Konaraopet | కోనరావుపేట, ఫిబ్రవరి 27 : మామిడిపల్లి మహాదేవా శివాలయంలో శివపార్వతుల కల్యాణ వేడుక వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కల్యాణ వేదికను మామిడితోరణాలు, రంగురంగుల పూలతో అత్యంత సుందరగా అలంకరించారు. అర్చకులు తిరునహరి కృష్ణ, కొంచకంటి హరిశర్మ, లక్ష్మణ్స్వామి ఆధ్వర్యంలో కల్యాణ వేడుకలు జరిగాయి. మొదట స్వామి, అమ్మవార్ల విగ్రహాలను అలంకరించి.. ఆ తర్వాత స్వామివారి ఎదుర్కొలు ఉత్సవం నిర్వహించారు. అనంతరం భక్తుల జేజేద్వానాల మధ్య మంగళవాయిద్యాలు, మేళతాళాలు, వేదమంత్రోచ్ఛారణల ఉత్సవమూర్తులను మండపంలోకి వేంచేపు చేసి.. కల్యాణ తంతు నిర్వహించారు.
వేదామంత్రోచ్ఛారణలు, భక్తుల శివనామస్మరణ మధ్య స్వామివారు అమ్మవారి మెడలో మంగళ్యాధారణ చేశారు. కల్యాణ వేడుకకు గ్రామస్తులు, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి కల్యాణాన్ని వీక్షించారు. పలువురు భక్తులు ఈ సందర్భంగా మొక్కులు చెల్లించారు. ఆలయ కమిటీ సభ్యులు దాతలు, గ్రామస్తుల సహకారంతో అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శాశ్వత దాతలకు ఆలయ కమిటీ సభ్యులు శాలువతో సన్మానించి, ప్రసాదాన్ని అందజేశారు. ఇక్కడ ఆలయ కమిటీ చైర్మన్ తీపిరెడ్డి మల్లారెడ్డి, మాజీ సర్పంచ్లు కొక్కుల భారత, పన్నాల విజయ, మాజీ ఉపసర్పంచ్ ఎల్లాల రాంరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.