Dharmaram | ధర్మారం, జులై 14: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తూరు గ్రామంలో లంబాడీల ఆరాధ్య దైవం శీత్లా భవానీ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పెద్దపల్లి డీసీపీ భూక్యా రామ్ రెడ్డి నాయక్ హాజరయ్యారు. గ్రామంలోని తండా మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించగా, పురుషులు ప్రత్యేక తలపాగా ధరించారు. మహిళలు నైవేధ్యం గంపలు తలపై ఎత్తుకొని ఊరేగింపుగా బయలుదేరారు. గ్రామ శివారులోని సమ్మక్క, సారలమ్మ గద్దెల సమీపాన కొలువైన శీత్లా భవానీ ప్రాంతానికి చేరుకున్నారు.
అనంతరం మహిళలు శీత్లా భవానీ దేవతకు నైవేధ్యం పెట్టి మొక్కులు సమర్పించారు. వానలు బాగా కురవాలని, పాడిపంటలు బాగా పండాలని వారు భవానీని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బీ సంగీత, ఏఎంసీ చైర్మన్ ఎల్ రూప్లా నాయక్, సీఐ కే ప్రవీణ్ కుమార్, మాజీ ఉపసర్పంచ్ బానోతు రాజేశ్వరీ రాజేశం నాయక్, లంబాడీల కుల పెద్దలు తదితరులు పాల్గొన్నారు.