పెద్దపల్లి, మార్చి 16(నమస్తే తెలంగాణ): గోదావరి తల్లి కన్నీటి గోసను వివరిస్తూ, కాళేశ్వరం ప్రాజెక్టు విశిష్టత, కాంగ్రెస్ సరారు నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ సోమవారం మహాపాదయాత్ర ప్రారంభం కానున్నది. ఈ నెల 22 వరకు జరిగే ఈ యాత్ర ఉద్యమాల పురిటి గడ్డ గోదావరిఖని నుంచి ఎర్రవెల్లి వరకు 180 కిలో మీటర్ల పాటు కొనసాగనున్నది. ఈ మేరకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, కో ఆర్డినేటర్ బొడ్డు రవీందర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాగా, పాదయాత్ర సందర్భంగా గోదావరి తీర ప్రజల గోస, అన్నదాతల కష్టాలు, కన్నీళ్లను వివరించుకుంటూ ముందుకు సాగనున్నది.
గోదావరిఖని గోదావరి తీరంలో కొలువైన మహాశివుడికి సోమవారం ఉదయం 8 గంటలకు ప్రత్యేక పూజలు చేసి, సమీపంలోనే కొలువైన సమ్మక్క-సారలమ్మ గద్దెలకు ప్రత్యేక మొక్కులు చెల్లించుకొని పాదయాత్రను ప్రారంభించనున్నారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా హాజరు కానుండగా, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల మాజీ ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, నడిపెల్లి మురళీధర్‌రావు, పుట్ట మధూకర్, దాసరి మనోహర్‌రెడ్డి పాల్గొననున్నారు. మొదట గోదావరిఖనిలోని జీఎం కాలనీ వద్ద గల తెలంగాణ తల్లి విగ్రహం, ఖని చౌరస్తాలోని అమరవీరుల స్మారక స్తూపం, రాజేశ్ థియేటర్ వద్దగల జ్యోతిరావు పూలే, మున్సిపల్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహాలకు పూల మాలలు వేస్తారు. మధ్యాహ్నం పాలకుర్తి మండలం బసంత్‌నగర్‌లో భోజనం పూర్తి చేసుకొని పెద్దపల్లి శివారులోని బంధంపల్లి స్వరూప గార్డెన్‌కు చేరుకుంటారు.
రాత్రి అక్కడ బస చేసి, రెండో రోజైన మంగళవారం ఉదయం 6 గంటలకు మళ్లీ యాత్ర ప్రారంభమై, పెద్దపల్లి మీదుగా సుల్తానాబాద్‌కు బయలు దేరుతారు. అక్కడి నుంచి కరీంనగర్‌కు చేరుకుంటారు. మూడో రోజు బుధవారం ఉదయం 6 గంటలకు బయలుదేరి అల్గునూర్ మీదుగా బెజ్జంకి ఎక్స్‌రోడ్‌కు చేరుకుంటారు. నాలుగో రోజు గురువారం ఉదయం 6 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం వరకు ఇబ్రహీంనగర్‌కు చేరుకుంటారు. సిద్దిపేట రెడ్డి సంక్షేమ సంఘం భవనంలో రాత్రి బస చేస్తారు. ఐదో రోజు శుక్రవారం ఉదయం 6 గంటలకు మళ్లీ యాత్ర ప్రారంభమై మధ్యాహ్నం కొమురవెల్లి-1 హోటల్‌కు చేరుకుంటారు. రాత్రి వరకు ప్రజ్ఞాపూర్‌కు చేరుకుంటారు. ఆరో రోజు శనివారం ఉదయం 5 గంటలకు ప్రారంభమై మధ్యలో భోజనం చేసి ఎర్రవెల్లి వరకు వెళ్తారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి కాంగ్రెస్ పార్టీ కుట్రలు, కన్నీటి బాధలు, రైతన్నల కన్నీటి గాధలను వివరించనున్నారు.