మంథని/మంథని రూరల్, సెప్టెంబర్ 25: ‘నేను పేదింటి బీసీ బిడ్డను. సీఎం కేసీఆర్ దీవెనలతో నిరంతరం ప్రజాసేవే ధ్యేయంగా నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా మీ అన్నగా, తమ్ముడిగా, మీ బిడ్డగా.. మీ ఆశీర్వాదం కోసం వస్తున్నా. సంపుకుంటరో.. సాదుకుంటరో మీ చేతుల్లోనే ఉంది’ అంటూ పెద్దపల్లి జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ పేర్కొన్నారు. 311కిలో మీటర్ల ప్రజా చైతన్య ఆశీర్వాద యాత్రను సోమవారం ముత్తారం మండల కేంద్రంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే చందర్, జయశంకర్ భూపాలపల్లి జడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణి, మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముత్తారంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఎలాంటి వారసత్వ రాజకీయాలు లేకుండా ఈ ప్రాంతానికి చెందిన నిరుపేద బిడ్డనైన తాను రాజకీయంగా ఎదిగితే కొందరు ఓర్వలేకపోతున్నారని, అనుక్షణం అవమానాలు, అవహేళనలు, మానసిక దాడులు నిరంతరం జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నా స్థానంలో వేరే ఎవరున్నా భార్యా పిల్లలతో కలిసి ఎన్ని సార్లు ఆత్మహత్య చేసుకునేవారో? అలాంటి పరిస్థితులు తెచ్చారు’ అని భావోద్వేగానికి లోనయ్యారు.
15 ఏండ్లుగా మంథని నియోజకవర్గంలోని పేద ప్రజలకు అండగా నిలిచి ఆదుకుంటుంటే పిరికెడు అన్నం పెట్టనోళ్లు, రూపాయి బిల్ల కూడా సాయం చేయనోళ్లు, నాపై నిందారోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం తప్పు చేశానని కుల సంఘాలు, మీడియా సంస్థలు తనపై దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. ఒక్క ఆరోపణనైనా నిరూపించారా..? నిరుపిస్తారా..! అని ప్రశ్నించారు. తన తప్పులేమైనా ఉంటే ముత్తారంలోనే ఉరేసుకుంటానని సవాల్ విసిరారు. మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు స్వయంగా కిషన్‌రెడ్డి ఇంట్లో గంజాయి పెట్టాలని అడ్డంగా దొరికి పోయి కూడా దర్జాగా దొరబాబులాగా చలామణి అవుతున్నాడని, ఎలాంటి తప్పు చేయని తనపై కొందరికీ డబ్బులు ఇచ్చి ఆరోపణలు చేయిస్తున్నారన్నారని ఆరోపించారు. ముత్తారం మండలానికి చెందిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో తనను దూషిస్తుంటే స్వయంగా వెళ్లి తానే మాట్లాడానన్నారు. ఇదేంటని అడిగితే మంథని ఎమ్మెల్యే రూ.50లక్షలు ఇస్తానని చెప్పారని, తాను రూ.25లక్షలు ఇస్తే తనవైపు వస్తానని చెప్పాడన్నారు. తన వద్ద రూపాయి కూడా లేదని, ప్రజల ఆశీర్వాదం, బలం మాత్రమే ఉన్నాయన్నారు. 2014లో బీసీ బిడ్డగా ఎమ్మెల్యేగా ఎన్నికైనా నేను ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానన్నారు. మంథని నియోజకవర్గంలోని గొల్లపల్లి నుంచి తుపాకుల గూడెం వరకు తాను, బీఆర్ఎస్ సర్కారు సాయం చేయని ఇల్లు లేదన్నారు. నియోజకవర్గంలోని వ్యవసాయ ఆధారిత కులాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు.
రెడ్డి సామాజిక వర్గం సైతం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన గుణ పాఠం చెప్పాలన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాలను చూసి తెలంగాణలో అధికారంలోకి వచ్చే ఆశలు లేవని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధే స్వయంగా ప్రకటన చేసిన విషయాన్ని గుర్తుచేశారు. రాబోయే ఎన్నికల్లో మంథని నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండి బీఆర్ఎస్కే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే నియోజకవర్గంలోని పేదింటి బిడ్డల ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌లో రెండు వసతి గృహాలను ఏర్పాటు చేయడంతో పాటు ఉన్నత చదువులకు సహకారం అందిస్తానన్నారు. నియోజకవర్గంలోని ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ గృహలక్ష్మి పథకం ద్వారా ఇల్లు కట్టించి ఇస్తానన్నారు. అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లో ఓడెడ్ బ్రిడ్జిని పూర్తి చేయించడంతో పాటు ఇసుక క్వారీల ద్వారా ధ్వంసమైన రహదారులను మరమ్మతు చేయిస్తానన్నారు. తనది నియోజకవర్గ ప్రజలతో ఓటు సంబంధం కాదని, పేగు సంబంధం అనే విషయాన్ని గుర్తించి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓటుతో ఆశీర్వదించాలన్నాలని కోరారు.