బీజేపీ గూండాగిరిపై బీఆర్ఎస్ భగ్గుమన్నది. కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల క్యాంప్ ఆఫీస్ ధ్వంసంతోపాటు ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై దాడికి యత్నించడంపై ఆగ్రహించింది. శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిరసనలు తెలిపింది. ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తించింది. బండి సంజయ్ దిష్టిబొమ్మలను దహనం చేసింది. ‘బండి.. నీ గూండాయిజం చెల్లదు’ ‘బీజేపీ గూండాల్లారా.. ఖబడ్దార్’ అంటూ హెచ్చరించింది. ఆయన కేంద్రమంత్రా..? లేక రౌడీలకు నాయకుడా..? అంటూ మండిపడింది. బీజేపీ దాడి అనైతిక చర్యగా తెలంగాణ సమాజం అసహ్యించుకుంటుందని స్పష్టం చేసింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో ఇలాంటి అరాచకాలు జరగడం అత్యంత దురదృష్టకరమని ధ్వజమెత్తింది.
కరీంనగర్, మే 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరీంనగరంలో బీజేపీ గూండాగిరిపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భగ్గుమన్నారు. శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిరసనలు తెలిపారు. బండి సంజయ్‌కి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. వేములవాడ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు ఆదేశాల మేరకు వేములవాడలో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. తెలంగాణచౌక్‌లో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అలాగే చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట, మేడిపల్లి మండల కేంద్రాల్లో ధర్నా చేశారు.
కథలాపూర్‌లో ధర్నా చేయడంతోపాటు దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అలాగే కరీంనగర్ జిల్లా రామడుగులో బస్టాప్ వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేశారు. గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో కరీంనగర్- జగిత్యాల జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల ‘బీజేపీ గూండాల్లారా.. కబడ్దార్’ అంటూ బీఆర్ఎస్ నాయకులు నినదించారు.

రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులను లక్ష్యంగా చేస్కొని బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన కొంత మంది గూండాలు దాడులకు తెగబడుతున్నారంటూ ఆగ్రహించారు. కరీంనగర్ నడిబొడ్డున తుపాకులతో దోపిడీలు జరుగుతున్నా కేంద్ర మంత్రి బండి సంజయ్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆయన రౌడీ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని, ఎమ్మెల్యే స్థాయి నేతలకు కూడా రక్షణ లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధిపై రాజకీయ చర్చలు జరగాలి కానీ, ఇలా భౌతిక దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి చేటు అని హెచ్చరించారు. ప్రశాంతంగా ఉన్న కరీంనగర్‌ను గూండాగిరీకి కేంద్రంగా మార్చాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
బీజేపీ దాడికి నిరసనగా శనివారం నగర బంద్‌కు బీఆర్ఎస్ పిలుపు నిచ్చింది. నేటి బంద్‌కు నగర ప్రజలందరూ సహకరించాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కోరారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కరీంనగర్ చరిత్రలో మొదటిసారి తన క్యాంపు కార్యాలయంపై దాడి చేసి విష సంస్కృతిని తెచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులను, ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని, దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. శనివారం నగరబంద్కు అన్ని వర్గాల ప్రజలతోపాటు వ్యాపార వాణిజ్య సంస్థలు శాంతియుతంగా మద్దతు ఇవ్వాలని కోరారు. బీఆర్ఎస్ శ్రేణులందరూ శాంతియుతంగా పాల్గొని సహకరించాలన్నారు.

ధర్మారం, మే 8 : రాజకీయాల్లో రెచ్చగొట్టేలా మాట్లాడడం కేంద్ర మంత్రి బండి సంజయ్ నైజమని బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. ధర్మారంలో శుక్రవారం పర్యటించిన ఆయన, మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్‌పై బీజేపీ నాయకుల దాడిని తీవ్రంగా ఖండించారు. దీనిని పాశవిక, ఆటవిక చర్యగా అభివర్ణించారు. తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై పనికి రాని విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కొందరు బీజేపీ గూండాలు దాడి చేసి హత్యాయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇకనైనా బండి దౌర్జన్యపూరిత వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్, బీజేపీ దేశస్థాయిలో విబేధాలు ఉన్నట్లు నటిస్తున్నాయని, రాష్ట్రంలో మాత్రం ఒక్కటేనని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం వడ్లు, మక్క లు కొనుగోలు చేయకపోయినా బండి సంజయ్ మాట్లాడక పోవడం దేనికి నిదర్శమని ప్రశ్నించారు. ఆయన వెంట ప్యాక్స్ చైర్మన్ ము త్యాల బలరాంరెడ్డి, పార్టీ తాజా మాజీ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్, మాజీ కోప్షన్ సభ్యుడు ఎండడి రఫీ పాల్గొన్నారు.