Collector Koya Sri Harsha | పెద్దపల్లి రూరల్ , మే 23: పెద్దపల్లి జిల్లాలో హింసకు గురవుతున్న మహిళలకు సఖీ సెంటర్ ద్వారా అవసరమైన సేవలు అందించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. కలెక్టర్ కోయ శ్రీ హర్ష రంగంపల్లి లోని సఖీ సెంటర్ ను గురువారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ హింసకు గురౌతున్న మహిళలకు సఖీ సెంటర్ ద్వారా రిలీఫ్ రావాలని, ఇటువంటి కెసుల పై అధిక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు.
సఖీ సెంటర్ కు వచ్చిన మహిళల సమస్య పరిష్కారానికి కృషి చేసి వారిని రెగ్యులర్ గా ఫాలో అప్ చేయాలని కలెక్టర్ తెలిపారు. సఖీ సెంటర్ కు వచ్చే బాధితులకు అవసరమైన కౌన్సిలింగ్ అందించాలని, వివిధ కేసులలో అవసరమైన సందర్భంలో న్యాయ సలహా సైతం అందించాలని కలెక్టర్ సూచించారు. గోదావరిఖని లో ఒక మహిళను, ఆమె పిల్లలను 3 సంవత్సరాల పాటు అక్రమంగా నిర్బంధించిన మెస్త్రీ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గోదావరిఖని ఏసీపీని ఆదేశించారు.
ప్రస్తుతం ప్రతీనెల దాదాపు 20 మంది మహిళలు సఖి సెంటర్ ను ఆశ్రయిస్తున్నారని , గ్రామాలలో విస్తృతంగా పర్యటిస్తూ సఖీ సెంటర్ ద్వారా అందించే సేవల గురించి ప్రచారం కల్పించి , సఖి సెంటర్ కు వచ్చే బాధితుల సంఖ్య పెంచాలని కలెక్టర్ అన్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్, సఖీ సెంటర్ కో ఆర్డినేటర్ దారవేన స్వప్నయాదవ్, అధికారులు పాల్గొన్నారు.