కరీంనగర్ నగరపాలక సంస్థలోని 16 మంది పారిశుధ్య కార్మికుల వేతనాలను నిలిపివేసినట్టు తెలుస్తున్నది. అయితే నియామకాలకు సీడీఎంఏ అనుమతి లేకపోవడం వల్లే ఆడిట్ విభాగం అధికారులు జీతాలు ఆపివేసినట్టు తెలిసింది. దీంతో నియామకాల్లో కీలక పాత్ర పోషించిన ఓ అధికారి, చెల్లింపులపై సీడీఎంఏకు లేఖ పెట్టించినట్టు ప్రచారం జరుగుతున్నది.
కరీంనగర్ కార్పొరేషన్, జూలై 26 : నగర బల్దియా పారిశుధ్య విభాగంలోని ఓ అధికారి.. కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) అనుమతులు లేకుండానే గత మార్చిలో ఔట్ సోర్సింగ్ విధానంలో 16 మందిని నియమించుకున్నారు. మూడు నెలల పాటు వేతనాలు మంజూరు చేశారు. అయితే అందులో కిందిస్థాయి అధికారుల నుంచి ఉన్నతాధికారుల వరకు ముడుపులు ముట్టాయన్న ఆరోపణలు రాగా, ఇదే విషయాన్ని మార్చి 12న ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తెచ్చింది.
‘బల్దియాలో ఇష్టరీతిగా నియామకాలు’ అనే శీర్షికన కథనం ప్రచురించింది. సీడీఎంఏ నుంచి అనుమతులు లేకుండా నియామకాలు చేపట్టిన విషయాన్ని బహిర్గతం చేసింది. ఇది అప్పట్లో కలకలం రేపింది. ఇటీవల అంటే ఈ నెల 12న సీడీఎంఏ జీవో నంబర్ 1181ను విడుదల చేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నగరపాలక సంస్థలో ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న కార్మికుల సంఖ్యను వెలువరించడంతోపాటు కొత్తగా ఎలాంటి నియమకాలను చేపట్టవద్దంటూ సృష్టం చేసింది. దీంతో ఆడిట్ విభాగానికి చెందిన అధికారులు ఈ నూతన కార్మికులకు సంబంధించి వేతనాల బిల్లుల చెల్లింపునకు అడ్డు చెప్పినట్టు తెలిసింది.
సీడీఎంఏ నుంచి అనుమతులు లేకపోవడం వల్లే బిల్లులు ఆపేశారనే ప్రచారం జరుగుతున్నది. అయితే వీరి నియామకాల్లో కీలకపాత్ర పోషించిన సదరు అధికారి, ఇప్పుడు వేతనాలు మంజూరు చేయించేందుకు ఉన్నతాధికారులతో సీడీఎంఏకు లేఖ పెట్టించినట్టు తెలిసింది. ఆ అనుమతులు రాకుంటే బల్దియా ఉన్నతాధికారులు ఏం చేస్తారోననే చర్చ సాగుతున్నది. ఐదు నెలల నుంచి కార్మికులు పని చేస్తుండగా.. మూడు నెలల వేతనాలు ఎలా ఇచ్చారు? ఇప్పుడు సీడీఎంఏ అనుమతి ఇవ్వకపోతే వారి ఎలా చెల్లింపులు చేస్తారన్న చర్చ జరుగుతున్నది.
పారిశుధ్య విభాగంలో సీడీఎంఏ అనుమతులు లేకుండానే కార్మికుల నియామకాలు జరుగుతున్నాయన్న విషయం వెలుగులోకి వచ్చినా.. పాలకవర్గం, ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ప్ర భుత్వ అనుమతులు లేకుండానే ఎందుకు నియామకాలు చేశారన్న ప్రశ్నలు కూడా వెల్లువెత్తుతున్నాయి. కాగా, ఈ నియమకాల్లో పలువురు బల్దియా ప్రజాప్రతినిధులకు చెందిన అనుయాయులు ఉండడం.. రూ.లక్షల్లో ముడుపులు చేతులు మారడం వల్లే చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంలో ఇప్పటికైనా ఉన్నతాధికారులు, పాలకవర్గం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.