కరీం‘నగరం’లో ప్లాస్టిక్ భూతం కోరలు చాస్తున్నది. నియంత్రణ కరువై, నగరాన్ని ముంచేస్తున్నది. అవగాహన లేకనో.. ఏమవుతుందిలే అన్న నిర్లక్ష్యమో గానీ, ఇష్టారాజ్యంగా వాడుతూ.. ఎక్కడ పడితే అక్కడ పడేస్తుండడంతో గుట్టలుగుట్టలుగా పేరుకుపోతున్నది. రోడ్లపైనే కాదు, డ్రైనేజీల్లోనూ నిండిపోతున్నది. ఎక్కడికక్కడ మురుగునీరు నిలిచి కంపు వాసన కొడుతుండగా.. చిన్నవాన పడినా రహదారులపై ఉప్పొంగి రాకపోకలకు అంతరాయం కలుగుతున్నది. బల్దియా యంత్రాంగం ఏటా వానకాలానికి ముందే సిల్ట్ తొలగించాల్సి ఉన్నా.. మూడేళ్లుగా ముందుచూపు కరువైంది. ఇటీవల ‘గాడి తప్పిన పారిశుధ్యం’ శీర్షికన ‘నమస్తే’ ప్రచురించిన కథనంతో డ్రైనేజీల్లో సిల్ట్ తొలగిస్తుండగా, భారీ ఎత్తున ప్లాస్టిక్ వ్యర్థాలు వెలువడుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. కట్టడి చేయని అధికారుల తీరును బయటపెడుతున్నది.
కరీంనగర్ కార్పొరేషన్, జూన్ 25 : స్మార్ట్‌సిటీ కరీం‘నగరం’ ప్లాస్టిక్‌మయంగా మారుతున్నది. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. రోడ్లపైనే కాదు.. డ్రైనేజీల్లోనూ నిండిపోతున్నాయి. నగరంలో ప్రతిరోజూ ఇంటింటి నుంచి చెత్త సేకరణ సాగుతున్నా.. నగరవాసులు ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లను మురుగుకాలువల్లో వేయడంతో నీటి ప్రవాహానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ ఒక్క చోట చేరి, ఎక్కడికక్కడ మురుగునీరు నిలిచిపోతున్నది. రోడ్లపైకి చేరి కంపుకొడుతున్నది. చిన్నవాన పడినా డ్రైనేజీలు అన్నీ బ్లాక్ అయి వరద రోడ్లన్నీ వాగులను తలపిస్తున్నాయి. ఈ సమయంలో రాకపోకలు నిలిచిపోతున్నాయి. రహదారులు, ఖాళీ స్థలాలు, మురుగుకాలువల్లో చెత్త పేరుకుపోవడం, నగరం అధ్వానంగా మారడంపై ఈ నెల 10న ‘నమస్తే తెలంగాణ’లో ‘గాడి తప్పిన పారిశుధ్యం’ శీర్షికన కథనం ప్రచురితం కావడంతో మేయర్ స్పందించి ప్రత్యేక పారిశుధ్య వారోత్సవాలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో డ్రైనేజీలను క్లీన్ చేస్తుండగా, అందులో నుంచి భారీ ఎత్తున ప్లాస్టిక్ వ్యర్థాలు వెలువడుతున్నాయి. ప్రధానంగా వాటర్ బాటిళ్లు, డబ్బాలు, కవర్లు ఉంటున్నాయి. వీటిని చూస్తే ప్లాస్టిక్‌భూతం ఎంతలా పెరుగుతున్నదో అర్థమవుతోంది. ఒక్క కరీంనగర పాలక సంస్థలోనే కాదు.. ఉమ్మడి జిల్లాలోని బల్దియాలన్నింటిలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నది.
బల్దియాల్లో అధికారులు ఏటా నిషేధిత ప్లాస్టిక్ అమ్మకాలు, కొనుగోళ్లపై తనిఖీలు చేస్తూ.. జరిమానాలు విధిస్తున్నామంటూ హడావుడి చేయడమే తప్ప చిత్తశుద్ధితో చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. అంతే కాకుండా, ఆయా ప్లాస్టిక్ వ్యాపారుల నుంచి భారీ మొత్తాల్లో మూమూళ్లు తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో నిషేధిత సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఈ సమస్య ప్రధానంగా కరీంనగరంలో ఉన్నది. ఇటు ప్రజల్లోనూ ప్లాస్టిక్‌పై నిర్లక్ష్యం కనిపిస్తున్నది. అవగాహన లేకనో.. తమకెందుకు అనుకుంటున్నారో గానీ, ప్లాస్టిక్ వస్తువులు ఇష్టారాజ్యంగా వాడుతున్నారు. వినియోగం తర్వాత వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. ఫలితంగా ఆయా ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ రోడ్లు, డ్రైనేజీలకు చేరుతున్నాయి. వరదలు వచ్చినప్పుడు రహదారులపై ఉన్నవి కూడా మురుగుకాలువల్లోకి చేరి నీటి ప్రవాహానికి అడ్డుగా మారుతున్నాయి. దీంతో నగరంలో చిన్నపాటి వాన పడినా వరద రోడ్లపైకి చేరుతున్నది.
కరీంనగరంలో ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్ల వినియోగాన్ని నియంత్రించడంలోనే కాదు, ప్రజలకు కనీసం అవగాహన కార్యక్రమాలు చేపట్టడం లేదు. రోజురోజుకూ పెరుగుతున్న ప్లాస్టిక్ భూతాన్ని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. ముఖ్యంగా విక్రయాలపై కఠినంగా వ్యవహరించడంతోపాటు నగరవాసులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నది. ఇదే సమయంలో విస్తృత ప్రచారం చేయడంతోపాటు ప్లాస్టిక్ వ్యర్థాలను పారేసేందుకు కూడళ్లలో డస్ట్‌బిన్స్ ఏర్పాటు చేయాల్సి ఉన్నది. ఇవేమీ అధికారులకు పట్టడం లేదు. పైగా ముందుచూపు కూడా కరువైంది. ఏటా వానకాలం ముందు అంటే మేలోనే మురుగుకాలువల్లో సిల్ట్ తొలగించాలి. అలా అయితేనే భారీ వర్షాలు పడినా చుక్క నీరు ఆగకుండా.. రోడ్లపైకి రాకుండా వెళ్లిపోతుంది. కానీ, మూడేళ్ల కాలంలో ఎక్కడా కాలువల్లో చెత్త తొలగింపు పనులు చేపట్టిన దాఖలాలు లేవు. డివిజన్లలోని కాలువల్లో ప్లాస్టిక్ పేరుకపోతున్నా.. వాటిని తొలగించే విషయంలో పారిశుధ్య ఇన్స్పెక్టర్లు, సూపర్వైజర్లు పట్టించుకోవడం లేదు. వీరెవరూ క్షేత్రస్థాయిలో పర్యటించకుండా కార్యాలయాలకు, సొంత పనులకు పరిమితమవుతున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ‘నమస్తే’ కథనంతో ఇప్పుడిప్పుడే డ్రైనేజీలను క్లీన్ చేస్తుండగా.. పెద్ద ఎత్తున ప్లాస్టిక్ వ్యర్థాలు వెళ్తుండడం ఆందోళన కలిగిస్తున్నది. ప్రస్తుతం డ్రైనేజీలను త్వరగా క్లీన్ చేయకపోతే.. వర్షాలు పడితే ఎక్కడికక్కడ నిలిచే ముప్పు ఉన్నది. దీంతో నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మురుగు కాలువల్లో సిల్ట్ వేగవంతంగా తొలగించాలని కోరుతున్నారు.