రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీస్ యంత్రాంగం వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తున్నది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ప్రత్యేక కార్యాచరణతో ముందుకుసాగుతున్నది. శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పటిష్టమైన చర్యలు తీసుకుంటూ ఎస్పీ అఖిల్ మహాజన్ తనదైన ముద్ర వేస్తున్నారు. ఇందులో భాగంగా పోలీసు శాఖ సామాన్యుల కోసం ‘ఠాణా దివస్’, దూర ప్రాంతవాసుల కోసం ‘మెస్సేజ్ యువర్ ఎస్పీ’, మహిళలు, బాలికల కోసం అభయ్, ఆపరేషన్ జ్వాల యాప్‌లతో పాటు షీటీమ్స్ ఏర్పాటు చేసింది. బస్సుల్లో ప్రయాణికుల భద్రతకు ‘బస్సులో భరోసా’ ప్రమాద బాధితుల కోసం ‘రోడ్ సేఫ్టీ కమిటీలు’ ఏర్పాటు చేసి వినూత్న విధానాలకు శ్రీకారం చుట్టింది. మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకుంటున్న వారి కోసం ఆపరేషన్ విముక్తి పేరిట డీ-అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేసింది.
– తెలంగాణ చౌక్, సెప్టెంబర్ 19
తెలంగాణ చౌక్, సెప్టెంబర్ 19 : రాజన్న సిరిసిల్ల జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా జిల్లా పోలీస్ శాఖ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నది. సాంకేతికతను వినియోగిస్తూ నేరాలకు అడ్డుకట్ట వేస్తున్నది. ప్రజా సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటున్నది. డయల్ 100, సైబర్ టోల్‌ఫ్రీ 1930 నంబర్లతో పాటు పలు యాప్‌లు అందుబాటులోకి తెచ్చింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు పటిష్ట చర్యలు తీసుకుంటున్నది.
దూరప్రాంతవాసులకు ‘మెసేజ్ యువర్ ఎస్పీ’
నేరుగా ఫిర్యాదు చేయలేని దూర ప్రాంతాల్లో ఉన్న వారు వాట్సప్ మెసేజ్ రూపంలో ఫిర్యాదు చేయడానికి ఎస్పీ అఖిల్ మహాజన్ స్వయంగా 63039-22572 వాట్సాప్ నంబర్‌ను అందుబాటులో ఉంచారు. అక్రమ రవాణా, రోడ్డు ప్రమాదాలు, ఈవ్ టీజింగ్, మహిళలపై వేధింపులు ఇలాంటివి ఏ సమస్యలున్నా నేరుగా జిల్లా ఎస్పీకి వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. ‘మెసేజ్ యువర్ ఎస్పీ’ అనే వేదిక ప్రతి రోజూ ఎస్పీ పర్యవేక్షణలో ఉంటున్న నేపథ్యంలో సంఘటనలు, సమస్యలను క్షణాల్లో ఆయన దృష్టికి వస్తాయి. జిల్లా నలుమూలల నుంచి సమస్యలపై ప్రతి రోజూ మెసేజ్‌ల రూపంలో పది ఫిర్యాదులు వస్తున్నాయని ఎస్పీ తెలిపారు. వాటిలో ప్రధాన సమస్యలను గుర్తించి సంబంధిత అధికారికి ఆదేశాలు జారీ చేసి పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. దీనిపై ప్రజల నుంఛి ఫీడ్‌బ్యాక్ కూడా తీసుకుంటున్నారు.
ప్రమాద బాధితులకు అండగా ‘రోడ్ సేఫ్టీ కమిటీ’
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి మొదటి గంట సమయాన్ని ‘గోల్డెన్ అవర్’ అంటారు. భారీ ప్రమాదాలు జరిగిన సమయంలో స్థానిక ప్రజలు తక్షణమే స్పందించి బాధితులకు అవసరమైన ప్రథమ చికిత్స, అంబులెన్స్‌కి, పోలీస్‌శాఖకు కాల్ చేయడం, గుండె పోటుకు గురైన వారిని సీఆర్పీ ద్వారా ప్రాణాలు రక్షించడం కోసం పోలీస్ శాఖ ప్రతి గ్రామంలో రోడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేసింది. జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామానికి ఆర్ఎంపీతో సహా 5 నుంచి 10 మందితో కమిటీని ఏర్పాటు చేశారు. వీరితోపాటు దాబాలు, పెట్రోల్‌బంకులు, హోటళ్లు, వివిధ వర్గాల ప్రజలతో కలిపి సుమారు 200 మందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. రోడ్ సేప్టీ విలేజ్ కమిటీలో స్వచ్ఛందంగా చేరి శిక్షణ తీసుకున్న వలంటీర్లలో ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి జనవరి 26, జూన్ 2, ఆగస్టు 15న ప్రత్యేక అవార్డులను కూడా అందజేయనున్నారు.
ఆరోగ్యంపై ప్రత్యేక చొరవ
అనునిత్యం డ్యూటీలో ఉండే పోలీస్ అధికారులు ఆరోగ్యంగా ఉంటేనే సమర్థవంతంగా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తారనే ప్రధాన ఉద్దేశంతో వారి కోసం జిల్లా ఎస్పీ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. జిల్లాలో పని చేస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బందికి హెల్త్ క్యాంపులు, దవాఖాన రాయితీ కార్డులు, సోర్ట్ మీట్, యోగా వంటి వినూత్న కార్యక్రమాలు చేపడుతూ నూతనొత్తేజం నింపుతున్నారు. ఇందులో భాగంగా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో 202 మంది హోంగార్డులు, వారి కుటుంబాలకు 43 దవాఖానల్లో పని చేసేలా ఫీజు రాయితీ హెల్త్‌కార్డులు రూపొందించి అందజేశారు. అలాగే, పోలీస్ అధికారులు, సిబ్బందికి కరీంనగర్ సన్‌సైన్, సిరిసిల్ల పట్టణంలోని తారకరామ దవాఖానల ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేసి ఉచితంగా బాడీస్కానింగ్, వివిధ టెస్టులు నిర్వహించి, ఉచితంగా మందులు అందజేశారు.
ఆమెకు అండగా ‘అభయ్ యాప్’
జిల్లా ప్రజలు, మహిళలకు భద్రతతో ప్రయాణాన్ని అందించడానికి జిల్లా పోలీస్ అధికారులు ‘అభయ్’ అనే ప్రత్యేక యాప్‌ను మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. కాగా, ప్రయాణికులకు భద్రతకోసం రూపొందించిన మొట్ట మొదటి యాప్‌ను రాష్ట్రంలో మొదటిసారిగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆవిష్కరించి అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రయాణికులు ఏదైన ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నప్పుడు ఎమర్జెన్సీ కాల్, మెసేజ్ రూపంలో జిల్లా పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ రూంకి ప్రయాణిస్తున్న వాహనం లైవ్ లొకేషన్ చేరే విధంగా ‘సేఫ్ ఆటో’ అనే యాప్ ద్వారా క్యూఆర్ కోడ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇందులో భాగంగా జిల్లాలోని సుమారు 3000లకు పైగా ఆటో రిక్షా, క్యాబ్ సర్వీస్ వాహన యజమానుల నుంచి అవసరమైన డాక్యుమెంట్లు, సమాచారం సేకరించి డిజిటలైజ్ చేసిన తరువాత క్రోడికరించిన సమాచారం మొత్తం క్యూఆర్ కోడ్ రూపంలో తీసుకువచ్చారు. ఇలాంటి వినూత్న యాప్‌లు అందుబాటులోకి రావడం ద్వారా ప్రయాణికుల పట్ల డ్రైవర్స్ అసభ్యంగా, అమర్యాదగా ప్రవర్తించినా, ర్యాష్ డ్రైవింగ్, మద్యం తాగి డ్రైవింగ్ చేసినా యాప్‌ను వినియోగించి పోలీస్‌లకు సమాచారం అందజేసి జరగబోయే నేరాలను కట్టడి చేయవచ్చును సేఫ్ ఆటో యాప్‌ను ప్రారంభించినప్పుటి నుంచి చాలా మంది సురక్షిత ప్రయాణాలు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
బాలికల రక్షణకు ‘ఆపరేషన్ జ్వాల’
జిల్లాలోని బాలికలు, మహిళల్లో ఆత్మైస్థెర్యాన్ని నింపేలా జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ‘ఆపరేషన్ జ్వాల’(సెల్ఫ్ డిఫెన్స్) అనే ప్రత్యేక కార్యక్రమం రూపొందించి అమలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 130 ప్రభుత్వ ఉన్నత పాఠశాల్లోని 8 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు ప్రతి పాఠశాలకు పది రోజుల చొప్పున నిష్ణాతులైన శిక్షకులతో సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తున్నారు. ఇప్పటి వరకు 32 పాఠశాలల్లో ‘ఆపరేషన్ జ్వాల’ ద్వారా ఎదుటి వారు దాడి చేసినప్పుడు ఎలా ఎదుర్కోవాలి అనే విషయంపై అవగహన, టెక్నిక్స్ నేర్పించారు. మరో 40 రోజుల్లో 100 శాతం పాఠశాలల్లో శిక్షణ పూర్తి చేయనున్నట్లు ఎస్పీ వెల్లడించారు.
సురక్షిత ప్రయాణానికి ‘బస్సులో భరోసా’
ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు, మహిళలు నిత్యం తమ అవసరాల కోసం రాత్రి, పగలు అనే తేడా లేకుండా బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో చైన్ స్నాచింగ్, మహిళలపై అఘాయిత్యాలు, వేధింపులు వంటివి జరుగుతున్న నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు పోలీస్‌శాఖ బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ‘బస్సులో భరోసా’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గత నెల 15న మంత్రి కేటీఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 105 బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మిగిలిన బస్సుల్లో వచ్చే పది రోజుల్లోపు ఏర్పాటు చేస్తామని ఎస్పీ వెల్లడించారు.
ఆకతాయిల అడ్డుకట్టకు ‘షీ టీమ్స్’
మహిళల రక్షణలో షీ టీమ్స్ కీలకపాత్ర వహిస్తున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పడిన తర్వాత 2016లో షీ టీమ్స్‌ను పోలీస్ యంత్రాంగం ఏర్పాటు చేసింది. ఒక ఎస్ఐ, ఐదుగురు సిబ్బందితో ఒక బృందం, ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్ 87126-56425ను అందుబాటులోకి తీసుకువచ్చింది. పోలీసులు ప్రతినిత్యం మహిళలు, విద్యార్థులు, ఉద్యోగినులకు భద్రతపై అవగాహన కల్పిస్తున్నారు. వేధింపులకు గురైన వారు ధైర్యంగా ఫిర్యాదు చేసేలా కౌన్సెలింగ్ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 120 ప్రత్యేక హాట్‌స్పాట్ ఏరియాలను గుర్తించి నిఘా ఏర్పాటు చేసి, ఆకతాయిలకు అడ్డుకట్ట వేసేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి, అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా సుమారు 300 కేసుల్లో కౌన్సెలింగ్ ఇచ్చి 36 కేసులు నమోదు చేశారు.
సామాన్యుల కోసం ‘ఠాణా దివస్’
జిల్లాలోని సామాన్య ప్రజలు జిల్లా ఉన్నత స్థాయి అధికారి వద్ద వచ్చి తమ సమస్యలను పారదర్శకంగా పరిష్కరించుకునేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ప్రతి నెలా మొదటి మంగళవారం జిల్లాలో ఎంపిక చేసిన పోలీస్‌స్టేషన్‌లో ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లా ఎస్పీ స్వయంగా అందుబాటులో ఉండి ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరిస్తారు. తమ పరిధిలో లేని సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారమయ్యే వరకు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలతో మమేకమై ఖచ్చితమైన భరోసా కల్పిస్తున్నారు. మొదటగా ఈ ఏడాది ఏప్రిల్ నెలలో వేములవాడ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కార్యక్రమాన్ని ప్రారంభించగా, జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 5 స్టేషన్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో 350 ఫిర్యాదులు వచ్చాయి. అందులో 52 ఎఫ్ఐఆర్ కేసులు నమోదు కాగా, 40 కేసులను ఇతర శాఖలకు బదిలీ చేశారు.
‘ఆపరేషన్ విముక్తి’, డీ-అడిక్షన్తో మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం
విద్యార్థులు, యువకులు తెలిసీ తెలియక మత్తు పదార్థాలు, డ్రగ్స్‌కు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యలో ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేక చొరవ తీసుకుని ‘ఆపరేషన్ విముక్తి’ పేరుతో జిల్లా కేంద్రంలోని వెంకంపేటలోని బస్తీ దవాఖానలో డీ-అడిక్షన్ సెంటర్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. దీనిని త్వరలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యసనాల నుంచి యువత, విద్యార్థులను దూరం చేసి సన్మార్గంలో నడిపించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ సెంటర్లో ప్రతి రోజూ సాయంత్రం రెండు గంటలపాటు సైకాలజిస్ట్, సైకియాట్రిస్టులతో కౌన్సెలింగ్ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మత్తు పదార్థాలకు బానిసలైన వారు త్వరగా కోలుకునేలా అవసరమైన మెడిసిన్ ఉచితంగా అందజేయనున్నట్లు ఎస్పీ తెలిపారు. ఇక్కడి కౌన్సెలింగ్‌లో పాల్గొన్నా మార్పులేని వారిని హైదరాబాద్‌లోని దవాఖానకు తరలించి, పూర్తిగా కోలుకునే వరకు అవసరమైన వసతి సౌకర్యాలు, దవాఖాన ఖర్చులు వెచ్చించేలా మొత్తం జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
శాంతి భద్రతల పరిరక్షణకు ‘కమాండ్ కంట్రోల్ సెంటర్’
అత్యాధునిక సాంకేతికతో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 2800కు పైగా సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కాగా, ఇటీవల జిల్లాలోని ప్రధాన రహదారుల వెంట సింగరేణి యాజమాన్యం సహకారంతో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 88 ఆటోమేటిక్ సీసీ కెమెరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఏ మూలన ఏ చిన్న సంఘటన జరిగినా సీసీ కెమెరాల ద్వారా కనిపెట్టే సామర్థ్యం ఏర్పడింది.