చిగురుమామిడి, ఏప్రిల్ 15 : రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా కరీనంగన్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలోని డార్విన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ‘అరైవ్.. అలైవ్’ అవగాహన కార్యక్రమాన్ని ఎస్ఐ పృధ్విధర్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులకు నిర్వహించారు. పాదచారులు రోడ్డుపై సురక్షితంగా నడిచే పద్ధతులు, వాహనదారులు హెల్మెట్ ధరించడం పై అవగాహన, సీటు బెల్ట్ వాడకం, ద్విచక్ర వాహనంపై ముగ్గురు ప్రయాణించడం సురక్షితం కాదని వివరించారు.
మైనర్ విద్యార్థులు డ్రైవింగ్ చేయవద్దని, ఒకవేళ వాహనం నడిపినట్లయితే తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామన్నారు. వాహనదారులు మద్యం సేవించి నడపడం, అలాగే డ్రైవింగ్ వేగంగా నడపడంతో జరిగే అనర్థాలను విద్యార్థులకు వివరించారు. అనంతరం ఇటీవల నవోదయ ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన మార్క శివేంద్రని ఎస్సై శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ అవగాహన కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ కే. సమ్మిరెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.