Vemulawada | వేములవాడ, జనవరి 7: ఇసుక అక్రమ రవాణా వ్యవహారంలో సాక్షాత్తు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరీమ అగ్రవాల్ వేములవాడ తహసీల్దార్ కార్యాలయ ఉద్యోగిని సస్పెన్షన్ చేసినా ఉద్యోగుల పనితీరులో ఎలాంటి మార్పు రాలేదు. బుధవారం ప్రభుత్వ పనులకు వేములవాడ తహసీల్దార్ కార్యాలయ అధికారులు ఇసుక రవాణాకు అనుమతిని ఇచ్చారు. అయితే ఇందుకు సంబంధించి కార్యాలయం నుండి కొందరు ఉద్యోగులకు విధులు కేటాయించగా మూలవాగు వద్దకు వెళ్లి వేబిల్ అందజేస్తూ ఇసుక రవాణాను పర్యవేక్షించాల్సి ఉంది.
అయితే సమయానికి ముందే ఇసుక నింపుకోవడమే కాకుండా మూలవాగు నుండి అక్రమంగా తరలిస్తుండగా బ్లూకోట్ పోలీసులు పట్టుకొని ఇసుక ట్రాక్టర్ను తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. రవాణా చూస్తున్న సంబంధిత ఉద్యోగుల నిర్లక్ష్యానికి అక్రమ ఇసుక తరలింపు వ్యవహారమే పట్టుబడిన ట్రాక్టర్ తీరే తెలుస్తోంది. అయితే ఈ విషయమై తహసీల్దార్ విజయప్రకాష్ రావును వివరణ కోరగా అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ ను పట్టుకున్నామని సంబంధిత ట్రాక్టర్లు సీజ్ చేయడంతో పాటు యజమానిపై పోలీసు చర్యల నిమిత్తం పంపుతామని తెలిపారు.