Peddapally | పెద్దపల్లి కమాన్, జులై 3 : కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న అవినీతి, అక్రమాలను ఎండగడుతున్నందుకే బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులను అరెస్ట్ చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గ నాయకురాలు దాసరి ఉష ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అరెస్ట్ కు నిరసనగా శుక్రవారం జిల్లా కేంద్రంలో బస్టాండ్ వద్ద రాజీవ్ రహదారిపై బీఆర్ఎస్ నాయకులతో కలిసి దాసరి ఉష ధర్నా చేపట్టారు.
రోడ్డుపై బైటాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దాసరి ఉష మాట్లాడారు. గురుకులాల్లో సరుకుల టెండర్ల ను మన రాష్ట్రానికి చెందిన వారికి కాకుండా గుజరాత్ రాష్టానికి చెందిన బడా కాంట్రాక్టర్ల కు ఇచ్చి రూ.వేల కోట్ల కుంభకోణానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు బట్టబయలు చేస్తున్నందుకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు భద్రత తొలగించిందని విమర్శించారు.
అలాగే ఆయన సతీమణీ లక్ష్మిభాయిని మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ నుంచి అప్రాదానమైన హౌజింగ్ సోసైటీ ఫెడరేషన్ కు బదిలీ చేయడం రాజకీయ కుట్రలో భాగమేనని ఆరోపించారు. అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నం చేయగా, పోలీసులు అడ్డుకున్నారు. దాసరి ఉషతో పాటు పలువురు నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.