Smart ration cards | ఓదెల, ఆగస్టు 21 : తెలంగాణ ప్రభుత్వం కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులను ముద్రించి పంపిణీకి సిద్ధం చేశారు. కాగా స్మార్ట్ రేషన్ కార్డులు తప్పుల తడకగా ఉన్నట్లు ప్రజలు తెలుపుతున్నారు. ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో శనివారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ప్రారంభం చేయగా తప్పులను గుర్తించారు. ఇందుకు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం హరిపురం గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డులు తప్పులతడకగా ఉన్నట్లు గుర్తించి సర్పంచ్ గారవేణి విజయ-నాగరాజ్ యాదవ్ పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేశారు.
ఈ విషయాన్ని తహసీల్దార్ వనజ నాయక్ దృష్టికి తీసుకువెళ్లారు. హరిపురం గ్రామంలో పంపిణీకి పంపిన స్మార్ట్ కార్డులలో హరిపురం గ్రామానికి బదులు ఓదెల గ్రామం, మండలంగా ముద్రణ చేశారు. అలాగే పిన్ కోడ్ కూడా తప్పుగా ముద్రణ చేశారు. ఈ తప్పులతడకగా ఉన్న రేషన్ కార్డుల వలన భవిష్యత్లో ప్రజలకు అనేక ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో సర్పంచ్ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీని పూర్తిగా నిలిపివేశారు. జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తప్పులు లేకుండా స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయాలని కోరారు.