వేములవాడ/ ఇల్లందకుంట, ఏప్రిల్ 6 : అభిజిత్ లగ్న సుముహూర్తాన.. వేదమంత్రాల సాక్షిగా.. అశేష భక్తజనం సమక్షాన.. ఆదివారం శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగవైభవంగా జరిగింది. శ్రీరామనవమిని పురస్కరించుకొని రాములోరి వివాహ వేడుక ఊరూరా కనులపండువగా సాగింది.
వేములవాడ రాజన్న క్షేత్రం, అపరభద్రాద్రి ఇల్లందకుంట రామాలయం, ధర్మపురి నృసింహస్వామి, కొండగట్టు అంజన్న సన్నిధి, గోదావరిఖని కోదండ రాముడి ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోగా, వేములవాడలో ‘తలువాలు’ కార్యక్రమం శివధారణుల్లో తన్మయత్వం నింపింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జరిగిన వేడుకలకు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఇతర అధికారులు హాజరై పట్టు వస్ర్తాలు సమర్పించారు.