదితర ప్రాంతాల నుంచి సుమారు 50వేల మందికిపైగా భక్తులు వచ్చే అవకాశం ఉండగా, ఈవో శంకరయ్య ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఉత్సవ మూర్తులకు పట్టు వస్ర్తాలు సమర్పించనున్నారు.
ఇల్లందకుంట రామాలయం రెడీ..
ఇల్లందకుంట, ఏప్రిల్ 9: అపరభద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం ముస్తాబైంది. ఈ మేరకు శనివారమే అర్చకులు శేషం రామాచార్యులు, వంశీధరాచార్యులు, సీతారామాచార్యులు, నవీన్‌శర్మ ఉత్సవమూర్తులను సుందరంగా అలకరించారు. కాగా, ధర్మపురి నృసింహుడి ఆలయం తరపున ఇల్లందకుంట రాములోరికి ధర్మపురి ఆలయ ఈఓ శ్రీనివాస్, ఆస్థాన పండితులు ముత్యాల శర్మ, రెనోవేషన్ కమిటీ సభ్యులు ఇందారపు రామన్న, పల్లెర్ల సురేందర్, వేముల నరేశ్, చుక్క రవి, సంగెం సురేశ్ కలిసి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్ర్తాలను ఆలయ ఈవో కందులు సుధాకర్‌కు అందజేశారు. కాగా, కల్యాణానికి మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జడ్పీ చైర్పర్సన్ కునుమల్ల విజయ, ఎంపీలు వొడితల లక్ష్మీకాంతారావు, జోగినిపల్లి సంతోశ్‌కుమార్, బండి సంజయ్‌కుమార్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థ్ధం ఉచితంగా ఆర్టీసీ బస్సలు నడుపుతున్నారని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కమాన్ వద్ద ముస్తాబైన రామేశ్వరాలయం
కమాన్‌చౌరస్తా, ఏప్రిల్ 9 : జిల్లా కేంద్రంలోని కమాన్ సమీపంలో రామేశ్వరాలయం, జిల్లా కేంద్రంలోని భగత్‌నగర్ ప్రసంన్నాంజనేయ స్వామి ఆలయం, కరీంనగర్ మండలం బొమ్మకల్‌లోని గోకుల్ నగర్‌లోని సీతారామాంజనేయ స్వామి ఆలయం, జూబ్లినగర్‌లో సీతారామ చంద్ర స్వామి ఆలయంలో సీతారాముల కల్యాణోత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, భగత్‌నగర్ ప్రసంన్నాంజనేయ స్వామి ఆలయంలో కల్యాణోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు పిలుపునిచ్చారు. శనివారం ఆలయంలో పూజలు చేశారు.
రెండు లక్షల మందికిపైనే వచ్చే అవకాశం..
రాజన్న సన్నిధిలో సీతారాముల కల్యాణానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నది. అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కల్యాణ వేదికను అందంగా అలంకరించారు. చాందినీ వస్ర్తాలు, కలకత్తా డెకోరేషన్తో ఆలయం శోభాయమానంగా కనిపిస్తున్నది. సుమారు రెండు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్న అధికారులు, ఎక్కడా ఇబ్బందులు కలుగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. భక్తులకు 4లక్షల మంచినీటి, 50వేల మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయనున్నారు. కల్యాణాన్ని తిలకించేందుకు ఆలయ ఆవరణలో 8 ఎల్ఈడీ టీవీలను ఏర్పాటు చేశారు.
50 తాత్కాలిక మరుగుదొడ్లు, ఐదు ఫ్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ట్రాలీలలను ఏర్పాటు చేసినట్లు ఈవో రమాదేవి వెల్లడించారు. పారిశుధ్యం లోపించకుండా 70 మంది శానిటేషన్ సిబ్బందిని నియమించారు. ఆలయ ఆవరణలో 3 ప్రాథమిక చికిత్సా కేంద్రాలు,స్పెషల్ రెస్క్యూటీం, 2 అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం 11:55 గంటల నుంచి మధ్యాహ్నం దాకా కల్యాణోత్సవాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించనున్నారు. కాగా, శివపార్వతులు శనివారం రాత్రివరకే వేములవాడకు చేరుకున్నారు. డీఎస్పీ చంద్రకాంత్ ఆధ్వర్యంలో నలుగురు సీఐలు, 15 మంది ఎస్ఐలు, దాదాపు 150 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తులో ఉంటారని పట్టణ సీఐ వెంకటేశ్ తెలిపారు.