కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మక్క రైతుల కష్టాలు కన్నీటి గాథలుగా మారుతున్నాయి. రోజుకో సమస్య చుట్టుముట్టడంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. అన్ని గండాలు దాటి బస్తాలను ట్రాక్టర్లలో లోడింగ్ చేసేందుకు సిద్ధమైన తరుణంలో ఓవర్‌ఫ్లో రూపంలో యార్డులోకి వరద పోటెత్తడంతో పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. తెల్లవారే సరికి బస్తాల అడుగు భాగంలో మొలకెత్తడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఈ కష్టం ఎవరికీ రావద్దంటూ కన్నీటి పర్యంతమవుతూ రోదిస్తున్నారు.
కరీంనగర్ ముకరంపుర, మే 30 : కరీంనగర్, కరీంనగర్ రూరల్, కొత్తపల్లితో పాటు సమీప మండలాల రైతులు పండించిన మక్కల కొనుగోళ్లకు జిల్లా కేంద్రంలోని మార్క్‌ఫెడ్‌లో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2400 చెల్లించడంతో భారీ స్థాయిలో మక్కలు మార్కెట్‌కు పోటెత్తాయి. సకాలంలో గన్నీ సంచులు అందుబాటులో లేకపోవడం, వెంట వెంటనే తూకం, లోడింగ్ జరగక నెల రోజులకు పైగా నిరీక్షించిన రైతులు ఆగ్రహించారు. అకాల వర్షాలతో మక్కలు తడవగా ఆరబెట్టడం, తిరిగి సంచుల్లో నింపే పనులు ఎండలో చేస్తూ రైతులు నరకం చూశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 25న పెద్ద ఎత్తున మక్క రైతులంతా ఆందోళన చేయడంతో తూకం, లోడింగ్‌లో వేగం పెంచారు. కానీ, ట్రాక్టర్లు, లారీలు అందుబాటులో లేక సుమారు 800కుపైగా బస్తాలు యార్డులోనే ఉన్నాయి. ఇదే ఇప్పుడు రైతుల పాలిట శాపంగా మారింది.
మార్కెట్ యార్డు వెనక ప్రాంతంలోని అంబేద్కర్‌నగర్‌లో నగర పాలక సంస్థకు చెందిన ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంది. దీని నుంచి వచ్చే ఓవర్‌ఫ్లో బయటకు వెళ్లేందుకు మార్కెట్ యార్డులోని మురుగు కాలువకు అనుసంధానం చేశారు. అయితే, ఈ కాలువ చెత్తాచెదారం, ముళ్లపొదలతో మూసుకుపోయి ఉంది. దీంతో ఓవర్‌ఫ్లో ప్రవాహం నేరుగా యార్డులోకి వెళ్లడంతో లోడింగ్‌కు సిద్ధంగా ఉన్న పలువురు రైతులకు చెందిన సుమారు 800 బస్తాలు తడిసి ముద్దయ్యాయి. ఇప్పటికే రెండు సార్లు అకాల వర్షాలకు మక్కలు తడవగా, రైతులు ఆరబోసి సంచుల్లో నింపారు. తీరా మరోసారి శుక్రవారం రాత్రి హఠాత్తుగా నీటి ప్రవాహం ముంచెత్తడంతో బస్తాల్లోని మక్కలు పూర్తిగా తడిసి పోయి మొలకెత్తాయి. ఉదయం మార్కెట్‌కు వచ్చిన రైతులు బస్తాల వద్ద నెలకొన్న పరిస్థితిని చూసి తల్లడిల్లి పోయారు. వెంటనే బస్తాలను ఆరబెట్టేందుకు శ్రమించారు. అయితే యార్డులోకి వచ్చే ఓవర్‌ఫ్లో ప్రవాహం సాఫీగా ముందుకు వెళ్లేలా చర్యలు తీసుకోవడంలో మున్సిపల్, మార్కెట్ కమిటీ పూర్తిగా విఫలమైందని రైతులు మండి పడ్డారు.మార్క్‌ఫెడ్ తరఫున కొనుగోళ్లు చేస్తున్నా డీసీఎంఎస్ అధికారులకు రైతులు పరిస్థితిని వివరించగా వారు పరిశీలించారు. తడిసిన బస్తాలు ఎండిన తర్వాత వెంటనే లోడింగ్ చేయించేందుకు హామీ ఇచ్చారు.
ప్రభుత్వం పంట మార్పిడి చేయాలని చెబితే మక్క సాగు చేసినం. ఒక్కో రైతుకు 40 క్వింటాళ్ల దాక దిగుబడి వస్తే 25 క్వింటాళ్లకు మించి కొనలేదు. మిగిలింది ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించి నష్టపోతున్నం. మార్కెట్ల మార్క్‌ఫెడ్‌కు అమ్ముకుంటే లాభపడుతామనే ఆశతోని వస్తే కష్టమే మిగిలింది. రెండెకరాల్లో మక్క సాగు చేసిన. ఈనెల 9న మార్కెట్‌కు 242 బస్తాల మక్కలు తెచ్చిన. సంచులు లెవ్వని చెబితే ఒక్కో సంచికి రూ.23 పెట్టి కొనుకున్నం. తీరా మక్కలు సంచులల్ల నింపిన తర్వాత వర్షం పడి తడిసినయి. సంచులు కింది మీద చేసి ఆరబెడితే కాంటా వేసిండ్రు. మూడు రోజుల కిందట మార్కెట్ కాంపౌండ్ అవతల ఉన్న ట్యాంక్ నిండి నీళ్లు ఓవర్‌ఫ్లో అయి మార్కెట్లకు వచ్చి బస్తాలు తడిస్తే ఆరబెట్టినం. శుక్రవారం ట్రాక్టర్లు లేక లోడింగ్ కాలే. బస్తాలు మార్కెట్ల ఉన్నయి. పొద్దుగాల వచ్చి చూస్తే రాత్రి పూట ట్యాంక్ నిండి రెండోసారి యార్డులకు నీళ్లు వచ్చినయని చెప్పిండ్రు. బస్తాలు తడిసి ముద్దయి మొలకలు వచ్చినయి. డీసీఎంఎస్ వాళ్లకు చెబితే వచ్చి చూసిండ్రు. ఆరబెడితే లోడింగ్ చేస్తామని చెప్పిండ్రు. ఈసారి మక్క చేను ఏస్తే ఇంత కష్టపడుడు అయితుంది. మూలిగే నక్క మీదనే తాటి పండు పడ్డట్టు ఉన్నది. అసలే నేను హార్ట్ పేషెంట్‌ను. మక్కలు అమ్ముకోవడానికి ఈ గోస పడుడు ఇన్నేండ్లళ్ల ఎప్పుడూ చూడలే.
– మేడిద రాజిరెడ్డి, గోపాల్పూర్