ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశం లోకాయుక్తకు చేరింది. రాష్ట్ర విద్యాశాఖ ఇచ్చిన నిబంధనలను తుంగలోతొక్కి.. సర్దుబాటు చేశారంటూ ఓ స్కూల్ అసిస్టెంట్ లోకాయుక్తను ఆశ్రయించడం చర్చనీయాంశమైంది. ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న లోకాయుక్త, ఈనెల 10న ఉదయం పదిన్నర గంటలకు హాజరు కావాలని ఆదేశించడంతో విద్యాశాఖలో టెన్షన్ నెలకొంది.
ఇదే బాటలో మరికొంత మంది ఉపాధ్యాయులు సైతం హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తున్నది. సర్దుబాటు అక్రమాలు కేవలం కరీంనగర్ జిల్లాకే కాకుండా.. ఉమ్మడి జిల్లాలోనూ అనేకం జరిగినట్టు తెలిసింది. గతంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగు చూడగా, పెద్దపల్లి, జగిత్యాలలోనూ నిబంధనలకు విరుద్ధంగా సర్దుబాటు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కరీంనగర్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేసేందుకు రాష్ట్ర విద్యాశాఖ వీలు కల్పించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే జూలైలో ఈ ప్రక్రియ జరిగింది. అయితే ఈ నెల మొదటి వారంలోనూ కొన్ని జిల్లాల్లోని పాఠశాలలకు సర్దుబాటు కింద టీచర్లను బదిలీ చేశారు. సర్దుబాటుకు సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీచేసినా.. వాటిని తుంగలో తొక్కి, రాజకీయ నాయకులు చెప్పిన వారికి పెద్దపీట వేశారన్న విమర్శలు గతంలోనే వ్యక్తమయ్యాయి.
కొంతమంది పైరవీకారులను లేదా డిపార్టుమెంట్లో సిబ్బందిని పట్టుకొని, ఆమ్యామ్యాలు ముట్టజెప్పిన వారిని సర్దుబాటు చేయడమే కాకుండా మంచి పాఠశాలల్లో అవకాశం కల్పించారని పలు ఉపాధ్యాయ సంఘాలు కూడా విమర్శలు చేశాయి. ఒకటి రెండు చోట్ల కాదు, ఉమ్మడి జిల్లాలోని చాలా చోట్ల ఈ తతంగం నడిచింది. అయితే ఇన్నాళ్లూ లోలోపల మసలుతున్న ఈ అంశం, తాజాగా లోకాయుక్తకు చేరింది. వివరాల్లోకి వెళ్తే.. జూలైలో జరిగిన ఉపాధ్యాయుల సర్దుబాటులో కరీంనగర్ జిల్లాకేంద్రంలోని ధన్గర్‌వాడీ ప్రభుత్వ పాఠశాలలో హిందీ స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎండీ జావీద్ హుస్సేన్‌ను జిల్లాకేంద్రంలోని మరో ప్రభుత్వ పాఠశాలకు బదిలీ చేశారు.
తన సర్దుబాటు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని, పునఃపరిశీలించి తనకు న్యాయం చేయాలని కోరుతూ జావీద్ ముందుగా విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లారు. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు స్పందించలేదు. కనీసం దరఖాస్తు చూసి సమాధానం చెప్పలేదు. దీంతో సదరు టీచర్ జూలై 22న లోకాయుక్తను ఆశ్రయించారు. ప్రధానంగా జూనియర్ ఉపాధ్యాయుడిని అదే పాఠశాలలో ఉంచి, సీనియర్‌ను అయినా తనను సర్దుబాటు కింద బదిలీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ జారీ చేసిన (ప్రొసీడింగ్ నంబర్ 1267/ఎస్‌ఇఆర్-111-1/2024) నిబంధనలను పక్కన పెట్టి, సొంత రూల్స్ ఏర్పాటు చేసుకొని తనను బదిలీ చేశారని చెప్పారు. పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన నిబంధనల ప్రకారం..
విద్యార్థుల సంఖ్యను పరిగణలోకి తీసుకోకుండా తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని, ఈ విషయంలో విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని కోరాడు. దీనిపై తాజాగా లోకాయుక్త స్పందించింది. ఇదిలా ఉంటే సర్దుబాటు కింద పంపిన పాఠశాలకు ఉద్యోగోన్నతిపై మరో ఉపాధ్యాయుడు రావడంతో తిరిగి జావీద్ ధన్గర్‌వాడీ పాఠశాలకు వచ్చారు. తాజాగా జరిగిన సర్దుబాటులో జావీద్‌ను చింతకుంట పాఠశాలకు బదిలీ చేశారు. ఓవైపు తనకు జరిగిన అన్యాయంపై పోరాటం చేస్తున్న విషయం తెలిసి కూడా అధికారులు కక్ష కట్టారని, నిబంధనలకు విరుద్ధంగా రెండుసార్లు బదిలీ చేసి మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి తనకు జూలైలో జరిగిన అన్యాయంపైనే లోకాయుక్తను ఆశ్రయించానని, ప్రస్తుతం అంటే రెండోసారి కూడా జరిగిన అన్యాయంపై లోకాయుక్తకు వివరిస్తానని ఆయన ‘నమస్తే తెలంగాణ’తో చెప్పారు. జావీద్ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న లోకాయుక్త, ఈనెల 10న ఉదయం పదిన్నర గంటలకు జిల్లా విద్యాశాఖాధికారితోపాటు ఎండీ జావీద్ హుస్సేన్ సైతం హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.
పైరవీలకు పెద్దపీట!
జూలైలో జరిగిన సర్దుబాటు విషయంలో రాజన్న సిరిసిల్లతోపాటు కరీంనగర్ జిల్లాలో అనేక విమర్శలువచ్చాయి. తాజాగా కరీంనగర్లో జరిగిన సర్దుబాటుపైనా ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా పైరవీలకు పెద్దపీట వేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. సర్దుబాటు పేరిట అవసరం లేనిచోటకు బదిలీలు చేయడం దీనికి నిదర్శనమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల ప్రకారం.. నిబంధనలు, సీనియారిటీని పరిగణలోకి తీసుకోకుండా, ఈ ప్రక్రియ జరిగిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కరీంనగర్ జిల్లాలో చూస్తే 110 మంది వరకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. జమ్మికుంట మండలం వావిలాల జడ్పీ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న ఓ స్కూల్ అసిస్టెంట్‌ను ఒకే సారి రెండు పాఠశాలలకు సర్దుబాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తీరు అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఉపాధ్యాయులు చెబుతున్నారు. సదరు ఉపాధ్యాయుడిని వీణవంక మండలం మామిడాలపల్లిలోని జడ్పీ ఉన్నత పాఠశాలతోపాటు జమ్మికుంట మండలం విలాసాగర్‌లోని ప్రాథమికోన్నత పాఠశాలకు సర్దుబాటు చేయడం వివాదాస్పదం అయింది.
అలాగే వీణవంక మండలం కనపర్తి ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు అదనంగా లేకపోయినా.. అందులో నుంచి ఒకరిని కరీంనగర్ సమీపంలోని తీగలగుట్టపల్లిలోని పాఠశాలకు సర్దుబాటు చేయడం విమర్శలకు తావిస్తున్నది. ఇవి మచ్చుకు మాత్రమే! ఇదే తరహాలో చాలా జరిగాయి. మొత్తంగా చూస్తే రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలకు భిన్నంగా మెజార్టీ చోట్ల సర్దుబాటు జరిగినట్టు ఉపాధ్యాయవర్గాల్లో జోరుగా చర్చ నడుస్తున్నది. రాజకీయ నాయకులు కొన్ని పేపర్లను సిఫారసు చేస్తే.. వాటిని అవకాశంగా చేసుకొని, జిల్లా విద్యాశాఖలో పనిచేసే కొంతమంది అధికారులు డబ్బులు తీసుకొని సర్దుబాటు కింద ఉత్తర్వులు ఇచ్చినట్టు తెలుస్తున్నది.
అయితే అన్యాయం జరిగిందని తెలిసినా.. కొంతమంది ఉపాధ్యాయులు అధికారులతో గొడవెందుకులే అనుకొని సర్దుకొని పోతున్నారు. తాజాగా ఓ స్కూల్ అసిస్టెంట్ లోకాయుక్తను ఆశ్రయించగా.. ఇదే బాటలో మరికొంత మంది వెళ్లడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. అంతేకాదు, ఇంకా కొంతమంది అధికారులతో సహా హైకోర్టుకు సమర్పించడానికి ఒకచోట సమావేశమైనట్టు సమాచారం. దీంతో జిల్లా విద్యాశాఖలో ఆందోళన నెలకొన్నది. లోకాయుక్త విచారణ తదుపరి ఇచ్చే ఆదేశాల ప్రకారం.. మొత్తం జాబితాను బహిర్గతం చేస్తే అనేక అవకతవకలు వెలుగులోకి వస్తాయన్న చర్చ నడుస్తున్నది. తద్వారా అక్రమాలకు పాల్పడిన అధికారుల భాగోతం బయటపడుతుందనే అభిప్రాయం కూడా ఉపాధ్యాయవర్గాల్లో వ్యక్తమవుతున్నది.