నాటి రాయబారుల సందేశాలను మరిపిస్తూ.. పావురాల వేగాన్ని మించుతూ.. ఉత్తరాలను మోసే ఊసులను క్షణంలోనే ఎదుటి వారికి చేరవేస్తున్నదీ పొట్టి సందేశం! సెల్లుగూటిలో నిక్షిప్తం చేసిన మన భావాలను, అభిప్రాయాలను సెకను కాలంలో పంచుతున్నదీ ఎస్ఎంఎస్! ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంతో దీనిని పంపించడం చాలా ఈజీ అయిపోయింది. లక్షకుపైగా మందికి ఒకేసారి సందేశాన్ని పంపించే అవకాశం ఉన్నది.
కరీంనగర్, జనవరి 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): షార్ట్ మెసేజ్ సర్వీస్ (ఎస్ఎంఎస్) 1985లో అందుబాటులోకి వచ్చింది. జర్మనీలోని ఓస్లోలో 1985లో జరిగిన గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్ (జీఎస్ఎం) సమావేశంలో జర్మనీ-ఫ్రాన్స్ సహకారంలో ఈ సేవలను ప్రారంభించారు. మొదటిసారిగా రిక్కూ పెహ్కానెన్ అనే ఇంజినీరింగ్ విద్యార్థి తన జీఎస్ఎం ఫోన్ నుంచి ‘మెర్రీ క్మిస్మస్’ అనే ఓ సందేశాన్ని పంపారు.
అప్పుడు 160 అక్షరాలతో ఆరంభమైన ఎస్ఎంఎస్ నేడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూనే ఉన్నది. మాటలను పొదుపు చేసిన ఎస్ఎంఎస్ మార్కెట్లో మాత్రం తిరుగులేని ఆధిపత్యాన్ని సాధిస్తున్నది. 2006లో దీని మార్కెట్ విలువ 21 బిలియన్ డాలర్లు ఉండగా, 2023 నాటికి 77.29 బిలియన్ డాలర్లకు చేరింది. 2033 నాటికి 129.54 బిలియన్ డాలర్లను అధిగమిస్తుందని అంచనా.
షార్ట్ మెస్సేజ్ సర్వీస్.. దీనినే ముద్దుగా ఎస్ఎంఎస్ అంటాం. ఇది పుట్టి 38 ఏండ్లు అవుతున్నది. ఫేస్బుక్, వాట్సాప్, ఎక్స్ లాంటివి ఎన్నో పుట్టుకొచ్చినా ఎస్ఎంఎస్కు ఆదరణ తగ్గకపోగా, రోజురోజుకూ పెరుగుతున్నది. వ్యాపార విస్తరణ.. డాక్టర్ల అపాయింట్మెంట్స్.. ఆఫర్లు.. నోటిఫికేషన్లు.. అలర్ట్‌లు.. ఇలా ఏ రంగంలో చూసినా కీలకంగా మారింది. సంతోషం, దుఃఖం.. పుట్టిన రోజు, పెళ్లి రోజు.. ఇలాంటి అన్నింటిలోనూ పైచేయి సాధిస్తున్నది. జర్మనీలో మొదలైన ఈ చిట్టి సందేశం సమాచార రంగంలో పెను సంచలనం సృష్టిస్తున్నది. నేడు ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలకూ విస్తరించి, కోట్లాది రూపాయల వ్యాపారానికి పెట్టుబడిగా మారిన ఎస్ఎంస్పై ప్రత్యేక కథనం..
ఓ పది మందితో ఫోన్ మాట్లాడాలంటే ఇబ్బందే. ఎక్కువగా మాట్లాడితే విసుగొస్తుంది. అయినా, ప్రతి దానికి ఫోన్ మాట్లాడలేం. కొన్నిసార్లు ఇతరుల విలువైన సమయాన్ని హరించిన వాళ్లమూ అవుతాం. అందుకే ఎస్ఎంఎస్కు ప్రాధాన్యం పెరుగుతూనే ఉన్నది. మనదేశంలోనే కాదు, ఇతర దేశాల్లోనూ వాడకం విపరీతంగా ఉంటున్నది. స్నేహితులతో ముచ్చటించేందుకే కాదు, బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి, పరీక్ష ఫలితాలు, మొబైల్ బిల్స్, ప్రయాణ వివరాలు తెలుసుకోవడంతోపాటు ఇతర సమయాల్లోనూ ఈ మెసేజ్ కీలకమవుతున్నది.
ఏటా ఎస్ఎంస్ మార్కెట్ విలువ విస్తరిస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా రోజుకు 23 బిలియన్ల మంది ఎస్ఎంఎస్లు వినియోగిస్తున్నట్లుగా తాజా సర్వేల్లో వెల్లడైంది. ప్రపంచ గణాంకాల ప్రకారం చూస్తే అన్ని నెట్‌వర్క్‌ల నుంచి కలిపి సెకన్‌కు 15.97 లక్షల మెస్సేజ్‌లు వెళ్తున్నాయంటే ఈ పొట్టి సందేశం ఎంతగా అల్లుకు పోయిందో అర్థమవుతున్నది. మన దేశంలో చూస్తే.. ప్రతి నెలా సగటున ఒక భారతీయుడు 29 నుంచి 60 మెస్సేజ్‌లు వినియోగిస్తున్నట్టు పలు నివేదికల్లో వెల్లడైంది. ఈ శాతం రోజురోజుకూ పెరుగుతున్నది. ముంబై, కోల్‌కతా, బెంగళూర్, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్‌లో 80 శాతానికి పైగా మంది ఎస్ఎంఎస్లు ఉపయోగిస్తున్నారు. రోజువారీగా చూస్తే.. యువకులు 72 శాతం, 18 నుంచి 24 ఏండ్ల మధ్య వయసున్న వారు 82 శాతం, 25 నుంచి 35 ఏండ్ల వయసున్న వారు 78 శాతం, 35 నుంచి 49 ఏండ్ల వారు 63 శాతం, 50 నుంచి 64 ఏండ్ల వారు 39 శాతం, 65 ఏళ్ల పై బడిన వారు 30 శాతం మంది ఈ పొట్టి సందేశానికి దాసోహమంటున్నారు.
మెసేజ్.. ఎన్నో అనుభూతులకు వేదిక. సంతోషాలను పంచుకునేందుకు.. ప్రేమను వ్యక్తం చేసేందుకు.. స్నేహాన్ని విస్తరించేందుకు.. బంధాలను ధ్రుడపరిచేందుకు.. క్షమాపణలు తెలిపేందుకు.. శుభాకాంక్షలు చెప్పేందుకు ఉపయోగపడుతాయి. కొన్ని సందేశాలు నవ్విస్తాయి.. మురిపిస్తాయి.. మరికొన్ని ప్రేమను పంచుతాయి.. ఇంకొన్ని బాధల్లో భరోసానిస్తాయి.. కొత్త అవకాశాలను కల్పించే కల్పతరువులవుతాయి.. అందుకే పాఠశాలలకు వెళ్లే పిల్లాడి నుంచి వృద్ధుల వరకూ ప్రతి ఒక్కరినీ ఆకర్శిస్తున్నాయి. రోజురోజుకూ మరింతగా చేరువవుతున్నాయి.
ఎస్ఎంఎస్ ఓ మార్కెటింగ్ టూల్గానూ విస్తరించింది. అన్ని వాణిజ్య ప్రకటనలు మెసేజ్‌ల ద్వారానే వినియోగదారులకు చేరే సదుపాయం అందుబాటులోకి రావడంతో మరింతగా విస్తరిస్తున్నది. తమ ఉత్పత్తులపై తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రచారానికి బల్క్ ఎస్ఎంస్ పద్ధతిని వినియోగిస్తున్నారు. మొబైల్స్‌కు వస్తున్న వాణిజ్య ప్రకటనలను చూసి ప్రతి ముగ్గురిలో ఒకరు స్పందిస్తున్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. తద్వారా ఆ ఉత్పత్తుల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య ఎస్ఎంఎస్ల మార్కెట్ విలువ దాదాపు 40 వేల కోట్ల పైనే ఉంటుందని వివిధ సర్వేలు చెబుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. మార్కెట్ యావత్తు ఎస్ఎంఎస్లతో విడదీయలేని బంధం ఏర్పడింది. దవాఖానలు, ట్రావెల్స్, విమాన టికెట్లు, కార్గోలు, హెల్త్‌కేర్, అలర్ట్‌లు, బ్యాంకు, ఆన్లైన్ లావాదేవీలు, ఓటీపీలు ఇలా ఏ రంగంలోనైనా ఎస్ఎంఎస్ ప్రముఖ పాత్ర పోషిస్తున్నది.
సందేశాలను పంపేందుకే కాదు.. పోటీలు నిర్వహించేందుకూ ఈ పొట్టి సందేశాన్ని వినియోగిస్తున్నారు. టీవీ చానెళ్లు, రేడియోలు, వెబ్సైట్లు, ఇలా అన్నింటా ఎస్ఎంఎస్ కాంటెస్ట్ హవా కొనసాగుతున్నది. అందులో టీవీలు అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. టీవీల్లో జరిగే పోటీలు దాదాపు 86.9 శాతం ఎస్ఎంఎస్ల ద్వారానే సాగుతున్నాయి. రేడియోల్లో 38.9 శాతం, వెబ్సైట్లలో 50.7 శాతం, పత్రికల్లో 48.2 శాతం, మ్యాగజైన్లలో 37.3 శాతం పోటీలకు ఈ బుల్లి సందేశాలను వినియోగిస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా టీవీల్లో జరిగే ఎస్ఎంఎస్ కాంటెస్టుల ఆదాయం నెలకు రూ.వేల కోట్లలో ఉంటుంది. 160 అక్షరాలతో ప్రారంభమైన పొట్టి సందేశం వ్యాపారంలో మాత్రం లెక్కలను మించుతున్నది. 38 సంవత్సాలు పూర్తి చేసుకుంటున్న ఈ ఎస్ఎంఎస్కు సమాచార రంగంలో ఎప్పుడూ రారాజుగానే ఉంటుందని నిపుణులు చెపుతున్నారు. భవిష్యత్తులో ఎలాంటి విప్లవాలు వచ్చినా.. ఎస్ఎంఎస్ స్థానం మాత్రం పదిలమే అంటున్నారు.